ఆక్వా రైతుకు ప్రభుత్వం అండ
ABN , Publish Date - Jul 15 , 2026 | 01:06 AM
కూటమి ప్రభుత్వంలో ఆక్వా రంగానికి పెద్ద చేయూతే లభించింది. వైసీపీ ప్రభుత్వంలో ఆక్వా, నాన్ ఆక్వాజోన్‌ల కింద విద్యుత్ కనెక్షన్లు విభజన లేకపోవడంతో రైతులు లక్షల్లో కరెంట్ బిల్లుల భారం మోశారు.
వైసీపీ హయాంలో ట్రూ అప్ మోత
ప్రస్తుతం అందరికీ రూ.1.50కే విద్యుత్
గత ప్రభుత్వంలో ధరల పతనం
కూటమి ప్రభుత్వంలో రైతుకు ఊరట
కూటమి ప్రభుత్వంలో ఆక్వా రంగానికి పెద్ద చేయూతే లభించింది. వైసీపీ ప్రభుత్వంలో ఆక్వా, నాన్ ఆక్వాజోన్‌ల కింద విద్యుత్ కనెక్షన్లు విభజన లేకపోవడంతో రైతులు లక్షల్లో కరెంట్ బిల్లుల భారం మోశారు. వైసీపీ పాలనలో ఆక్వారంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సమస్యలకు చెక్ పెడుతూ ఆక్వాకు వెన్నుదన్ను నిలిచింది. ఏలూరు జిల్లాలో 1.75 లక్షల ఎకరాల్లో చేపలు, రొయ్యలు చెరువులు సాగవుతున్నాయి. ఆక్వాజోన్ కింద వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ సబ్సిడీలు కేవలం 30 వేల ఎకరాల లోబడి ప్రయోజనం ఇవ్వడంతో రైతులు లబ్ధిపొందలేకపోయారు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
వైసీపీ పాలనలో ఆక్వా రైతులు విద్యుత్ చార్జీల భారం, ఆక్వా ఉత్పత్తులకు ధరలేక నష్టాల్లో కూరుకు పోయారు. ఆక్వా, నాన్ ఆక్వా జోన్ నిబంధనలతో రైతులు సతమతం అయ్యారు. కూటమి ప్రభుత్వం నాన్ ఆక్వా జోన్ ఎత్తివేయడంతో రైతుకు వెసులుబాటు కలిగింది. అప్పట్లో యూనిట్‌కు ఆక్వాకు రూ.2.85 వసూలు చేశారు. దీంతో లక్షల్లో బిల్లులు ఆక్వా రైతుకు తడిసి మోపైడైంది. చేపలు, రొయ్యల మేత ధర ఆకాశాన్నంటడంతో రైతులు నష్టాల్లో కొట్టుమిట్టాడేవారు. ఆక్వా రంగానికి విద్యుత్ సర్వీసుల కోసం ట్రాన్స్‌ఫార్మర్లు టీడీపీ పాలనలో 2014–19లో విద్యుత్ శాఖ సొంత ఖర్చులతో అమర్చే వారు. దాన్ని వైసీపీ ప్రభుత్వం ఎత్తివేసి 25 హార్స్‌పవర్ ట్రాన్స్‌ఫార్మర్లకు రూ.3 లక్షలు, 60 హార్స్‌పవర్ ట్రాన్స్‌ఫా ర్మర్లకు రూ. 5లక్షల నుంచి రూ.6లక్షలు వరకు చార్జీలు వసూలు చేసేవారు. కూటమి రెండేళ్ల పాలనలో ఆక్వా, నాన్ ఆక్వాజోన్ పరిధిని తీసేసి మొత్తం అప్సడా పరిధి లోకి తీసుకురావడం వలన 1.40 లక్షల రైతులకు మేలు జరిగింది. ఆక్వాజోన్ ఏర్పాటుతో ప్రభుత్వం అందించే రాయితీలు చిన్న, సన్నకారు రైతుల నుంచి 20 ఎకరాల పైబడి ఉన్న రైతులకు అందేవి. ఆక్వా జోన్‌లో విద్యుత్ సర్వీసుకు రూ.1.50 పైసలకు యూనిట్ విద్యుత్‌ను టీడీపీ ప్రభుత్వం అమలు చేసే దిశగా ఇటీవల ప్రభుత్వం అడుగులు వేసింది. ఇటీవల మేత ధరలను కూడా కేజీకి రూ.4 భారం తగ్గించడంతో రైతులు ఉత్సాహంగా ఆక్వా పంటల సాగును చేస్తున్నారు.
