Share News

బంగారం వ్యాపారి కుచ్చుటోపీ..!

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:33 AM

ఆభరణాలు తయారు చేయ మని ఇచ్చిన సుమారు రూ.3 కోట్ల విలువైన బంగారంతో ఓ వ్యాపారి ఉడాయించాడు.

బంగారం వ్యాపారి కుచ్చుటోపీ..!

ఆభరణాల తయారీకి ఇచ్చిన వాటి విలువ రూ.3 కోట్లపైమాటే..

పోలీసులను ఆశ్రయించినా ఫలితం శూన్యం

చివరకు ఐపీ నోటీసులు పంపించిన నిందితుడు.. బాధితులు లబోదిబో

తణుకు రూరల్‌, మార్చి 4(ఆంధ్రజ్యోతి):ఆభరణాలు తయారు చేయ మని ఇచ్చిన సుమారు రూ.3 కోట్ల విలువైన బంగారంతో ఓ వ్యాపారి ఉడాయించాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక వ్యక్తి 20 ఏళ్ల క్రితం తణుకు వచ్చి ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో అద్దెకు ఉంటూ సొంతంగా బంగారం షాపు పెట్టాడు. ఆర్డర్‌పై నగలు తయారు చేసి ఇచ్చేవాడు. ఎవరు ఏ శుభకార్యానికి పిలిచినా కుటుంబంతో సహా వెళ్లి అందరితో పరిచ యాలు పెంచుకున్నాడు. ఈ క్రమంలో పలువురి నుంచి ఆభరణాల తయారీకి పెద్ద మొత్తంలో బంగారం తీసుకున్నాడు. జనవరిలో 9న షాపును తెరవడం మానేశాడు. అనుమానం వచ్చిన పలువురు ఖాతా దారులు 10వ తేదీనే తణుకు పట్టణ పోలీసులను ఆశ్రయించారు. రెండు రోజులు పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిప్పిన అప్పటి సీఐ, ఎస్‌ఐలు సంక్రాంతి తర్వాత చూద్దామని పంపించేశారని, తీరా పండుగ తర్వాత వచ్చినా సదరు వ్యక్తిని రప్పించలేదని బాధితులు వాపోతున్నారు. ఫిబ్రవరి 28న పోలీసులకు మళ్లీ ఫిర్యాదు చేయగా.. తమకు ఐపీ నోటీసులు అందా యని పలువురు ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారి వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తుల నుంచి నగల తయారీకి బంగారం సేకరించినట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే రూ.3 కోట్లకు పైగానే బంగారం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అడిగి అడిగి విసిగిపోయాం : దున్నా బేబీ, కొవ్వూరు

ప్రైవేట్‌ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నా. నేను దాచుకున్నది, తల్లిదండ్రులు ఇచ్చిన మొత్తం 325 గ్రాముల బంగారం వడ్డాణం, అర వంకీలు చేయాలని ఇచ్చా. వీటి విలువ రూ.5 లక్షల వరకు వుంటుంది. నా వస్తువుల కోసం తిరిగి తిరిగి విసిగిపోయా. తణుకు పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. బుధవారం తాడేపల్లిగూడెం డీఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లాం.

23 లక్షల బంగారం ఇచ్చాం : మెరిపో విజయలక్ష్మి, పైడిపర్రు

చిన్నప్పటి నుంచి మాకు తెలిసిన వ్యక్తి. సొంతంగా షాపు పెట్టుకుంటే సంతోషించాం. మా ఇంట్లో ప్రతీ కార్యక్రమానికి కుటుంబంతో సహా హాజరయ్యేవాడు. మా ఇంట్లో బిడ్డలా మెలిగాడు. ఆభరణాల తయారీకి రూ.23 లక్షల విలువ చేసే బంగారం ఇచ్చాం. ఇప్పుడు ఐపీ నోటీసులు పంపించాడు. 2019 నుంచి అతడి వద్ద బంగారు ఆభరణాలు తయారు చేయించుకుంటున్నాం.

ఐపీ నోటీసులు పంపించాడు : తానేటి మధుషీల, పైడిపర్రు

మెడలో మంగళ సూత్రాల నిమిత్తం 43 గ్రాముల బంగారం, రూ. 5 లక్షలు ఇచ్చాం. 2024 ఆగస్టు 7న ఇచ్చాం. నెల రోజుల్లో తయారు చేసి ఇస్తానని చెప్పాడు. డిసెంబర్‌ 25న ఇవ్వమని చెప్పినా ఇవ్వ లేదు. జనవరి నుంచి షాపు తెరవకపోవడంతో తణుకు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఇప్పుడు ఉన్నట్టుండి ఐపీ నోటీసులు పంపించాడు.

Updated Date - Mar 05 , 2026 | 12:34 AM