పెరుగుతున్న గోదావరి
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:55 AM
గోదావరి ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరదనీరు భారీగా చేరుకుంటోంది.
నీటమునిగిన ఎద్దువాగు వంతెన, గుండేటివాగు లోలెవెల్ కాజ్‌వే
వేలేరుపాడు/కుక్కునూరు, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): గోదావరి ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరదనీరు భారీగా చేరుకుంటోంది. గోదావరికి ఉపనదులైన ఇంద్రావతి, శబరి నదుల పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదనీరు గోదావరికి చేరుకోవడంతో మంగళవారం ఉదయం భద్రాచలం వద్ద 14.5 అడుగుల నీటిమట్టం ఉండగా బుధవారం ఉదయానికి 35.5 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. గోదావరి నుంచి 5లక్షల 83వేల క్యూసెక్కులు దిగువకు విడుదలవుతుండగా దాని ప్రభావంతో వేలేరుపాడు మండలంలోని ఎద్దువాగు వంతెన నీటమునిగింది. 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్‌ఐ నవీన్‌కుమార్ ఎద్దువాగు వద్దకు చేరుకుని ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఒక పడవను ఏర్పాటు చేశారు. ప్రజలెవరు నదిలో దిగవద్దని తెలిపారు. బుధవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద ఒక అడుగు తగ్గి 34.4 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శబరినదికి వరద భారీ గా పోటెత్తుతోంది. దీని ప్రభావంతో వేలేరుపాడు మండలం లోని పలు ప్రాంతాలకు వరద చేరుకునే అవకాశాలున్నాయి. కుక్కునూరు మండలంలో కుక్కునూరు, దాచారం గ్రామాల మధ్య ఉన్న గుండేటివాగు లో లెవెల్ కాజ్‌వే నీటమునిగింది. గుండేటివాగు తీర ప్రాంతం ముంపునకు గురైంది. ఈ క్రమంలో ప్రజలు వయా నల్లకుంట మీదుగా రాకపోకలు కొనసాగిస్తున్నారు. గోదావరి తీర ప్రాంతంలో మిర్చీమొక్కలు వేయడానికి రైతులు సన్నద్దమవుతున్నారు. ఈ క్రమంలో గోదావరి రెండురోజుల వ్యవధిలోనే పెరగడంతో రైతులు మిర్చి మొక్కలు వేయడానికి వెనుకంజ వేస్తున్నారు.