Share News

రెండేళ్ల పాలనపై ప్రజల్లోకి..

ABN , Publish Date - Jun 18 , 2026 | 12:39 AM

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి తెలుగుదేశం కార్యా చరణ రూపొందించింది.

రెండేళ్ల పాలనపై ప్రజల్లోకి..

45 రోజుల ప్రణాళిక

రెండేళ్లలో ప్రభుత్వం చేసింది చెప్పాలి

నాయకులకు నిర్దేశించిన టీడీపీ

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి తెలుగుదేశం కార్యా చరణ రూపొందించింది. కూటమి శ్రేణులను కలుపుకొని ప్రతి గడపకు వెళ్లి వివరించాలని దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర కమిటీ శ్రేణులతో తెలుగుదేశం జాతీయ ఆర్గనైజింగ్‌ అధ్యక్షుడు నారా లోకేష్‌ జూమ్‌ కాల్‌ నిర్వహించి దీనిపై చర్చించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లకు ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంటుందని ఇదివరకే సంకేతాలు పంపారు. పార్టీ పెద్దల నుంచే సూచనలు రావడంతో అందుకు తగ్గట్టుగా నియోజకవర్గాల్లో సిద్ధమవుతున్నారు.కష్టపడ్డ వారికే గుర్తింపు ఉంటుందని, వారినే పరిగణలోకి తీసుకుని పార్టీ న్యాయం చేస్తుంద న్న సంకేతాలు ఇచ్చినట్టు జిల్లా నాయకులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా కూటమి రెండేళ్ల పాలనపై చేసిన పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ప్రధాన లక్ష్యంగా 45 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి ఆగస్టు పదో తేదీ వరకు నియోజక వర్గాల్లో ప్రతి ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజలకు కలసి వివరించేలా సూచించారు. ఎవరు వెళ్లినా వెళ్లకపోయినా తెలుగుదేశం తరపున కేడర్‌ అంతా వెళ్లేలా చూడాలని నియోజకవర్గ నాయకత్వానికి, నాయకులకు సూచనలొచ్చాయి.

కొత్త పెన్షన్‌లు సిద్ధం

నాయకులు ప్రతి గడపకు తిరుగుతున్న సమయంలోనే కొత్త పెన్షన్‌లు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దరఖాస్తులు అందాయి. కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి జనం సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం గడచిన రెండేళ్లలో పెన్షన్‌లు సక్రమంగా అందిస్తోంది. తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అందు బాటులోకి తెచ్చింది. రైతులకు ప్రతిఏటా రూ.20 వేలు జమ చేస్తున్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి వైద్య బిల్లులను ప్రభుత్వం పెద్ద ఎత్తున మంజూరు చేస్తోంది. ఆటో కార్మికులకు ఏడాదికి రూ. 10 వేలు వంతున ఇస్తున్నారు. చేనేత కార్మికులకు కొత్తగా ఉచిత విద్యుత్‌ పథకం ప్రవేశ పెట్టారు. ఆక్వా రంగంలో కొత్తవారికి కూడా రూ. 1.50 పైసలకే యూనిట్‌ విద్యుత్‌ను సరఫరా చేయనున్నారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లి కూటమి రెండేళ్ల పాలన, ప్రగతిపై ప్రజలకు వివరించేలా 45 రోజుల ప్రణాళిక సిద్ధం చేశారు. గతంలోనూ ఏడాది అయిన సందర్శంగా నియోకవర్గ ఇన్‌ఛార్జ్‌ల నేతృత్వంలో ఇంటింటికి తిరిగారు. రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి ప్రతి గడపకు ప్రభుత్వం పేరుతో వెళ్లనున్నారు. ఇప్పటికే మండలాలు, నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేశారు. జిల్లా సమావేశాన్ని ఈ నెల 19న భీమవరంలో నిర్వహించనున్నారు. అందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.

Updated Date - Jun 18 , 2026 | 12:39 AM