కాసులు కొట్టు.. ఉద్యోగం పట్టు!
ABN , Publish Date - Apr 02 , 2026 | 12:27 AM
పశు సంవర్ధక శాఖలో అవినీతికి అంతు లేకుండా పోతోంది. అప్కాస్ ఉద్యోగాల పేరిట లక్షలాది రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
అంగట్లో అప్కాస్ ఉద్యోగాలు
అర్హతలు అక్కర్లేదు.. అధికారులను ప్రసన్నం చేసుకుంటే చాలు
లక్షలాది రూపాయలు వసూలు?
పాతవారి స్థానంలో కొత్తవారికి ఉద్యోగాలు
కలెక్టర్‌ను ఆశ్రయించిన బాధితులు
తాత్కాలికంగా వాయిదా వేయాలంటూ ఆదేశాలు
పశు సంవర్ధక శాఖలో అవినీతికి అంతు లేకుండా పోతోంది. అప్కాస్ ఉద్యోగాల పేరిట లక్షలాది రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అర్హతలు లేకపోయిన అధికారులను ప్రసన్నం చేసుకుంటే చాలు. అప్కాస్ (ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్‌డ్ సర్వీ సెస్) ఉద్యోగాల పేరిట లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇటీవల ఏడు పోస్టులను ఆప్కాస్ పేరుతో రిక్రూట్ చేశారు. ఈ క్రమం లో జిల్లాలోని పశుసంవర్ధక శాఖ ఉన్నతాధి కారులు ఒక్కొ పోస్టుకి రూ. రెండు లక్షల నుంచి రూ.మూడు లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడు పోస్టులకు సుమారు రూ.20 లక్షలు అధికారులు వసూలు చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏలూరు టూటౌన్, ఏప్రిల్1(ఆంధ్రజ్యోతి): పశు సంవర్ధక శాఖలో ఆప్కాస్ పేరిట జరిపిన ఉద్యోగాల భర్తీకి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. రాత పరీక్ష లేనే లేదు. ఇంటర్వూల ఊసేలేదు. ఈ పోస్టుల ఫైల్ పై సమీక్షించేందుకు కలెక్టర్ వెట్రిసెల్వి రెండుసార్లు పశుసంవర్థక శాఖ ఇన్‌చార్జ్ జాయింట్ డైరెక్టర్‌కు కబురు పంపగా కలెక్టరేట్‌కు వెళ్లకుండా ఈ–ఫైలింగ్ విధానం ద్వారా ఫైల్ పంపించి కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.
గతేడాది నలుగురు ఉద్యోగులు తొలగింపు
2023 ఆగస్టులో నలుగురు ఉద్యోగులు అప్కాస్ ద్వారా నియమితులయ్యారు. వీరిని 2025 జూలైలో తొలగించగా ఏ కారణం లేకుండానే తొలగించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నలుగురు ఉద్యోగులు తమ కు న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రి కార్యా ల యం (సీఎంవో)లో పీజీఆర్‌ఎస్‌లోను, మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం గతేడాది ఆగస్టు 20వ తేదీన ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఈ నలుగురికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. గతేడాది ఆగస్టు 9వ తేదీ పశుసంవర్థక శాఖ రాష్ట్ర డైరెక్టర్ ఈ నలుగురికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఏలూ రు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో నలుగురు ఉద్యోగులకు ఉద్యోగాలిచ్చే అంశాలు పరిశీలించాలం టూ కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ, ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ కలెక్టర్‌కు సిఫార్సు లేఖలు రాశారు. అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ టి.విజయకుమారికి ఉద్యోగం ఇవ్వడానికి ఇన్‌చార్జి జాయింట్ డైరెక్టర్ నిరాకరించారు. బాధితులు సీఎంవో కార్యాలయానికి ఫిర్యాదు చేసిన నెలరోజుల లోపున జేడీ కార్యాలయం నుంచి ప్రస్తుతం ఎటువంటి డేటా ఎంట్రీపోస్టులు ఖాళీ లేవని సమాధానం పంపారు. సీఎంవో కార్యాలయానికి తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులు ఇప్పుడు ఖాళీ ఉన్నాయంటూ 3 డేటాఎంట్రీ పోస్టులు, 3 ల్యాబ్ అటెండర్లు, ఒక వాచ్‌మాన్ పోస్టు ఎలా భర్తీ చేశారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అటు ప్రభుత్వ ఆదేశాలను, సీఎంవో కార్యాలయ సూచనలను, కేంద్ర మంత్రి, ఎంపీ సిఫార్సులను పట్టించుకోకుండా కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించి ఏడుగురికి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. ప్రస్తుతం అప్కాస్ అమలులో లేదు. ఈ పరిస్థితుల్లో ఎలా అప్కాస్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అపాయింట్ మెంట్ లెటర్లు చూసి కంగుతిన్న బాధిత ఉద్యోగి పి.విజయ ఏసుకుమారి మంగళవారం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ రిక్రూట్‌మెంట్ ఫైల్ తాత్కాలికంగా వాయిదా వేయాలని ఆదేశిం చారు. అప్కాస్ ద్వారా ప్రభుత్వ నిబంధనలతో ఉద్యోగాలు పొందిన తమను ఆకారణంగా తొలగించారని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు. అన్ని అర్హతలు ఉన్న తమను కాదని మా పోస్టుల్లో వేరే అర్హతలేని వ్యక్తులను ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. పశుసంవర్థక శాఖలో ఇటీవల జరిగిన ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌పై ఉన్నతస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధిత ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.