Share News

పాలిసెట్‌లో బాలికలే టాప్‌ !

ABN , Publish Date - May 06 , 2026 | 12:38 AM

పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష పాలిసెట్‌ ఫలితాల్లో బాలికలే ముందంజలో నిలిచారు.

పాలిసెట్‌లో బాలికలే టాప్‌ !

11వ స్థానంలో జిల్లా ..

టాప్‌ టెన్‌లో ముగ్గురు

భీమవరం రూరల్‌, మే 5 (ఆంధ్రజ్యోతి) : పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష పాలిసెట్‌ ఫలితాల్లో బాలికలే ముందంజలో నిలిచారు. బాలురు కంటే 3.83 శాతం అధిక ఉత్తీర్ణతతో హవా సాగించారు. పశ్చిమ గోదావరి జిల్లా మంచి స్థానంలో నిలిచింది. జిల్లాలో 8,153 విద్యార్థులు పాలిసెట్‌ రాయగా 7,501 మంది (92 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 4,650 మందికి 4213 మంది(90.60 శాతం), బాలికలు 3,503 మందికి 3,288 మంది (93.86 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 2025లో 7 వేలకు పైగా రాయగా ఈ ఏడాది 8,153 మంది రాశారు. జిల్లాలో ముగ్గురు విద్యార్థులు టాప్‌టెన్‌లో స్థానం దక్కించుకున్నారు. 120 మార్కులకు 120 మార్కులు సాధించి ముందంజలో నిలిచారు. టి.సాయి విష్ణుతేజ 2వ ర్యాంకు, తోట మానస 4వ ర్యాంకు, జగన్‌ వెంకట నరసింహస్వామి 5వ ర్యాంకు సాధించారు.

ఈసారి ముందుగానే కౌన్సెలింగ్‌ ?

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని కోర్సులు సరైన సమయానికి విద్యా సంవత్సర తరగతులు మొదలవుతున్నాయి. గత ఏడాది మే నెలాఖరున కౌన్సెలింగ్‌ మొదలైంది. ఈ ఏడాది గత నెల 25వ తేదీన పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. 10 రోజుల్లోనే ఫలితాలు వెల్లడయ్యాయి. అదే స్పీడ్‌తో పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌ జరుగుతందని అధికారులు చెబుతున్నారు. ఈనెల మూడోవారంలో కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదలవుతుందనే అంచనాలో ఉన్నారు. అలా జరిగితే జూన్‌ నెలలో తరగతులు మొదలవుతాయి. గడిచిన రెండేళ్ల నుంచి పాలిటెక్నిక్‌ కోర్సులపై విద్యార్థుల మక్కువ పెరిగింది. దీంతో గత ఏడాది జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ, 8 ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అడ్మిషన్లు బాగా జరిగాయి. 3,080 సీట్లలో 2,161 సీట్లు భర్తీ అయ్యాయి. గతేడాదికంటే ఈ ఏడాది వెయ్యిమంది అధికంగా పాలిసెట్‌ రాశారు. దీంతో అడ్మిషన్లు పెరుగుతాయని కళాశాలల యాజమాన్యాలు భావిస్తున్నాయి.

Updated Date - May 06 , 2026 | 12:38 AM