ఏటిగట్టుపై నెర్రలు.. పిచ్చిమొక్కలు
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:19 AM
వశిష్ట గోదావరి ఏటిగట్టు ఎక్కడెక్కడ నెర్రలు తీశాయి అనేవిషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు.
మేల్కొనని అధికార యంత్రాంగం
ఆచంట, మార్చి 16(ఆంధ్రజ్యోతి): వశిష్ట గోదావరి ఏటిగట్టు ఎలా ఉన్నది అనేది గోదావరి వరదలు వచ్చే సమయంలో మాత్రమే అధికారులకు గుర్తుకు వస్తుంది. మిగతా రోజుల్లో అసలు ఏటిగట్టు ఎలా ఉన్నది.. ఎక్కడెక్కడ నెర్రలు తీశాయి అనేవిషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నపుడు మాత్రమే అధికారులు పరుగులు తీస్తారు. నెర్రలు ఉన్న చోట్ల తాత్కాలికంగా ఇసుక బస్తాలు వంటివి వేసి ప్రమాదాలు జరగకుండా కాపాడతారు. గత సంవత్సరం గోదావరి వరద పలు మార్లు రావడంతో అటు అధికారులు, ఇటు ప్రజలను కూడా భయపెట్టింది. ప్రస్తుతం ఏటిగట్టు అక్కడక్కడ నెర్రలు తీసి ఏటిగట్టు మొత్తం పిచ్చిమొక్కలతోనే నిండిఉంది. కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్ళడానికి వీలులేకుండా ఉంది. సుమారు 18 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం గోదావరి ఏటిగట్టును పటిష్టపరిచి గ్రావెల్‌రోడ్డు కూడా వేశారు. దొడ్డిపట్ల నుంచి సిద్ధాంతం వరకు అనేక వాహనాలు నిరంతరం తిరుగుతూ ఉండేవి. ప్రస్తుతం ఏటిగట్టు పరిస్థితి అలా లేదు. అధికారులు స్పందించి రానున్న గోదావరి వరద రోజులను, గోదావరి పుష్కరాలను దృష్టిలోపెట్టుకుని నెర్రలు ఉన్న చోట పటిష్టపరిచి పిచ్చిమొక్కలు తొలగించి కనీసం గ్రావెల్‌రోడ్డు వేయాలని గోదావరి తీర ప్రాంత ప్రజలు కోరుతున్నారు.