Share News

నిండా ముంచింది!

ABN , Publish Date - Sep 30 , 2026 | 01:04 AM

ఎన్నో ఆశలతో మిర్చి సాగు ఆరంభించిన కుక్కునూరు, వేలేరుపాడు రైతాంగానికి వారం రోజుల్లో పరిస్థితి తలకిందులైంది. భారీ వర్షాలకు మిర్చి తోటల్లో నీరు నిలబడటం, గోదావరి వరద ముంపుతో నిండా మునిగారు. ఇప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టగా మళ్లీ ఆరంభం నుంచి పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

నిండా ముంచింది!
కుక్కునూరు మండలం కొండపల్లిలో పూర్తిగా దెబ్బతిన్న మిర్చి తోట

కుక్కునూరు, వేలేరుపాడు మిర్చి రైతాంగం ఆవేదన

గోదావరి వరద ధాటికి కుళ్లి.. ఎండిపోతున్న మొక్కలు

సుమారు 3,500 ఎకరాల్లో మిర్చి పంటకు నష్టం

మళ్లీ నాట్లు వేయాల్సిన పరిస్థితి

రైతాంగానికి ఎరువుల కొరత

ప్రభుత్వం ఎరువులు అందించి ఆదుకోవాలంటూ వేడుకోలు

కుక్కునూరు/వేలేరుపాడు, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి):

ఎన్నో ఆశలతో మిర్చి సాగు ఆరంభించిన కుక్కునూరు, వేలేరుపాడు రైతాంగానికి వారం రోజుల్లో పరిస్థితి తలకిందులైంది. భారీ వర్షాలకు మిర్చి తోటల్లో నీరు నిలబడటం, గోదావరి వరద ముంపుతో నిండా మునిగారు. ఇప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టగా మళ్లీ ఆరంభం నుంచి పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

కుక్కునూరు మండలంలో 2,500 ఎకరాల్లో మిర్చి తోటలకు నష్టం వాటిల్లింది. వేలేరుపాడు మండలంలో సుమారు ఐదు వేల ఎకరాల్లో సాగు చేయగా మిగిలిన భూముల్లో కంది, మినుము, పెసర, ఇతర అపరాలు, మొక్కజొన్న సాగు చేశారు. ఈ వరదల కార ణంగా దాదాపు వెయ్యి ఎకరాల్లోని మిర్చి పంట నీట మునగగా మరో వెయ్యి ఎకరాల్లో అపరాల పంటలు దెబ్బతిన్నాయి. రోజుల తరబడి మిర్చి తోటల్లో నీరు ఉండటంతో మొక్కల వేర్లు కుళ్లి పోయి క్రమేపీ ఎండిపోతున్నాయి. కొందరు రైతులు తోటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుండగా మరికొందరు పూర్తిగా తొలగించి మరలా మొక్కలు వేయడానికి సన్నద్దమవు తున్నారు. సన్న, చిన్నకారు రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం మార్కెట్‌లో మిర్చికి డిమాండ్‌ ఉండడంతో ఈ ఏడాది వేలేరుపాడు మండల రైతులు అధిక విస్తీర్ణంలో మిర్చి సాగు చేశారు. నీటివసతి లేని భూముల్లో అపరాల పంటలు వేశారు. తీరా పెట్టుబడులు పెట్టాక గోదావరి పంట చేలను ముంచివేసి ఏడారిగా మార్చివేసింది.

ఎకరానికి 50 వేలు నష్టం

మొక్కల కొనుగోలు, నాట్లు వేయడం, తోట లో పైపాట్లు చేయడానికి మందుల పిచికారీ, ఎరువులు వేయడం, కూలీల ఖర్చు అన్ని కలిపి ఎకరానికి రూ.50 వేల వరకు ఖర్చయ్యింది. ప్రస్తుతం మళ్లీ ఆరంభం నుంచి పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే మిర్చి మొక్క రూ.2వరకు ధర పలుకుతోంది. అపరాల సాగుకు కూడా ఎకరానికి రూ.15వేలు పైనే ఖర్చు పెట్టారు. తమ దగ్గర ఉన్న సొమ్ముతో పాటు వడ్డీలకు తెచ్చి వ్యవసాయం చేస్తున్న రైతులకు అకాల వరదలతో తీరని నష్టం జరిగింది. రైతులు మరలా వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది.

ఎరువులు సరఫరా చేసి ఆదుకోవాలి

ఇప్పటికే ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ ద్వారా ఎరువులు కొనుగోలు చేసి మిర్చి పంటకు వినియోగించారు. మళ్లీ ఎరువులు ఈ యాప్‌ ద్వారా వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వం స్పందించి మిర్చి రైతాంగానికి మళ్లీ ఎరువులు అందిస్తేనే రైతులు మిర్చిసాగు జరుగుతుంది. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన మిర్చి రైతుకు మళ్లీ ఎరువులు అందించాలని కోరుతున్నారు.

ఎరువులు అందించాలి

వెల్పుల హుస్సేన్‌, కుక్కునూరు

ఐదెకరాల్లో మిర్చి పంట వేశాను. యాప్‌ ద్వారా ఎరువులు కొనుగోలు చేసి మిర్చి తోటలకు వేశాను. ఇప్పుడు తిరిగి మళ్లీ మిర్చి సాగు చేయాలంటే నాకు ఎరువులు యాప్‌ ద్వారా రాని పరిస్థితి. ప్రభుత్వం నష్టపోయిన రైతులను గుర్తించి మళ్లీ ఎరువులు అందిస్తేనే రైతుకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం, అధికారులు స్పందించాలి.

ప్రభుత్వం ఆదుకోవాలి

బాడిస రాము, సీపీఐ వేలేరుపాడు మండల కార్యదర్శి

అకాల వరదల కారణంగా మండలంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేలు, అపరాలకు రూ.20 వేలు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. రైతులకు ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి. సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేయాలి.

Updated Date - Sep 30 , 2026 | 01:04 AM