వీడుతున్న వరద
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:56 AM
తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 35 అడుగులకు చేరుకోవడంతో గోదావరి శాంతించి వేలేరుపాడు, కుక్కునూరు మండలా లను చుట్టుముట్టిన వరద క్రమేపీ తగ్గుముఖం పడుతోంది.
ముంపు నుంచి బయటపడని ఎద్దువాగు, రుద్రమ్మకోట వంతెనలు
వేలేరుపాడు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 35 అడుగులకు చేరుకోవడంతో గోదావరి శాంతించి వేలేరుపాడు, కుక్కునూరు మండలా లను చుట్టుముట్టిన వరద క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. పై నుంచి వచ్చే వరద తగ్గుముఖం పట్టడంతో సోమవారం ఉదయం నుంచి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వరదలో మునిగిపోయిన రోడ్లు బయటపడ టంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. గ్రామాలను చుట్టు ముట్టిన వరద సమీపంలోని వాగుల్లోకి తగ్గిపోవడంతో ఆయా గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సోమవారం సాయంత్రానికి కూడా వేలేరుపాడు– రుద్రమ్మకోట మధ్య ఉన్న కాజ్‌వే, ఎద్దువాగు వంతెన వరదలోనే మునిగి ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నానికి బయటపడే అవకాశాలున్నాయి.
ముంపు గ్రామాల్లో కూరగాయల పంపిణీ
ముంపు గ్రామాల ప్రజలకు కూరగాయలు, కొవ్వొత్తులు, బరకాలు, పంపిణీ చేసినట్టు తహసీల్దార్ ఎన్.శ్రీనివాస్ తెలిపారు. వరదల కారణంగా 3,345 కుటుంబాలు ప్రభావితం అవ్వగా 11,800 కిలోల కూరగాయలు ఉల్లిగడ్డలు, బంగాళా దుంపలు, దోసకాయలు, టమోట, పచ్చిమిర్చి ఆయా గ్రామాలకు పంపింణీ చేశామన్నారు. 750 టార్పాలిన్లు ప్రజలకు పంపిణీ చేశామన్నారు.