Share News

గోశాలలో..ఇష్టారాజ్యం!

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:16 AM

ఏలూరు నగరంలో 1934 నుంచి ట్రస్టీల ఆధ్వర్యంలో నడుస్తున్న గోవుల సంరక్షణ సమితిలో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

గోశాలలో..ఇష్టారాజ్యం!

1934 నాటి పవిత్ర సంస్థ అప్రదిష్టపాలు

దాతల విరాళాలు పక్కదారి..మూలకు చేరిన యంత్రాలు

సేవకురాలిపై వేధింపులు.. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

11న సభ్యులతో మహాజన సభ..కీలక ప్రజా ప్రతినిధికి ఆహ్వానం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

ఏలూరు నగరంలో 1934 నుంచి ట్రస్టీల ఆధ్వర్యంలో నడుస్తున్న గోవుల సంరక్షణ సమితిలో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 600 మందికి పైగా దాతలు, శాశ్వత సభ్యులు, రాజపోషకులు, మహారాజ పోషకులు ఇచ్చిన విరాళాలతో అజరామరంగా సాగిన సంస్థ, పాతుకుపోయిన ఒకరిద్దరు సభ్యుల కారణంగా సమితి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారన్న ఆరోపణ లున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతీ మూడు నెలలకు ఒకసారి పాలకవర్గ సమావేశం జరగాలి. కానీ జరగడం లేదు. ఈనెల 11న మహాజన సభకు పిలుపునిచ్చారు. దీనికి సంస్థతో సంబంధం లేని కీలక ప్రజాప్రతినిధికి ఆహ్వానం పంపారు. సభను మమ అనిపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికీ చాలామంది సభ్యులకు అజెండా కాపీ అందలేదని సమాచారం.

లక్షలు పక్కదారి.. మహిళపై కేసు

కొద్దినెలల క్రితం లక్షలాది రూపాయల నిధులు పక్కదారి పట్టాయి. ఈ వ్యవహారంలో అక్కడ సేవకు రాలిగా ఉన్న మహిళను పోలీస్‌ కేసులో ఇరికించి బయ టకు పంపేశారన్న ఆరోపణలున్నాయి. గతంలో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నా యి. బాధితురాలు ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ చర్యలు లేకపోవ డం విమర్శలకు తావిస్తోంది.

యంత్రాలు మూలకు.. ఆదాయాలకు గండి

ఆవుల సేవకు ఉపయోగపడేందుకు దాతలు ఇచ్చిన యంత్రాలు నిరుపయోగంగా మూలనపడ్డాయి. కొప్పాక వ్యవసాయ క్షేత్రంలో ఏలూరులోని ఓ వ్యాపారవేత్త విరాళంగా ఇచ్చిన డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు పని చేయడం లేదు. ఆవులకు దాణా వండేందుకు ఇచ్చిన స్టీమ్‌ యంత్రాలను వాడడం లేదు. పాలు మిగిలితే డ్రై చేసేందుకు దాత ఇచ్చిన డ్రై ఫ్రిజ్‌ను పక్కన పెట్టేశారు. కార్యాలయం పరిధిలోని షాపుల అద్దెలు, నగరంలోని మరికొన్ని చోట్ల ఉన్న దుకాణాల అద్దెలు సంస్థకు ఆదా య వనరులు. షాపుల నిర్వాహకులతో గొడవలు పెట్టు కుని కోర్టులకు ఎక్కేలా చేయడం వల్ల ఆదాయానికి గండి పడుతోందని సభ్యులు ఆరోపిస్తున్నారు.

కొత్త అకౌంటెంట్‌కు హుకుం

శాశ్వత సభ్యులుగా చేరేందుకు వచ్చిన వారిని చేర్చుకోవడం లేదని, తనకు అణిగిమణిగి ఉండే వ్యాపారులు, వడ్డీ వ్యాపారులకే సభ్యత్వాలు ఇస్తున్నా రని ఆరోపణలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో నియ మించిన కొత్త అకౌంటెంట్‌ లోపాలను ఎత్తి చూపుతుం డటంతో అతన్ని ఉద్యోగానికి రావద్దని హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఈ అక్రమాల్లో ఒక ఉద్యోగి వ్యక్తిగత ఖాతాకు డబ్బులు జమ అయినట్లు సభ్యుల విచారణలో బయటపడటంతో టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దానిపై ఇప్పటి వరకు చర్యలు లేవు.

అవినీతికి తావులేదు : చైర్మన్‌

ఈ ఆరోపణలపై పాలకవర్గం చైర్మన్‌ దివ్వెల జయబాబును వివరణ కోరగా ‘సేవాతత్వంతో పాలకవర్గం పనిచేస్తోంది. అవినీతికి తావులేదు. దాతలు ఇచ్చిన యంత్రాలకు మరమ్మతులు చేయించి వాడేలా చర్యలు చేపడుతున్నాం. ఆవులు ఇచ్చే పాలు మిగలడం లేదు కాబట్టి డ్రైఫ్రిజ్‌ వాడడం లేదు’ అని తెలిపారు.

Updated Date - Oct 10 , 2026 | 12:16 AM