ఉప్పొంగిన గోదావరి
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:16 AM
జూలై చివరి వరకు వర్షాలులేని పరిస్థితి. గోదావరి నీటిమట్టం 15 అడుగుల లోపే ఉంది. మూడు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఒక్కసారిగా ఉప్పొంగింది.
భద్రాచలం వద్ద 50 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
అనూహ్యంగా పెరిగిన వరద
కుక్కునూరు/వేలేరుపాడు/పోలవరం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): జూలై చివరి వరకు వర్షాలులేని పరిస్థితి. గోదావరి నీటిమట్టం 15 అడుగుల లోపే ఉంది. మూడు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఒక్కసారిగా ఉప్పొంగింది. భద్రాచలం వద్ద బుధవారం 15.8 అడుగుల నీటిమట్టం నమోదైంది. గురువారం ఉదయం ఆరు గంటలకు 25.40 అడుగుల నీటిమట్టం నమోదైంది. అదేరోజు సాయంత్రంకు 28.40 అడుగుల నీటిమట్టం నమోదుకాగా ఒక్కసారిగా వరదనీరంతా గోదావరిలోకి చేరడంతో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు 40.20 అడుగుల నీటిమట్టం నమోదైంది. పది గంటలకు 43 అడుగులకు చేరుకోగానే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు 48 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరడంతో తెలంగాణ అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్ర ఏడు గంటలకు 50 అడుగుల నీటిమట్టం నమోదైంది. మూడు రోజుల వ్యవధిలోనే వరద ఒక్కసారిగా ఇంత పెరగడంతో ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఈ ఏడాది జూలైలో గోదావరి వరదలేదని రైతాంగం, ఏజెన్సీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అనూ హ్యంగా పెరిగిన గోదావరి వరద తో అప్రమత్తం అయ్యే పరిస్థితి ఏర్పడింది. కుక్కునూరు–దాచారం గ్రామాల మధ్య గుండేటివాగు లోలెవెల్ బ్రిడ్జి నీట మునగడంతో ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు వయా నల్లగుంట మీదుగా దాచారం వైపు ప్రజలు రాకపోకలు సాగిస్తు న్నారు. వింజరం, ముత్యాలంపాడు మధ్య పాలవాగుపై ఉన్న లెవెల్ కాజ్‌వే సైతం నీటమునిగింది. గొమ్ముగూడెం గ్రామస్థులను ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాల మేరకు దాచారం పునరావాస కాలనీకి తరలి స్తున్నట్లు తహసీల్దార్ చలపతిరావు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, వైద్యం, ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
వేలేరుపాడుకు వరద గండం
తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరికి భారీ వరద చేరుకుని ముంపు మండ లాలు వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని పలు గ్రామాలను వరద చుట్టుముట్టింది. పోలవరం కాఫర్‌డ్యాం కారణంగా ఇప్పటికే బ్యాక్‌వాటర్ ఎగతన్ని ఉండడంతో పైనుంచి వచ్చే వరద మొత్తం వేలేరుపాడు మండలంలోని లోతట్టు ప్రాంతాలకు చేరుకుంటుంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఒకే రోజున రెండు ప్రమాద హెచ్చరికలను జారీ చేయడం విశేషం. ఉదయం పది గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు కాగా సాయంత్రం నాలుగు గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులకు చేరగా వరద మరింత పెరిగి మూడో ప్రమాదహెచ్చరిక 53 అడుగులకు చేరువగా ఉండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
19 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
వరద కారణంగా రహదారులు మునిగిపోయి బయటకు రావడానికి వీలులేని గ్రామాల ప్రజలను పోలీస్‌శాఖ సహాయంతో ఖాళీ చేయించే పనిలోపడ్డారు. గురువారం రాత్రికే ఎద్దువాగు వంతెన మునిగిపోవడంతో శుక్రవారం ఉదయం నుంచి కోయిద దాని పరిసర 15గ్రామాల ప్రజల కు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పనుల కోసం అక్కడ రెండు బోట్లను అధికారులు ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రానికి వేలేరుపాడు, రుద్రమ్మకోట మధ్య ఉన్న కాజ్వే కూడా మునిగిపోవడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద మరో రెండు అడుగులు పెరిగితే రేపాకగొమ్ము, తాటుకూరుగొమ్ము, తిరుమలాపురం గ్రామాలకు రహదారి బంద్ అయ్యే అవకాశం ఉండడంతో ఆయా గ్రామాల ప్రజలు తమ ఇళ్లలోని సామాన్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తెలంగాణలో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కొనసాగు తాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో ఇప్పుడు వచ్చే వరదకు మరింత వరద గోదావరిలో చేరడం వల్ల మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో కలెక్టర్ వెట్రిసెల్వి హుటాహుటిన వేలేరుపాడుకు చేరుకుని అధికార యంత్రాంగాన్ని సంసిద్ధం చేశారు. పోలవరంలో గోదావరి నీటిమట్టం ఊహించని రీతిలో పెరిగింది. గోదావరి ఉపనదుల జలాలు గోదావరిలో కలుస్తుండడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద, పట్టిసీమ తదితర ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టం పెరిగి ఉదృతంగా ప్రవహిస్తుంది.
పాపికొండల పర్యాటకానికి బ్రేక్
పోలవరం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): గోదావరి నీటిమట్టం పెరగడంతో పాపికొండల టూరిజం బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఏపీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ ఆర్.గంగబాబు శుక్రవారం తెలిపారు. ఎగువ కాఫర్ డ్యాం వద్ద గోదావరి నీటిమట్టం 30 మీటర్లకు పైబడితే టూరిజం బోట్ల రాకపోకలు నిలిపివేస్తామని, గోదావరి నీటిమట్టం తగ్గిన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బోట్ల రాకపోకలు పునరుద్ధరిస్తామన్నారు. ఇప్పటికే టూరిజం పర్యటనకు బుక్ చేసుకున్న పర్యాటకులు సహకరించాలని బోట్ ఆపరేటర్స్ యూనియన్ కోరింది.
వశిష్ఠకు వరద పోటు
నరసాపురం/వాసవీ పెనుగొండ, జూలై 31(ఆఽంధ్రజ్యోతి): వశిష్ఠ గోదావరికి వరద పోటు తాకింది. శుక్రవారం తెల్లవారుజూము
నుంచి క్రమంక్రమంగా వరద నీరు వచ్చి చేరుతోంది. సాయంత్రానికి సుమారు మూడు లక్షలు క్యూసెక్కుల నీరు చేరడంతో అధికార
యంత్రాంగం అప్రమత్తమైంది. నరసాపురం –సఖినేటిపల్లి రేవుల మధ్య రాకపోకల్ని నిలిపివేశారు. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చించినాడ వంతెన మీదుగా చుట్టూ తిరిగి రోడ్డు మార్గాన్న వెళ్లాల్సి వచ్చింది. పెనుగొండ మండలం సిద్దాంతం వశిష్ట గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు క్రమక్రమంగా పెరుగుతుంది. శుక్రవారం సిద్దాంతం వద్ద వరద నీరు పెరగడంతో లంక రైతులు ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారులు గోదావరి పెరగడంతో తమకు వేట లేకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు. తమ పడవలు ఒడ్డుకు చేర్చి పక్కన పెట్టారు. వరద నీరు మరింత పెరిగే అవకాశం ఉన్నందున పంచాయతీ, రెవెన్యూ అధికారులు అప్రమత్తం అయ్యారు.