ముంచేయకండి..!
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:53 PM
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం 41.15 కాంటూరు లెవల్‌లో ముంపునకు గురయ్యే గ్రామాల నిర్వాసి తులకు పునరావాస పరిహారం చెల్లించి కాలనీలకు తరలించే ప్రక్రియ వేగంగా జరుగుతున్నా, జాబితాలో లేని పలు గ్రామాల్లో వరద కష్టాలు తప్పడం లేదు.
ముంపు జాబితాలో లేని గ్రామాలు
క్షేత్రస్థాయిలో గోదావరి వరద కష్టాలు
45.15 నుంచి 41.15 కాంటూరులో చేర్చాలి
విలీన మండల వాసుల డిమాండ్
వచ్చే మార్చి నాటికి తొలిదశ పునరావాసం పూర్తి
(కుక్కునూరు–ఆంధ్రజ్యోతి):
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం 41.15 కాంటూరు లెవల్‌లో ముంపునకు గురయ్యే గ్రామాల నిర్వాసి తులకు పునరావాస పరిహారం చెల్లించి కాలనీలకు తరలించే ప్రక్రియ వేగంగా జరుగుతున్నా, జాబితాలో లేని పలు గ్రామాల్లో వరద కష్టాలు తప్పడం లేదు. భద్రాచలం వద్ద 47 అడుగుల వరద నమోదైతే చాలు కుక్కునూరు మండలం లోని పలు గ్రామాలు ముంపునకు గురవు తున్నాయి. ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం భద్రాచలం నీటిమట్టంతో సంబంధం లేకుండా కనిపిస్తోందని నిర్వా సితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ముంపు జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
2027 మార్చి నాటికి మొదటి దశ పునరా వాస ప్రక్రియ పూర్తి చేసి ప్రాజెక్టు వద్ద నీటి నిల్వ చేస్తామని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటిం చింది. ప్రస్తుతం 41.15 కాంటూరు లెవల్‌లో ముంపునకు గురయ్యే గ్రామాల నిర్వాసితులకు వ్యక్తిగత పునరావాస పరిహారం, కోల్పోతున్న ఇళ్లకు పరిహారం చెల్లించి పునరావాస కాలనీల కు తరలిస్తున్నారు. అయితే కుక్కునూరు మండ లంలోని బెస్తగూడెం, కుక్కునూరు బీ, సీ బ్లాక్ లు, గుండంబోరు, కౌండిన్యముక్తి, చీరవల్లి, మాధవరం, కోమట్లగూడెం, చెరువుకొమ్ము గూడెం, ఎల్లప్పగూడెం, ఆంబోతులగూడెం, సీతారామనగరం, వెంకటాపురం ఎస్సీ కాలనీ తదితర గ్రామాలపై ఏటా వచ్చే గోదావరి వరద ప్రభావం చూపుతోంది. భద్రాచలం వద్ద 47 అడుగుల వరద నీటిమట్టం నమోదు కాగానే పైన పేర్కొన్న గ్రామాలపై ప్రభావం ఉంటోంది.
జాబితాలో లేని గ్రామాలు
మండలంలోని పలు గ్రామాలు 41.15 కాంటూరు లెవల్‌లో లేవు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు వరద కష్టాలు ఎదుర్కొంటున్నారు. సీతారామనగరం శివారు తెలంగాణ సరిహద్దు గ్రామం. ఏటా కిన్నెరసాని ద్వారా గోదావరి వరద ఎగపోటుకు 47 అడుగులు వస్తే ఆ గ్రామానికి వెళ్లే రహదారి నీటమునుగుతుంది. దాదాపు 1500 మంది జనాభా ఉండే గ్రామా నికి మండలంతో సంబంధాలు తెగిపోతాయి. ఆ గ్రామాన్ని 45.72 కాంటూరు లెవల్‌లో చేర్చ డంతో పరిహారం దక్కడం లేదు. గోదావరికి సమీపంలో ఉన్న కౌండిన్యముక్తి గ్రామం 50 అడుగుల గోదావరి నీటిమట్టానికి ముంపునకు గురవుతుంది. కానీ ఆ గ్రామం కూడా ముంపు జాబితాలో లేదు. దామరచర్ల పంచాయతీలోని ఎల్లప్పగూడెం గిరిజన గ్రామం సైతం 50 అడు గుల నీటిమట్టానికి ముంపునకు గురవుతుంది. దాదాపు 150 మందికి పైగా గిరిజనులు అక్కడ నివాసం ఉంటున్నారు. తమను 41.15 కాంటూ రు లెవల్‌లో చేర్చి పరిహారం చెల్లించాలని గిరిజనులు ఎన్నోసార్లు ఆందోళన జరిపారు. కానీ న్యాయం జరగలేదు. కుక్కునూరు గ్రామా నికి మూడు వైపులా గోదావరి ముంపు ప్రభా వం ఉంది. 2017లో సర్వే జరిగిన సమయంలో వెసులుబాటు కోసం కుక్కునూరును నాలుగు బ్లాక్‌లుగా విభజించారు. కానీ గత ప్రభుత్వం ‘ఏ’ బ్లాక్ వరకే ముంపు అని చెప్పి పరిహారం అందించింది. మిగిలిన బీ, సీ బ్లాక్‌లపై గోదావరి వరద ప్రభావం ఉంది. వెంకటాపురం ఎస్సీ కాలనీ, బెస్తగూడెం, ఇతర గ్రామాలపైనా వరద ప్రభావం ఉంది. వరదలు వస్తే ఇళ్ల చుట్టూ నీరు చేరడం, రాకపోకలకు అంతరాయం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.
క్షేత్రస్థాయి సర్వేకు డిమాండ్
ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రతి ఏటా గోదావరి వరద ముంపునకు గురయ్యే గ్రామాలను గుర్తించవచ్చని, శాస్త్రీయంగా, పారదర్శకంగా సర్వే చేస్తే ముంపు కచ్చితంగా తెలుస్తుందని, అప్పుడే నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని బాధిత గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముంపు జాబితాలోకి ఆ గ్రామాలను చేర్చి పరిహారం అందించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు.
ముంపును గుర్తించి పరిహారం
వరదల సమయంలో క్షేత్రస్థాయిలో ముంపును గుర్తించాలి. ఆ గ్రామాలను 41.15 కాంటూరు లెవల్‌లో చేర్చి పరిహారం అందిస్తే న్యాయం జరుగుతుంది. లేదంటే ఏటా కష్టాలే. ముంపుకు గురయ్యే గ్రామాలను 45.72 కాంటూరు లెవల్‌లో చేర్చడం వల్ల అసలైన బాధితులకు పరిహారం అందక నష్టపోతున్నారు.
– కొన్నే లక్ష్మయ్య, కుక్కునూరు ‘బీ’ బ్లాక్ నిర్వాసితుడు
50 అడుగులకే మునుగుతున్నాం
మా గ్రామం గోదావరికి సమీపంలోనే ఉంది. భద్రాచలం వద్ద 50 అడుగుల నీటిమట్టం నమోదైతే మా గ్రామంపై ముంపు ప్రభావం ఉంది. కానీ మా గ్రామాన్ని 45.72 కాంటూరు లెవల్‌లో చేర్చారు. 41.15 కాంటూరు లెవల్ లో చేర్చి పరిహారం అందించాలి.
– తారంగి రాజేశ్వరరావు, కౌండిన్యముక్తి