తీరనున్న దాహార్తి
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:45 AM
విలీన గ్రామాల ప్రజల గొంతులు గోదావరి జలాలతో తడవ బోతున్నాయి. చిర కాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు ప్రభుత్వం బ్రేక్ వేయనుంది.
విలీన గ్రామాలకు గోదావరి జలాలు
రూ.129 కోట్లు కేటాయింపు
మేలో పనులు ప్రారంభర
ఏలూరు టూటౌన్, మార్చి20 (ఆంధ్రజ్యోతి): విలీన గ్రామాల ప్రజల గొంతులు గోదావరి జలాలతో తడవ బోతున్నాయి. చిర కాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు ప్రభుత్వం బ్రేక్ వేయనుంది. అమృత్ 2.0 పథకంలో భాగంగా రూ.129 కోట్లతో ఈ ప్రాజెక్టు రూపు దిద్దుకోనుంది. ఇప్పటికే టెండర్ దశ దాటుకుని ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అనుమతులు పొందింది. ఈ ప్రాజెక్టును పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ చేపట్ట నుంది. ఇప్పటికే సర్వే ప్రారంభ మైంది. ఏప్రిల్, మే నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొదిస్తు న్నారు.విలీన గ్రామాలైన వెంకటాపురం, పోణంగి, మాదేపల్లి, కొమడవోలు, తంగెళ్లమూడి, సత్రంపాడు, శనివారపుపేటల్లో 55 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ గ్రామాల ప్రజలు భూమిలో నుంచి మోటార్లతో తోడుకుని కుళాయిల ద్వారా వచ్చే నీటిని తాగుతున్నారు. ఈ నీటిలో సుద్ద అధికంగా రావడంతో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. వీరంతా ఎప్పటి నుంచో గోదావరి జలాలతో తాగునీరు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నికలు వచ్చినప్పుడల్లా అయా రాజకీయ పార్టీల నాయకులు విలీన గ్రామాలకు తాగునీటి కోసం గోదావరి జలాలు రప్పిస్తామని వాగ్దానాలు చేయడమే తప్ప ఆచరణకు నోచుకోలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోను గోదావరి జలాలు ఇస్తామని వాగ్దానాలు చేస్తారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లల్లో స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికల సమయంలోను ఇదే వాగ్దానం చేసినా అమలు కాలేదు. గత
సాధారణ ఎన్నికల్లో టీడీపీ నాయకులు తమను గెలిపిస్తే విలీన గ్రామాలకు గోదావరి జిలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసిన వాగ్దా నం మేరకు విలీన గ్రామాలకు గోదావరి జలా లు అందించే డీపీఆర్ తయారు చేసి ప్రభు త్వానికి నివేదికలు పంపారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రభుత్వంతో పోరాడి రూ.129 కోట్లు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి మంజూరు చేయించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పోణంగిలో 60 ఎకరాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మిస్తారు. పంపుల చెరువు వద్ద, పోణంగి వద్ద 10ఎంఎల్‌డీ కెపాసిటీతో రెండు వాటర్ ట్రిట్‌మెంట్ ప్లాంట్లు నిర్మిస్తారు. సత్రంపాడు, తంగెళ్లమూడి, చొదిమెళ్ల, శనివారపుపేట, వెంకటా పురం గ్రామాల్లో వెయ్యి ఎంఎల్ కెపాసిటీతో ఐదు ఎలివేటెడ్ రిజర్వాయర్లు నిర్మిస్తారు. ఏడు విలీన గ్రామాల్లో తాగునీటి సర ఫరా కోసం 76 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేస్తారు. మొత్తం 4,600 కుళాయిలు వేయనున్నారు. ఏడాది కాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో విలీన గ్రామా ల దాహార్తి గోదావరి జలాలతో తీరనుంది. ఇప్పటికే దెందులూరు వద్ద 117 ఎకరాల్లో 3వేల ఎంఎల్‌డీ కెపాసిటీతో 2005లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మించా రు. కృష్ణా, గోదావరి నదీ జలాల నుంచి నగర ప్రజలకు రెండు పూటల తాగునీరందిస్తున్నారు.
సర్వే నిర్వహిస్తున్నాం
విలీన గ్రామ ప్రజలకు గోదావరి జలాలు అందించే ప్రాజెక్టుకు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతి లభించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం సర్వే నిర్వహిస్తున్నాం. మే నెల నుంచి నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.
– సుధాకర్, డీఈ, పబ్లిక్‌హెల్త్