తరుగు, మజూరీలకు భయపడితే ముంచేశాడు..!
ABN , Publish Date - Mar 08 , 2026 | 12:47 AM
బంగారు ఆభరణాల కొనుగోలులో తరుగు, మజూరీ మోసాలకు భయపడి నేరుగా ఆభరణాలు తయారు చేసే వ్యక్తిని ఆశ్రయిస్తే నిండా ముంచేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొందరు మహిళలు భర్తలకు తెలియ కుండా కొత్త మోడల్స్ ఆభరణాల తయారీకి ఇంటి లోని పాత బంగారు వస్తువులు ఇచ్చారు.
మరికొందరు పిల్లలకు తెలియకుండా పెద్దలు పాత వస్తువులతోపాటు అదనపు బంగారం కోసం అప్పులు చేసి ఇచ్చారు.
ఇలా ఒకే ఇంటిలో ఒకరికి తెలియకుం డా మరొకరు ఇద్దరు, ముగ్గురు మహి ళలు ఇతనికి బంగారం ఇచ్చారు.
మరోవైపు షాపుల యజమానులు తమ వద్దకు వచ్చిన ఖాతాదారులకు నచ్చిన మోడల్స్‌లలో తయారు చేసేందుకు ఆర్డర్లు ఇచ్చామని చెబుతున్నారు.
మహి ళలే టార్గెట్.. వ్యాపారులను వదల్లేదు
ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న బెంగాలీ గోల్డ్ స్మిత్ మోసాలు
రూ.7 కోట్లు చెల్లించలేనని.. 19 మందికి ఐపీ నోటీసులు
తణుకు రూరల్, మార్చి 7(ఆంధ్రజ్యోతి):బంగారు ఆభరణాల కొనుగోలులో తరుగు, మజూరీ మోసాలకు భయపడి నేరుగా ఆభరణాలు తయారు చేసే వ్యక్తిని ఆశ్రయిస్తే నిండా ముంచేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తణుకులో ఆభరణాల తయారీకి ఇచ్చిన పాత బంగారు వస్తువులు, అదనం గా రూ.లక్షల్లో వసూలు చేసిన సొమ్ముతో పరారై తిరిగి ఖాతాదారులకే ఐపీ నోటీసులు పంపించిన బెంగాలీ గోల్డ్ స్మిత్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నా యి. కొత్త మోడల్స్‌లో ఆభరణాలను తయారు చేసి ఇస్తానని మహిళలతోపాటు కొందరు బంగారు వ్యాపా రస్తుల నుంచి ఆర్డర్లు తీసుకున్నట్లు ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు. అందిన సమాచారం మేరకు 19 మంది ఖాతాదారులకు రూ.7 కోట్ల మేర చెల్లించ లేనని ఐపీ నోటీసులు పంపించాడు. తణుకు, తాడేప ల్లిగూడెం, కొవ్వూరు, మండపేట తదితర ప్రాంతాల మహిళలతోపాటు కొన్ని షాపుల నుంచి ఆభరణాల తయారీకి బెంగాలీ బంగారు వర్కరు వస్తువులు, నగ దు తీసుకున్నట్టు చెబుతున్నారు.
షాపుల యజమానుల నుంచి ఆర్డరు పొంది తయారు చేసిన ఆభరణాలను వాట్సాప్‌లలో మహిళల కు పంపించేవాడు. అలా ఒకసారి వచ్చిన మహిళలకు వివిధ రకాల ఆభరణాల మోడల్స్ పంపి తన వద్దకు వచ్చేలా చేసేవాడు. మహిళల నుంచి పాత బంగారు వస్తువులతోపాటు అదనపు బంగారం కోసం రూ. లక్షల్లో వసూలు చేశాడు. ఆయా వస్తువుల కోసం మహిళలకు రాకపోతే ఇతనే స్వయంగా ఇంటికి వెళ్లి ఆర్డర్లు తీసుకునేవాడు. ఆ సందర్భంలో మహిళల ను అక్క, చెల్లి, అమ్మ అంటూ వరసలు కలిపి ఆప్యా యంగా పిలవడంతో వారు ఇతనిని ఈజీగా నమ్మే శారు. బాధిత మహిళలు, షాపు యజమానులది ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యథ.
గతంలోనూ ఇలాగే..
ఆభరణాలు తయారు చేయమని ఇచ్చిన బంగారం తో బెంగాల్‌కు చెందిన వ్యక్తులు పరారవడం ఇది కొత్త కాదని, స్థానిక గోల్డ్ స్మిత్‌లు చెబుతున్నారు. పదేళ్లలో నలుగురు ఇదే తరహాలో ఖాతాదారులు, బంగారు వ్యాపారులు ఇచ్చిన బంగారంతో పరారయ్యారు. వారం దరికీ భిన్నంగా బంగారు వస్తువులతోపాటు అదనంగా రూ. లక్షల్లో సొమ్ములు అడ్వాన్సులుగా తీసుకుని తిరిగి వారికి చెల్లించలేనని ఐటీ నోటీసులు పంపించడం ఇదే తొలిసారని వారు వాపోతున్నారు.
పోలీసులు స్పందించివుంటే..
బంగారు ఆభరణాల తయారీకి తమ బంగారపు వస్తువులు, సొమ్ము ఇచ్చి మోసపోయామని పోలీసు లను ఆశ్రయించినా స్థానిక సీఐ, ఎస్‌ఐలు సరైన సమ యంలో స్పదించకపోవడమే ఐపీ నోటీసులకు కారణ మని బాధితులు పేర్కొంటున్నారు. ఒకే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తణుకు పట్టణ పోలీసుల చుట్టూ తిరిగామని, అదే తమ పరిధిలోని స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుంటే వెంటనే కేసు నమోదు చేసేవారని, ఐపీ నోటీసులు తప్పేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.