Share News

తుది దశకు గృహ గణన

ABN , Publish Date - May 23 , 2026 | 12:53 AM

జనాభా గణనలో భాగంగా కీలకమైన గృహగణన కార్యక్రమం జిల్లాలో తుది దశకు చేరింది.

తుది దశకు గృహ గణన

25 నుంచి క్రాస్‌చెక్‌

నెలాఖరుకు పూర్తి చేసేందుకు అడుగులు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జనాభా గణనలో భాగంగా కీలకమైన గృహగణన కార్యక్రమం జిల్లాలో తుది దశకు చేరింది. జిల్లావ్యాప్తంగా 22వ తేదీ నాటికి సగటున 86.39 శాతం నమోదు పూర్తయింది. ఉదయం 8 గంటల నుంచి 11 గంటలకు వరకు, సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల వరకు ఎన్యూమరేటర్ల వెసులుబాటుకు అనుగుణంగా గృహగణన చేపట్టేలా ఉత్తర్వులు ఇచ్చారు. ఇటీవల నాలుగు రోజుల ఎండ తీవ్రతతో క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. ఇక సాయంత్రం వేళ్లలో ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో చాలాభాగం గణన పూర్తి చేసినట్లేనని అధికారులు చెబుతు న్నారు. ఈనెల 25న నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆదే శాలు జారీచేశారు. ఆమె, జాయింట్‌ కలెక్టర్‌, ఇతర అధికారులు ర్యాండమ్‌గా గృహగణనను చెక్‌ చేస్తున్నారు. కాగా 25వ తేదీ నుంచి అనుకోకుండా వదిలేసిన ఇళ్లు, ఇళ్ల యజమానులు వేరే ఊళ్లకు వెళ్లిన వివరాల నమోదుపై ఎన్యుమరేటర్లు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ నెల ఒకటో తేదీన ఈ గణన ప్రారంభమైన విషయం విదితమే. జిల్లాలో 27 మండలాలు, ఏలూరు కార్పొరేషన్‌, మూడు మున్సిపాల్టీల పరిధిలో ఇళ్లను 3,891 బ్లాకులు విభజించారు. మొత్తం 4,171 మంది ఎన్యూమరేటర్లు ఇళ్లగణనలో భాగస్వామ్యులయ్యారు. సగటున ప్రతీ ఎన్యూమరేటర్‌ 200 లోపు గృహగణన బాధ్యతలు అప్పగించారు. వీరంతా ఇంటిలోని సభ్యుల తో పాటు దాదాపుగా 30 ప్రశ్నలకు సంబంధించిన వివరాలు ఇళ్లలో వాడే ఉపకరణాలు, ఇతర అంశాలను యాప్‌లోకి నమోదు చేస్తున్నారు.

ఫిబ్రవరిలో వ్యక్తిగత సమాచారం

గృహ గణన ఆధారంగా రాబోయే ఫిబ్రవరిలో ఇంటిలోని సభ్యుల సమగ్ర సర్వేను చేపట్టనున్నారు. తద్వారా వారికి ఉపాధి, ఇతర రుణాలు, కల్పించాల్సిన సౌకర్యాలు, ఇతరత్రా అంశాలపై వాస్తవ పరిస్థితులను నిగ్గు తేల్చుతారు. గృహ గణనపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు లేక పోవడంతో సజావుగానే కార్యక్రమం పూర్తవుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘జిల్లాలో గృహ గణనలో భాగంగా 18 లక్షల 97 వేల 469 ఇళ్లకు గాను ఇప్పటి వరకు 16 లక్షల 39 వేల 307 గణన పూర్తి చేశాం. మిగిలినది నిర్దేశిత సమయంలో పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటు’న్నామని కలెక్టర్‌ వెట్రిసెల్వి స్పెషల్‌ సీఎస్‌ రావత్‌కు తెలిపారు. గృహ గణనపై సీఎస్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ శుక్రవారం నిర్వహించగా ఈ మేరకు వివరాలను కలెక్టర్‌ నివేదించారు.

Updated Date - May 23 , 2026 | 12:53 AM