మున్సిపోల్స్.. ముందుకే
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:27 AM
మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
సమీప గ్రామాలు విలీనమైనా.. కాకున్నా ఎన్నికల దిశగా ప్రభుత్వం
హైకోర్టు కేసులపై సంప్రదింపులు..
ఎమ్మెల్యేలకు బాధ్యతల అప్పగింత
కేసుల ఉపసంహరణకు వీలు కాకుంటే.. పాత పద్ధతిలోనే..
టీడీపీ తర్జనభర్జన
భీమవరం నియోజకవర్గంలో తీర్మానం
మునిసిపల్ ఎన్నికల దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసులు వేసిన వారితో సంప్రదించి సమస్యను పరిష్కరించే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించింది. కేసు ఉపసంహరణకు అంగీకరించకపోతే పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లేందుకు నిర్ణయించింది.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. మునిసిపాలిటీల్లో సమీప గ్రామాల విలీనం అడ్డంకి కాగా అధిగమించేం దుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గ్రామాలు విలీనమైనా.. కాకున్నా మునిసిపల్ ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడు తోంది. కాగా ఎన్నికలు పాత పద్ధతిలోనే సునా యాసమని టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు భావిస్తున్నారు. భీమవరం నియోజకవర్గ సమావేశంలో ఈ అంశంపై తీర్మానం చేశారు. విలీన గ్రామాలతో కలిపి ఎన్నికలు నిర్వహిస్తే మున్సిపాలిటీల వ్యయ ప్రయాసలు, ఎన్నికల్లో అభ్యర్థులపై భారం పడు తుందని భావిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం విలీన గ్రామాలతో ముందుకు వెళితేనే మేలన్న ఉద్దేశంతో ఉంది. ఏదేమైనా ఎన్నికలు పక్కా అంటూ ఇటీవల జిల్లా పర్యటనలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
సంప్రదింపులకు ఎమ్మెల్యేలు సిద్ధమేనా..
విలీన గ్రామాల కేసులు ఉపసంహరింపజేయ డానికి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ప్రయత్నాలు ప్రారంభించారు. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. భీమవరం కార్పొరేషన్ దిశగా అడుగులు వేస్తేనే కేసులు ఉపసంహరించుకుంటామని గతంలోనే మున్సిప ల్ శాఖ మంత్రి నారాయణకు విలీన గ్రామస్థులు స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో దీనిపై ప్రతిపాదనలు వెళ్లాయి. కార్పొరేషన్ ప్రతిపాదనపై మంత్రి సానుకూలత చూపలేదు. ఎన్నికలపైనే దృష్టి పెట్టారు. విలీన గ్రామాలతో సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు గతంలో ప్రయత్నాలు జరిగినా ముందుకు సాగలేదు. మంత్రి నారాయణ హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు పాలకవర్గాలు లేకపోవడంతో అన్నింటికీ ఒకేసారి ఎన్నికలకు వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కూటమి అధిష్ఠానం తమను కలిసిన నేతలతో మున్సిపల్ ఎన్నికలపై శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు. విలీన గ్రామాలపై ఎమ్మెల్యేలు స్థానికుల మనోభావాలను ప్రభుత్వానికి తెలియపరిచిన తర్వాతే జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలపై స్పష్టత రానుంది. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు మున్సిపాలిటీలపైనే ఆసక్తి నెలకొంది. రిజర్వేషన్ ప్రక్రియపైనా నేతలు ఒక అంచనాకు వస్తున్నారు.
వార్డుల పెంపు ఎప్పుడో
ఎన్నికల సంఘం సర్ ప్రక్రియను కొలిక్కి తెచ్చింది. మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితా సిద్ధం చేసి అభ్యంతరాలను స్వీకరించనుంది. విలీన గ్రామాలతో లేదంటే మినహాయించినా నాలుగు మున్సిపాలిటీల్లో వార్డులను పెంచాలి. జిల్లాలో నరసాపురం, ఆకివీడులో మాత్రమే వార్డులను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. విలీన సమస్యతో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు మున్సిపాలిటీల్లో వాయిదా వేశారు. వార్డులను పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించనున్నారు. విలీన గ్రామాలపై ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే వార్డుల పెంపుపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
అభ్యర్థులెవరు?
