బడికి పోదాం చలో చలో..
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:14 AM
సర్కారు బడులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఇటు ప్రభుత్వం, అటు ఉపాధ్యాయ సంఘాలు రూటు మార్చాయి. 2025–26 విద్యా సంవత్సరంలోనే ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ప్రభుత్వానికి ఉపాధ్యాయులు బాసటగా నిలుస్తున్నారు.
సర్కారీ స్కూళ్లలో పిల్లలను పెంచేందుకు ప్రణాళిక
సౌకర్యాలపై ఉపాధ్యాయ సంఘాల ప్రచారం
వచ్చే నెలలో 9వ తరగతి విద్యార్థులకు టెన్త్ పాఠాలు
బడి బయటకు వెళ్లిన వారిని వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నాలు
భీమవరం రూరల్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): సర్కారు బడులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఇటు ప్రభుత్వం, అటు ఉపాధ్యాయ సంఘాలు రూటు మార్చాయి. 2025–26 విద్యా సంవత్సరంలోనే ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ప్రభుత్వానికి ఉపాధ్యాయులు బాసటగా నిలుస్తున్నారు. ఇప్పుడు మరో ప్రయత్నంలో ఉపాధ్యాయ సంఘాలు ముందుగానే స్పందిస్తున్నాయి. విద్యా శాఖ ఆదేశాలు రాక ముందే ప్రభుత్వ బడులను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెంచే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలపై ప్రచారం చేస్తున్నారు. విద్యా సామ గ్రి, మధ్యాహ్న భోజనం, ఉన్నత విద్య వంటి అనేక కార్యక్రమాలను తల్లిదండ్రులకు చేరవేయనున్నారు. విద్య నాణ్యతను వివరించనున్నారు.
విద్యార్థుల సంఖ్య పెరగాల్సిందే
ప్రభుత్వ బడుల్లో పడిపోతూ వున్న విద్యార్థు ల సంఖ్యను నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. గత ప్రభుత్వ హయాంలో 2021–22 నుంచి 2024–25 వరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థుల సంఖ్య లక్షా 38 వేల నుంచి 90 వేలకు పడిపోయింది. దానిని పెంచేందుకు ప్రభుత్వం విధి విధానాల్లో ఎన్నో మార్పులు తెచ్చింది. వచ్చే సంవత్సరం నుంచి ఫలితాల కోసం ఎదురుచూస్తోంది.
వారికి టెన్త్ సిలబస్ బోధన
జిల్లాలోని 239 ప్రభుత్వ పాఠశాలల్లో 12,483 మంది తొమ్మిదో తరగతి విద్యార్థులకు మార్చి 15వ తేదీకల్లా పరీక్షలు పూర్తి చేసి తదుపరి నెల రోజులపాటు టెన్త్ సిలబస్ చెప్పే ప్రణాళిక సిద్ధం చేశారు. ఇలా చేయడం ద్వారా పదిలో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్యార్థులు ఉత్తీ ర్ణత సాధిస్తారని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ విద్యను కాపాడుకుందాం
ప్రభుత్వ బడిలో చదువు, సంస్కారం, నైతిక విలువ లు, దేశభక్తి, సమానత్వ భావన ఏర్పడుతుంది. ఎంత మంది ఉన్నత స్థానాల్లో వున్నా వారు ప్రభుత్వ బడుల్లో చదివిన వారే. అందువల్ల బడి ఈడు పిల్లలను వచ్చే విద్యా సంవత్సరం ముందు నుంచి ప్రభుత్వ బడుల్లో చేర్పించేలా యూటీఎఫ్ తరపున ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు.
– విజయరామరాజు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి
ప్రభుత్వ బడులు బలోపే తానికి యూటీఎఫ్ నడుం బిగించింది. ఇంటింటికీ ప్ర చారం చేస్తున్నాయి. పాఠశాలల్లోని సౌకర్యాల పాంప్లెట్‌లను పంచనున్నాం. బడిలో విద్యార్థుల సంఖ్య పెంచడమే మా లక్ష్యం.
– పుల్లారావు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి
యూటీఎఫ్ పిలుపు
ప్రభుత్వ బడుల్లో ఫిబ్రవరి నుంచి పిల్లలను చేర్పించేందుకు ప్రచారం చేయాలని సంఘం తరఫున పిలుపునిచ్చింది. ప్రభుత్వం నుంచి ఉపాధ్యాయులకు సూచనలు రానున్నాయి. దీనిపై సంఘాలు ముందుగానే స్పందించి బడులలో పిల్లల సంఖ్యను పెంచి బలోపేతం చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. మరోపక్క గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఐలు, దాతలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నారు. గత ఏడాది టెన్త్‌లో ప్రతిభ కనబరిచిన టాప్ ముగ్గురు విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు. ఈసారి ఆకివీడు మండలంలోని ఒక పాఠశాలలో విద్యార్థులకు దాతలు ఆఫర్ ప్రకటించారు. టౌన్‌లో ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులకు పైచదువులకు వారే ఫీజు లు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ప్రభుత్వం, ఉపాధ్యాయ సంఘాలు, దాతలు ప్రభుత్వ పాఠశాలల్లో బలోపేతం చేసేలా అడుగులు వేస్తున్నారు.