జీపీఎస్ తుస్
ABN , Publish Date - Jan 28 , 2026 | 01:07 AM
పట్టణాలు, నగరాల్లో అనధికారికంగా ప్లాన్‌లు లేకుండా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు బిల్డింగ్ ఫీనలైజేషన్ స్కీమ్(బీపీఎస్)కు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని పాలకవర్గాలు, అధికారులు సద్వినియోగం చేసుకోవడం లేదు.
తూతూ మంత్రంగా దరఖాస్తులు
చోద్యం చూస్తున్న టౌన్‌ప్లానింగ్
జిల్లాలో కొత్త దరఖాస్తులు 269.. ఆదాయం అంతంతే
పట్టణాలు, నగరాల్లో అనధికారికంగా ప్లాన్‌లు లేకుండా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు బిల్డింగ్ ఫీనలైజేషన్ స్కీమ్(బీపీఎస్)కు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని పాలకవర్గాలు, అధికారులు సద్వినియోగం చేసుకోవడం లేదు. బీపీఎస్‌కు అనుమతి ఇస్తూ పురపాలక శాఖ గత నెల 12న ప్రత్యేక జీవో జారీచేసింది. దీని ప్రకారం మార్చి 11 వరకు దరఖాస్తుల స్వీకరణ గడువును విధించారు. 1985 జనవరి ఒకటో తేదీ నుంచి అంతకు ముందు తేదీలతో పాటు గతేడాది ఆగస్టు 31వ తేదీ కటాప్‌గా తీసుకుంటే ఆ కాలంలో నిర్మించిన అక్రమంగా నిర్మించిన భవనాలు, అంతస్తులను క్రమబద్ధీక రించుకోవడానికి నిర్ణయం తీసుకుంది.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి):
బీపీఎస్‌పై బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అధికారులు అవగాహన కల్పించేందుకు మేళాలు నిర్వహించాలి. కాని ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. కనీసం పురపాలక సంఘ కార్యాలయాల వద్ద బ్యానర్లు, ఫ్లకార్డుల ప్రదర్శించడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు 269 దరఖాస్తులే అందగా అఽధికారులు ఆమోదించినవి మాత్రం కేవలం మూడే. మిగిలిన వాటిని పరిష్కరించడంలో ఎందుకు అలక్ష్యం వహిస్తున్నారో అంతుబట్టడం లేదు. చింతలపూడి మునిసిపాలిటీలో 23 దరఖాస్తులకు ఒకదానికి అనుమతి ఇచ్చారు. దరఖాస్తుల రూపేణా ఆ సంస్థకు రూ.3.04 లక్షలు ఆదాయం సమకూరింది. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో 165 దరఖాస్తులందగా రూ.16.5 లక్షల ఆదాయం వచ్చింది. జంగారెడ్డిగూడెంలో 33 దరఖాస్తులకు రూ.3.3 లక్షలు ఆదాయం సమకూరింది. నూజివీడులో 58 దరఖాస్తులు రాగా రెండింటికి క్రమబద్ధీక రణకు అనుమతించగా రూ.7.09 లక్షల ఆదాయం సమకూరింది. ఇప్పటి వరకు వచ్చిన బీపీఎస్ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తే స్థానిక సంస్థలకు మరింత ఆదాయం సమకూరుతుంది.
ఎవరిదీ బాధ్యత
అనధికారిక భవనాలకు అనుమతులు ఇచ్చేసి భారీగా అక్రమాలకు పాల్పడిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ దరఖాస్తులను పరిష్కరించాల్సిన బాధ్యత వారికే రావడంతో ఎక్కడ తమ తలకు చుట్టుకుంటుందోనన్న మీమాంసతో అవగాహన కల్పించే దిశగా ముందుకెళ్లడం లేదు. ప్రతీ వారం బీపీఎస్ మేళాలను నిర్వహించి.. దరఖాస్తుదారులతో కలిసి ఎక్కడ సమస్యలున్నాయో ? దరఖాస్తుతో పాటు ఏమేమీ సమర్పించాలన్న విషయాలపై చర్చ సాగడం లేదు. ఈ విషయంలో కమిషనర్లు తమకు సంబంధం లేనట్లుగా పురపాలక సంఘాల్లో తప్పించుకుంటున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు ఏళ్లకు ఏళ్లు ఉన్న ప్రాంతంలోనే పాతుకుపోవడంతో అసలు అక్రమ భవనాలవైపే కన్నెత్తి చూడడం లేదు. టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణ, నిర్లక్ష్యం, పట్టింపులేమి దరఖాస్తుదారులు ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణం. ఏలూరులో పరిస్థితి మరీ దారుణం. ఏళ్లకు ఏళ్లు పాతుకుపోయిన ఓ అధికారి హవానే కొనసాగుతోంది. డిప్యూటీ సిటీ ప్లానర్‌గా ఇడాలో వున్న ఒక అధికారిణి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుండడంతో ఏలూరు టౌన్‌ప్లానింగ్ వ్యవస్థ గాడి తప్పింది. ప్రజా ప్రతినిధుల చేతుల్లో కొందరు అధికారులు కీలు బొమ్మలుగా మారాన్న ఆరోపణలున్నాయి.