Share News

దిగొస్తున్న అల్లం

ABN , Publish Date - Jul 20 , 2026 | 12:10 AM

మార్కెట్లో అల్లం ధర పడిపోయింది. గతవారంతో పోల్చుకుంటే పాత అల్ల కిలోకు రూ.80 తగ్గింది. గత వారం పాత అల్లం ఏకంగా కిలో రూ.280కు విక్రయించారు.

దిగొస్తున్న అల్లం

పాత అల్లం కిలో రూ.200

కొత్త అల్లం కిలో.100 నుంచి 120

హడలెత్తిస్తున్న ఆగాకర ధరలు

దిగిరాని చికెన్‌..ఉల్లి ధరలు

తాడేపల్లిగూడెం, జూలై 19(ఆంధ్రజ్యోతి): మార్కెట్లో అల్లం ధర పడిపోయింది. గతవారంతో పోల్చుకుంటే పాత అల్ల కిలోకు రూ.80 తగ్గింది. గత వారం పాత అల్లం ఏకంగా కిలో రూ.280కు విక్రయించారు. ఇప్పుడు మార్కెట్‌కు కొత్తం వచ్చిపడింది. దీనితో కిలో రూ.100 నుంచి 120 మధ్య విక్రయిస్తున్నారు. ఇది హోల్‌సేల్‌గా 10 కిలోలు రూ.50 నుంచి 70 మధ్య విక్రయిస్తున్నారు. కొత్త అల్లం బెంగళూరు నుంచి ప్రస్తుతం మార్కెట్‌కు వస్తుంది. అరకు నుంచి, పశ్చిమబెంగాల్‌ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బెంగళూరు నుంచే కొత్త, పాత అల్లం మార్కెట్‌కు వస్తుంది.

హడలెత్తిస్తున్న ఆగాకర

ఆగాకర కాయల ధరలు సామాన్యుడు కొనుగోలు చేయలేని స్థాయికి చేరాయి. మార్కెట్‌కు గత వారం నుంచి ఆగాకర వస్తుంది. దీన్ని కిలో రూ.250కు విక్రయిస్తున్నారు. మార్కెట్‌కు తక్కువగా రావడంతో దీని ధర ఎక్కువ పలుకుతుంది. ఇతర ప్రాంతాల్లో తోటలు వేసిన వారు వీటిని మార్కెట్‌కు తీసుకొస్తే ఽధరలు తగ్గే అవకాశం ఉందని హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి కొంత మంది ముందుగా ఆగాకర పాదులు పెట్టిన వారు తీసుకొస్తున్నారు.

దిగిరాని చికెన్‌ ధరలు

మార్కెట్లో చికెన్‌ ధరలు దిగిరావడం లేదు. గత నాలుగు వారాలుగా చికెన్‌ ధరలు స్థిరంగానే ఉండిపోయాయి. ఇప్పుడు స్కిన్‌లెస్‌ చికెన్‌ కిలో రూ.300కు, విత్‌ స్కిన్‌ చికెన్‌ రూ.280, బర్డ్‌ రూ.170కు విక్రయిస్తున్నారు. మేత ధరలు పెరిగిపోవడంతో ఈ సంవత్సరం కోళ్లను రైతులు పెంచే శాతం తగ్గింది. కార్పొరేట్‌ సంస్థల వద్ద మాత్రమే ఇప్పుడు కోళ్లు ఉన్నాయి. వీటిని ఆయా సంస్థలు ధరలను స్థిరంగా ఉంచి మార్కెట్‌ను శాసిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద కోళ్లు అమ్ముదామనే సమయంలో ధరల పడిపోవడం జరగుతుంది. దీంతో వీటిని పెంచడం ప్రస్తుతం భారంగా మారింది. వాతావరణం కూడా ఈ సంవత్సరం ప్రతికూలంగా మారడంతో ఆ ప్రభావం కోళ్ల పెంపకందారులపై పడింది. దీంతో గుడ్ల ఉత్పత్తి కూడా ఎన్నడూ లేనివిధంగా తగ్గింది. దీంతో కోడిగుడ్ల ధరలకు కూడా రెక్కలొచ్చాయి.