మున్సిపల్ ఎన్నికలకు కూటమి ముందుగానే సిద్ధమవు తోంది. ప్రతి మున్సిపాలిటీలో అభ్యర్థులపై అధిష్ఠానం ఆరా తీస్తోంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలను వివరా లు అడిగి తెలుసుకుంటోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల వివరాలను సేకరిస్తోంది. కూటమి సర్దుబాటులో చైర్మన్ పదవులపైనే ప్రధానంగా ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. విలీన గ్రామాలతో కలిపే ఎన్నికలకు వెళ్లేందుకు కూటమి సిద్ధమవుతోంది. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాల కొల్లు, నరసాపురం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆకివీడు నగర పంచాయతీ పాలకవర్గానికి ఇంకా గడువు ఉంది.
జనసేనకు ఎక్కడ..?
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలో సర్దుబాటు జరగనుంది. వార్డులపై ఇప్పటికే కూటమి అధిష్ఠానం స్పష్టతతో ఉన్నట్టు తెలు స్తోంది. జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట కౌన్సిలర్ స్థానాల విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. చైర్మన్ పదవుల కేటాయింపుపైనే కౌన్సిలర్ స్థానాలు పంపిణీ కూడా ఆధారపడి ఉంటుంది. గతంలో నామినేటెడ్ పదవులపై జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశానికి 50 శాతం, జనసేన, బీజేపీలకు 50 శాతం కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా సహకార సంఘా లు, దేవస్థాన కమిటీలపై సర్దుబాటుతోనే పదవులను భర్తీ చేశారు. తెలుగుదేశం కేటాయించిన సొసైటీల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, లేదా నియోజకవర్గ ఇన్‌చార్జిలు పంపిన పేర్లను అధిష్ఠానం ఖరారు చేసింది. జనసేనకు కేటాయించిన సొసైటీలపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపాదన మేరకు త్రిసభ్య కమిటీ చైర్మన్ పదవులను భర్తీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే జరగనుంది. మున్సిపాలిటీ చైర్మన్ పదవులపై రాష్ట్రస్థాయిలోనే నిర్ణయం తీసుకోనున్నారు. కౌన్సిలర్ పదవుల విషయంలో మాత్రం సంఖ్యాపరంగా అధిష్ఠానం నిర్ణయం తీసుకోనుంది. వార్డుల విషయానికొచ్చేసరికి స్థానికంగా కూటమి నేతలు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా చైర్మన్ అభ్యర్థులపై అధిష్ఠానం ఆరా తీయడంతో స్థానిక ఎన్నికల వాతావరణం జిల్లాలో మొదలైంది.
ఇంటింటికి వెళ్లాలంటూ కేడర్‌కు దిశానిర్దేశం
స్థానిక ఎన్నికలకు ముందుగానే తెలుగుదేశం ఇంటింటికి కార్యక్రమానికి ప్రణాళిక చేసింది. ఈ నెల 27 నంచి పార్టీ నాయకులు, శ్రేణులు ఇంటింటికి వెళ్లనున్నాయి. ప్రతిరోజు 30 ఇళ్లకు వెళ్లాలని పట్టణ, గ్రామ స్థాయి నాయకులకు, కేడర్‌కు పార్టీ నుంచి ఫోన్‌లు వస్తున్నాయి. స్థానిక ఎన్నికల ప్రచారానికి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కేడర్ భావిస్తోంది. ప్రజల సమస్యలను కూడా అడిగితెలుసుకోనున్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికి పంచిపెట్టనున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న ఆశావహులు కూడా ఇంటింటికి వెళ్లాలని తహతహలాడుతున్నారు. మొత్తంపైన మున్సిపోల్‌తో పాటు, పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు కూటమి సిద్ధమవుతోంది.