ధర అనుకూలం
కూటమి ప్రభుత్వంలో రొయ్యకు వంద కౌంట్ మద్దతు ధర రూ.240 ప్రకటించినా ఎగుమతిదార్లు రూ.250 వరకు కొనుగోలు చేస్తున్నారు. వైసీపీ హయాంలో ఇటువంటి
ప్రకటనలు చేసినప్పటికీ ధర మాత్రం పెరగలేదు. వంద కౌంట్ రొయ్య రూ.210 ధరకు కొనుగోలు చేయడం కష్టమై పోయింది. మేత పరిశ్రమలు, ప్రాసెసింగ్ పరిశ్రమల నుంచి జె టాక్స్ వసూలు చేయడం వల్లే రొయ్యకు ధర ఇవ్వలేకపోతున్నారంటూ వైసీపీ హయాం లో విమర్శలు సర్వసాధారణం అయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్వా రంగం కాస్త కుదుటప డడంతో రైతులకు ఊరట లభించింది. గత ప్రభుత్వంలో కరోనా పేరుచెప్పి 100 కౌంట్ రొయ్య రూ.100కు కొను గోలు చేశారు. ఆ తర్వాత వ్యాపారులకు పెద్ద లాభాలే వచ్చి పడ్డాయి. కరోనా నుంచి గట్టెక్కిన తర్వాత కూడా రూ.220కు మించి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ప్రస్తు తం ఒక దశలో వంద కౌంట్ రూ.270 వరకు వెళ్లింది.
ఆక్వాకు నాణ్యమైన విద్యుత్
కూటమి ప్రభుత్వం ఏలూరు జిల్లాలోని కైకలూరు మండలం గోపవరంలో రూ.50కోట్లతో 220 కిలోవాట్లు విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మరో నెలలో ఆక్వా రంగానికి నాణ్యమైన విద్యుత్ అందనుంది. భవిష్యత్‌లో మరిన్ని చోట్లకు విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు అందరికి ఉపయోగపడేలా ఆక్వా విస్తారంగా ఉన్న కైకలూరు నియోజకవర్గంలో నాలుగు మండలాలు పరిధిలోని రైతులకు ఆటంకం లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు నాలుగు చోట్ల 33 కేవీ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలో 2024–25 సంవత్సరంలో ఆక్వా కింద 12,45,148 మెట్రిక్ టన్నుల ఎగుమతులు చేశారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 29,211 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వృద్ధి సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన ఏడాదిలో తీవ్ర సంక్షోభం వలన 10,26,636 మెట్రిక్ టన్నులు ఉత్పత్తిని ఏలూరు జిల్లా సాధించింది.
పశ్చిమ పర్యటలో చంద్రబాబు ప్రకటన
ఇటీవల చంద్రబాబు సిద్ధాంతం పర్యటనలో ఆక్వా రైతులందరికీ రూ. 1.50పైసలకే యూనిట్ విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. నాన్ ఆక్వాజోన్ నుంచి విముక్తి పొందిన రైతులకు రాయతీ వర్తింప చేస్తామని ప్రకటించారు. రెండు రోజుల వ్యవధిలోనే ఉత్వర్వులు జారీచేయడంతో అమలులోకి వచ్చింది. పెద్ద రైతులకు కూడా రాయతీ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులు ఈ విషయంలో సంతృప్తిగా ఉన్నారు. ట్రూ అప్ చార్జీల భారం కూడా లేదు. వైసీపీ హయాంలో అదనపు లోడ్ తీసుకు న్నారని, ట్రూఅప్ చార్జీలంటూ రైతులపై భారం మోపారు. వైసీపీ హయాంలో 10 ఎకరాకలు పైబడిన రైతులకు రాయితీ లేదు. ఆక్వాజోన్‌లో సైతం పరిమితి విధించారు. కూటమి ప్రభుత్వం నాన్ ఆక్వాజోన్ తొలగించి 10 ఎకరాలపై ఉన్న రైతులకు కూడా రూ. 1.50పైసలకే విద్యుత్ రాయితీ అమలు చేస్తోంది.
మేత ధరలో కాస్త ఇబ్బంది
మేత ధర విషయంలో ప్రభుత్వం, రైతుల మధ్య అవగాహన మేరకు కంపెనీలు ధర తగ్గించలేదు. ప్రభుత్వం కిలోకు రూ.4 ధర తగ్గించాలని సూచించింది. కంపెనీలు మాత్రం గరిష్ఠంగా రూ.2.50 తగ్గించాయని రైతులు మళ్లీ ప్రభుత్వానికి వినతులు సమర్పించారు. ధర తగ్గించేందుకు కంపెనీలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ముడిసరుకు ధర పెరగడంతో కంపెనీలు మేత ధర పెంచాల్సి వచ్చింది. ఒకేసారి ధర పెరిగితే ఇబ్బంది పడతామని రైతుల వినతితో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
నేడు ఆక్వా రైతులతో జగన్ సమావేశం
భీమవరం టౌన్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భీమవరంలో ఆక్వా రైతులతో బుధవారం సమావేశం కానున్నారు. జగన్ పర్యటన పురస్కరించుకుని వైసీపీ జిల్లా నాయకత్వం కొద్ది రోజులుగా ఏర్పాట్లు చేపడుతున్నారు. హెలీప్యాడ్‌కు అనుమతిపై కొంత సందిగ్ధతతో ఆయన పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. లూఽథరన్ ఉన్నత పాఠశాలఆవరణలో హెలీప్యాడ్‌కు అనుమతి రావడంతో నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. జగన్ ఉదయం 10.30 గంటలకు హెలికాఫ్టర్‌లో భీమవరం చేరుకుని బైపాస్ రోడ్డులో మీటింగ్ ప్రాంతానికి చేరుకుంటారు. 11 గంటల నుంచి 12.30 వరకు జిల్లా ఆక్వా రైతులతో సమావేశం అవుతారని వైసీపీ నాయకులు తెలిపారు.