నాణ్యమైన ఉల్లి కిలో రూ.35

మార్కెట్లో ఉల్లి ధరలు దిగిరావడం లేదు. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి ఉల్లి వస్తుంది. హోల్‌సేల్‌గా క్వింటా ఉల్లి నాణ్యత ఆధారంగా రూ.1200 నుంచి 2800 మధ్య పలుకుతుంది. అత్యంత నాణ్యమైన ఉల్లిని రిటైల్‌ వ్యాపారులు రూ.100కు 3కిలోలు ఇస్తున్నారు. విడిగా కిలో రూ.35 వంతున విక్రయాలు చేస్తున్నారు. మధ్యరకంగా ఉండే ఉల్లిని కూడా రిటైల్‌ వ్యాపారులు 10కిలోలు బస్తాగా ప్యాక్‌ చేసి రూ.320కు విక్రయిస్తున్నారు. నాణ్యమైన ఉల్లిని అమ్మడం వల్ల చిరువ్యాపారులకు ఒక్కరూపాయి కూడా మిగలదని తెగేసి చెబుతున్నారు. మొదటిరకం, రెండవ రకం కలిపి అమ్మడం వల్ల మిగులుతాయని చెబుతున్నారు. ఇక ఈనెలాఖరుకుగాని, వచ్చేనెల మొదటి రెండవ వారం నుంచి కర్నూలు ఉల్లి మార్కెట్‌కు వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. అప్పుడు ఉల్లి ధరలు తగ్గే అవకాశం ఉందని, ముందుగా వేసిన కర్నూలు ఉల్లి రైతులు ఈనెలాఖరుకు మార్కెట్‌కు తీసుకొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో మాదిరిగా తాడేపల్లిగూడెం మార్కెట్‌కు కుప్పలు తెప్పలుగా కర్నూలు ఉల్లి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే కర్నూల్‌లోనే ఉల్లి మార్కెట్‌ యార్డును ఏర్పాటు చేశారు. అక్కడ నుంచే ఒడిశ్సా, పశ్చిమబెంగాలుకు అక్కడ వ్యాపారులు వచ్చి నేరుగా కొనుగోలు చేసి తీసుకుపోతున్నారు. గతంలో తాడేపల్లిగూడెం వ్యాపా రులు అక్కడి రైతులకు పెట్టుబడులు పెట్టేవారు. దీంతో అక్కడ ఉండే పండించిన ఉల్లి గూడెం మార్కెట్‌కు వచ్చేంది. కరోనా తరువాత ఇక్కడ వ్యాపా రులు అక్కడ రైతులకు పెట్టుబడులు పెట్టడం మానే శారు. దీంతో ఉల్లి వ్యాపారులు సంఖ్య పెరిగింది. నేరుగా ఒడిశ్సా, బెంగాల్‌ నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసుకుంటున్నారు.

రూ.50కు దిగువనే కూరగాయల ధరలు

రెండు మూడు రకాలు తప్ప అన్ని రకాల కూరగాయల ధరలు రూ.50కు దిగువనే లభిస్తున్నాయి. చిక్కుడు కిలో రూ.120, వంగ రూ.70, బీన్స్‌ రూ.140, ముల్లంగి రూ.120 తప్ప మిగిలిన కూరగాయల ధరలు రూ.50కు దిగువనే ఉన్నాయి. బెండకాయలు రూ.40, దొండ రూ.40, టమాటా రూ.30. క్యారెట్‌ రూ.50, క్యాబేజ్‌ రూ.40, చిలకడ రూ.50, కాకర రూ.50, ఆనభకాయ రూ.15 నుంచి 20, మునగకాడలు జత రూ.15, అరటి జతా రూ.15 నుంచి 20 విక్రయించారు.

Updated Date - Jul 20 , 2026 | 12:10 AM