మామిడి రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:42 AM
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, మామిడి రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులు సాధించేందుకు ముందుకు సాగాలని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి అన్నారు.
మంచి ధర వచ్చేందుకు చర్యలు
ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి
నూజివీడు, మార్చి 10(ఆంధ్రజ్యోతి): రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, మామిడి రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులు సాధించేందుకు ముందుకు సాగాలని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి అన్నారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో నూజివీడులో మామిడి కొనుగోలు, అమ్మకందార్లకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. చిరంజీవి చౌదరి మాట్లాడుతూ రైతులకు అవసరమైన డ్రిప్ ఇరిగేషన్, ఇతర యంత్ర పరికరాలను, కోల్డ్ స్టోరేజీలను ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తుందన్నారు. రైతులు నాణ్యమైన దిగుబడులను సాధించగలిగితే ఇతర రాష్ట్రాలలోని మామిడి కొనుగోలుదారులను రప్పించి మంచి ధర ఇప్పించడం జరుగుతుందన్నారు. రైతులు తగు జాగ్రత్త వహించి మంచి నాణ్యమైన మామిడికాయలను ఉత్పత్తి చేయాలని సూచించారు. ఏలూరు జిల్లా మైక్రో ఇరిగేషన్ పీడీ రాంమోహన్‌రావు మాట్లాడుతూ మామిడి రైతులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని మొక్కకు అందిస్తే మంచి ఫలితాలు వచ్చి కాయ నాణ్యంగా ఉంటుందన్నారు. మామిడి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త బి.కనక మహాలక్ష్మి నాణ్యమైన దిగుబడులు సాధించడానికి సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి షాజనాయక్, నూజివీడు ఉద్యాన అధికారి హేమ, కాపా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.