దిగిరానంటున్న అల్లం, చికెన్
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:39 AM
మార్కెట్లో అల్లం ధర దూసుకుపోతున్నది. ఎన్నడూ లేనివిధంగా కిలో రూ.280(పాతది) అమ్ముతు న్నారు.
తగ్గుతున్న కూరగాయల ధరలు.. నిలకడగా ఉల్లి
తాడేపల్లిగూడెం, జూలై 12(ఆంధ్రజ్యోతి): మార్కెట్లో అల్లం ధర దూసుకుపోతున్నది. ఎన్నడూ లేనివిధంగా కిలో రూ.280(పాతది) అమ్ముతు న్నారు. కొత్త అల్లం ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతుంది. కాని పాత అల్లానికి మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. గత వారం కిలో పాత అల్లం రూ.250 ఉంటే ఈ వారం ఏకంగా రూ.280కు ఎగబాకింది. కొత్త అల్లం కిలో రూ.200కు లభిస్తుంది. ఒకే రోజు అధికంగా వినియోగించే వారు మాత్రమే కొత్త అల్లాని వినియోగిస్తున్నారు. నిలువ ఉండే సామర్ధ్యం తక్కువగా ఉండటమే ప్రధాన కారణం. కొత్త అల్లాన్ని ఎక్కువగా ఫంక్షన్లకు, హోటళ్లకు ప్రస్తుతానికి వినియోగిస్తున్నారు. అల్లంలో తరుగుదల శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కొత్త అల్లంలో మరింత ఎక్కువగా ఉంటుంది.
చికెన్ ధర పైపైకి..
మార్కెట్లో చికెన్ ధరలు దిగిరావడం లేదు. నాలుగు వారాలుగా చికెన్ ధరలు స్థిరంగా ఉండిపోయాయి. ఈ సంవత్సరంలో అత్యధికంగా స్కిన్‌లెస్ కిలో రూ.380 చేరింది. తరువాత కిలో రూ.220కు పడింది. తరువాత మళ్లీ పైకిలేచి రూ.300 వద్ద స్థిరంగా ఉంది. ప్రస్తుతం స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.300, విత్‌స్కిన్ చికెన్ రూ.280, బర్డ్ కిలో రూ.175కు అమ్ముతున్నారు. రైతుల వద్ద పెంచిన కోడి ఇంకా మార్కెట్‌కు రావడం లేదు. కార్పొరేట్ సంస్థల వద్ద ఉన్న కోళ్లు మాత్రమే మార్కెట్‌కు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతానికి ధరలు తగ్గే అవకాశం ఉండదని రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు. ఈ నెలాఖరులోపు రైతులు పెంచిన కోళ్లు మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది. అప్పటి నుంచి చికెన్ ధరలు తగ్గుముఖం పట్టవచ్చని చెబుతున్నారు. ఇక కోడి గుడ్ల ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. అట్ట(30)గుడ్లు రూ.210 అమ్ముతున్నారు. ఇక చిల్లరిగా ఒక్క గుడ్డు కొనాలంటే రూ.8కి అమ్ముతున్నారు.
వంకాయ టాప్ రేట్
వంకాయ ధరలు సామా న్యులకు అందని ఎత్తుకు చేరా యి. వాతావరణం అనుకూల ంగా లేకపోవడంతో వంకా యల ఉత్పత్తి గణ నీయంగా తగ్గింది. వంగతోటలకు చీడ పీడలు ఆశించడంతో దిగుబడులు తగ్గిపోయాయి. ఇప్పుడు మార్కెట్‌కు వచ్చే వంకాయాల్లో 50శాతం వరకు పుచ్చులు ఉంటున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పు వల్ల ఈ పంటకు ప్రతికూలంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మంచి వంకాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ వచ్చిపడింది. నాణ్యమైన తెల్లవంకాయ కిలో రూ90 నుంచి 100 మధ్య ధర పలికింది. నల్లవంగ కిలో రూ.70 నుంచి 80 విక్రయించారు. మిగిలిన కూరగాయలు తగ్గుముఖం పట్టాయి. బీరకాయలు కిలో రూ.50, బెండకాయలు రూ.30, దొండకాయలు రూ.30, టమాటాలు రూ.30, చిక్కుళ్లు రూ.80, క్యారెట్ రూ.50, బీట్‌రూట్ రూ.50, క్యాప్సికం రూ.120, బీన్స్ రూ.110, పచ్చిమిర్చి కిలో రూ.50 నుంచి 60, దోస కిలో రూ.30, బంగాళాదుంప రూ.25 నుంచి రూ.30 మధ్యలోను, పొట్ల కాయ రూ.30, అరటి జతా రూ.20 విక్రయించారు.
నాణ్యమైన ఉల్లి కిలో రూ.35
మార్కెట్లో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. ప్రధానంగా నాణ్యమైన ఉల్లికి మరింత డిమాండ్ ఉంది. హోల్‌సేల్‌గా క్వింటా ఉల్లి రూ.1500 నుంచి 2800 మధ్యంలో ధర పలుకుతుంది. ఇప్పుడు మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచే ఉల్లి వస్తుంది. అత్యంత నాణ్యమైన ఉల్లి హోల్‌సేల్‌గా క్వింటా రూ.2800 విక్రయాలు జరిగాయి. ఇలాంటి ఉల్లిని రిటైల్ వ్యాపారులు రూ.100కు 3కిలోలు, విడిగా ఒక కిలో రూ.35కు అమ్మారు. ఇప్పుడు ఆట్లోలో అమ్మేవ్యాపారులు కూడా రూ.100కు రెండున్న కిలోలు ఇవ్వడం గమనార్హం. తాడేపల్లిగూడెం మార్కెట్‌కు 8 లారీల్లో 240 టన్నుల ఉల్లి వచ్చింది.