కడు రమణీయం.. గోదా శ్రీరంగనాఽఽథుల కల్యాణం
ABN , Publish Date - Jan 15 , 2026 | 12:30 AM
గోదా శ్రీరంగనాథుల దివ్య కల్యాణ మహోత్సవం ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో కడు రమణీయంగా జరిగింది. చినవెంకన్న క్షేత్రంలో ఈ అద్భుత ఘట్టం బుఽధవారం ఉదయం ఆవిష్కృతమైంది.
ద్వారకాతిరుమల/కాళ్ల/పాలకొల్లు అర్బన్, జనవరి 14(ఆంధ్రజ్యోతి): గోదా శ్రీరంగనాథుల దివ్య కల్యాణ మహోత్సవం ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో కడు రమణీయంగా జరిగింది. చినవెంకన్న క్షేత్రంలో ఈ అద్భుత ఘట్టం బుఽధవారం ఉదయం ఆవిష్కృతమైంది. శ్రీరంగనాథుని భక్తురాలైన గోదాదేవి ఈ ధనుర్మాస పర్వదినాలలో నెలరోజులపాటు పాసురాల ద్వారా స్వామిని కీర్తించి అనంతరం పరిణయమాడతారు. శ్రీవారి ఆలయ నిత్యకల్యాణ మండప ఆవరణలో నిత్యకల్యాణంతోపాటు గోదాదేవిని ఉంచి అర్చకులు కల్యాణతంతును ప్రారంభించారు. సుముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపచేశారు. భక్తుల గోవింద నామస్మరణలు, డోలు, సన్నాయి వాయిద్యాలు, అర్చకస్వాముల వేదమంత్రోచ్ఛరణల నడుమ మాంగల్యధారణ, తలంబ్రాలు ఘనంగా జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు కల్యాణతంతును వీక్షించి పరవశించారు.
కాళ్లకూరు వెంకన్న ఆలయంలో..
కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో స్వయంభూః వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని గోదారంగనాఽథుల కల్యాణ మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. కాళ్ళకూరు వాస్తవ్యులు మద్దాలి తిరుమల వెంకటేశ్వర్లు (బుజ్జి) దంపతులచే కల్యాణ మహోత్సవం ఆలయ అర్చకులు వేద పండితులచే వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖులు, గ్రామ పెద్దలు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు కావాల్సిన సౌకర్యాలను దేవస్థానం ఛైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈవో ఎం. అరుణ్‌కుమార్ పర్యవేక్షించారు.
అష్టభుజలక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో..
పాలకొల్లులోని అష్టభుజలక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో (చిన్న గోపురం) పెరుమాళ్ళుని, అండాళ్ళమ్మ వారిని ప్రత్యేక వేదికపై ఉంచి ఆగమ శాస్త్రానుసారం వేద మంత్రాల మధ్య గోదా కల్యాణం నిర్వహించారు. అదేవిధంగా డైలీ మార్కెట్ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలోనూ, కెనాల్‌రోడ్డులోని వేంకటేశ్వర స్వామివారి ఆలయంలోనూ, శంభన్న అగ్రహారంలోని వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలోనూ, పాండురంగ స్వామివారి ఆలయం, ఇంకా పలు రామాలయాలు, ఆంజనేయస్వామివారి ఆలయాల్లో గోదాదేవి కల్యాణాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో చిన్నగోపురం ఈవో బీవీవీ సత్యనారాయణ శంకర్, చైర్మన్ ప్రవీణ్‌భాను, ట్రస్టీలు, ధనుర్మాస ఉత్సవ కమిటీ సభ్యులు మద్దుల లక్ష్మి, మాజేటి రాంబాబు, నున్న కోటేశ్వరరావు, మామిడి బాబు, వెంకటేశ్వర స్వామివారి ఆలయ ఈవో, అర్చకులు గోవర్ధం కృష్ణ చైతన్య, భక్తులు పాల్గొన్నారు.