Share News

గోదావరికి వరద పోటు

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:09 AM

గోదావరి నది ఎగువ భాగంలో కురిసిన వర్షాల కారణంగా గోదావరికి వరద భారీగా వచ్చి చేరుతోంది.

గోదావరికి వరద పోటు
వేలేరుపాడు– రుద్రమ్మకోట మధ్య రహదారిపై చేరిన వరద.. రాకపోకలకు సిద్ధం చేసిన పడవ

నీట మునిగిన రహదారులు

పంట పొలాల్లోకి చేరిన వరద

మిర్చి, అపరాల పంటలకు తీవ్ర నష్టం

వేలేరుపాడు/కుక్కునూరు/పోలవరం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): గోదావరి నది ఎగువ భాగంలో కురిసిన వర్షాల కారణంగా గోదావరికి వరద భారీగా వచ్చి చేరుతోంది. దీనికి తోడు గోదావరి ఉప నదు లైన ఇంద్రావతి, శబరి నదులకు భారీగా వరద వచ్చి చేరడంతో దీని ప్రభావం కారణంగా వేలేరు పాడు, కుక్కునూరు మండలాల్లోని పంట పొలాల్లోకి, రోడ్ల పైకి వరదనీరు చేరుకుంది. భారీగా పంట నష్టం వాటిల్లింది. ఆదివారం సాయంత్రానికి తెలం గాణలోని భద్రాచలం వద్ద 43.2 అడుగులకు నీటి మట్టం చేరగా ఒడిశాలో కురిసిన భారీ వర్షాల కార ణంగా శబరి నదికి భారీగా వరద వచ్చి చేరుతోంది. కూనవరం వద్ద శబరి నీటిమట్టం 40 అడుగులకు చేరుకుని ప్రమాదస్థాయిలో వరద ప్రవహిస్తోంది. ఒక పక్క గోదావరి, శబరికి వస్తున్న వరదకు తోడు పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ కారణంగా వేలేరు పాడు మండలంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వేలేరుపాడు–కోయిదా ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిపై వరదనీరు చేరుకోవడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వేలేరుపాడు– రుద్రమ్మకోట రోడ్డుపై వరద చేరడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద కారణంగా సుమారు 500 ఎకరాల్లో మిరప, మరో 500 ఎకరాల్లో అపరాల పంటలు నీటముని గాయి. ప్రజల రాకపోకలకు వీలుగా రుద్రమ్మకోట, వేలేరుపాడు మధ్య మూడు బోట్లను, ఎద్దువాగు వద్ద మరో రెండు బోట్లను, ఏర్పాటు చేశారు. తహసీల్దార్‌ ఎన్‌.శ్రీనివాస్‌, ఎస్సై నవీన్‌కుమార్‌, ఎంపీడీవో శ్రీహరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితి సమీక్షించారు. గోదావరి వరద కుక్కునూరు మండలంలో మిర్చితోటలను ముంచెత్తింది. గోదావరి తీర ప్రాంతంలో సాగవుతున్న దాదాపు 100 ఎకరాల్లో మిర్చితోటలు నీటమునిగాయి. కుక్కునూరులోని గుండేటివాగు పరివాహక ప్రాంతంతో పాటు గోదా వరి తీరంలో లోతట్టు ప్రాంతంలో సాగవుతున్న తోటలన్నీ నీటమునిగాయి. ఇప్పటికే ఎకరానికి రూ.50 వేలు వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. గోదావరి వరద ముంపు కారణంగా తోటలు క్రమంగా కుళ్లి పోయి ఎండిపోతాయని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే భారీ వర్షాలకు మిర్చితోటలు దెబ్బతిన్నా యి. పలు చోట్ల తిరిగి తోటలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది క్వింటా మిర్చి రూ.22 వేల నుంచి రూ.,25 వేల వరకు ధర పలికింది. దీంతో రైతులు ఎన్నో ఆశలతో ఈ ఏడాది ఎక్కువ విస్తీర్ణంలో మిర్చి సాగు చేస్తున్నారు. సెప్టెంబరు చివరిలో గోదావరి వరద ముంపునకు గురి కావడంతో రైతాంగం ఆశల్లో నీళ్లు చల్లాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద వరద నీరు భారీగా చేరింది. వరద ఉధృతి కారణంగా పట్టిసీమ శివక్షేత్రానికి సోమవారం రాకపోకలు నిలిపివేశారు.

Updated Date - Sep 28 , 2026 | 12:09 AM