Share News

తగ్గిన బంగారం

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:31 AM

బులియన్‌ మార్కెట్‌లో శుక్రవారం పసిడి ధర భారీగా తగ్గింది. బిస్కెట్‌ గ్రాముకు రూ.524, 22 క్యారెట్లు గ్రాముకు రూ.480 చొప్పున తగ్గాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి పది గ్రాముల బిస్కెట్‌ బంగారం రూ.1.45,860 ఉండగా.. ఆర్నమెంట్‌ బంగారం రూ.1,33,705 దగ్గర ముగిసింది.

తగ్గిన బంగారం

గ్రాముకు రూ.500 తగ్గుదల

నరసాపురం, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): బులియన్‌ మార్కెట్‌లో శుక్రవారం పసిడి ధర భారీగా తగ్గింది. బిస్కెట్‌ గ్రాముకు రూ.524, 22 క్యారెట్లు గ్రాముకు రూ.480 చొప్పున తగ్గాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి పది గ్రాముల బిస్కెట్‌ బంగారం రూ.1.45,860 ఉండగా.. ఆర్నమెంట్‌ బంగారం రూ.1,33,705 దగ్గర ముగిసింది. గడిచిన రెండు నెలల కాలంలో పసిడి ధర ఒక్క రోజులో ఈ స్థాయిలో పతనమవ్వడం ఇదే తొలిసారి. అమెరికా సెట్‌ బ్యాంకు, వడ్డీ రేట్లను పెంచకపోవడం, అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు తగ్గడం, ప్రపంచ వ్యాప్తంగా పసిడి అమ్మకాలు జోరందుకోవడం ధర పతనానికి కారణమని భావిస్తున్నారు. ఇదేస్థాయిలో మార్కెట్‌లో పరిణామాలు కొనసాగితే పసిడి ధర మరింత పతనం అవ్వొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మార్కెట్‌లో కనిపించని జోష్‌..

ధర తగ్గినా.. బులియన్‌ మార్కెట్‌లో జోష్‌ కనిపించడం లేదు. నెల రోజులుగా మార్కెట్‌లో అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత నెలలో కేంద్ర ప్రభుత్వం పసిడి దిగుమతిపై 15శాతం పన్ను విధించింది. బ్యాంకుల్లో పసిడి రుణాలపై అనేక అంక్షలు పెట్టింది. ఈమేరకు చాలా మంది వినియోగదారులు ధర తగ్గినా.. కొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. గతంలో కొనుగోలు చేసి ఆ బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి రుణాలు పొందేవారు. ఇటీవల ఆర్‌బీఐ బంగారు రుణాలపై అనేక అంక్షలు విఽధించింది. ఇది పసిడి అమ్మకాలు తగ్గడానికి ఒక కారణంగా భావిస్తున్నారు. మరోవైపు యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంధ్యం తలెత్తింది. ఆ ప్రభావం జిల్లాపై పడింది. నిత్యావసర ధరలు పెరగడం, సాఫ్టవేర్‌ ఉద్యోగాలు తొలగింపు తదితర కారణాలు పసిడి పతనానికి కారణంగా చూపుతున్నారు. గతంలో ధర తగ్గితే... మార్కెట్‌లో జోష్‌ ఉండేది. నేడు ఆపరిస్థితి కనిపించడం లేదు. మూడు నెలల క్రితం గ్రాము బంగారం రూ.20 వేలకు తాకింది. అక్కడ నుంచిక్రమంగా పతనవమవుతూ వచ్చింది. దాదాపు గ్రాముకు రూ.7 వేలు తగ్గినా.. ఎవరూ కొనేందుకు ఆసక్తి చూపించడం లేదు. రానున్న రోజుల్లో ఈ ధర మరింత తగ్గవచ్చన్న ధోరణిలో వినియోగదారులు ఉన్నారు. ఈ కారణంగా బులియన్‌ మార్కెట్‌లో సందడి కనిపించడం లేదు. ప్రస్తుతం పెళ్ళిళ్ల సీజన్‌ అయినప్పటికీ వ్యాపారాలు అనుకున్న స్థాయిలో సాగడం లేదు. గతంలో పెళ్లిళ్ల సీజన్‌లో రోజుకు ఉమ్మడి జిల్లాలో రూ.20 కోట్లపైనే వ్యాపారం ఉండేది. నేడు సగం కూడా జరగడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. అత్యవసరమైతే తప్ప బంగారం కొనేందుకు మార్కెట్‌కు రావడం లేదు. ఈ కారణంగా ఉమ్మడి పశ్చిమ జిల్లాలో పసిడి వ్యాపారానికి కళ తగ్గింది.

Updated Date - Jun 20 , 2026 | 12:31 AM