Share News

గేట్లు ఇలా.. నీరెలా..?

ABN , Publish Date - Mar 09 , 2026 | 12:45 AM

రామచంద్రపురం రెగ్యులేటర్‌ 117 వద్ద గేట్లు పాడైయి సరిగ్గా పని చేయకపోవడంతో వేంపాడు మేజర్‌ కాల్వకు నీరు రాని పరిస్థితులు నెలకొన్నాయి.

గేట్లు ఇలా.. నీరెలా..?
రామచంద్రపురం రెగ్యులేటర్‌ 117 వద్ద గేట్ల దుస్థితి

వేంపాడు మేజర్‌కు రాని సాగర్‌ జలాలు

రామచంద్రపురం రెగ్యులేటర్‌ 117 వద్ద పాడైన గేట్లు

మంత్రి పార్థసారథి దృష్టికి సమస్య

త్వరలోనే నూతన గేట్లు అమర్చుతామని హామీ

ముసునూరు, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): రామచంద్రపురం రెగ్యులేటర్‌ 117 వద్ద గేట్లు పాడైయి సరిగ్గా పని చేయకపోవడంతో వేంపాడు మేజర్‌ కాల్వకు నీరు రాని పరిస్థితులు నెలకొన్నాయి. వారం రోజుల పాటు 1000 క్యూసెక్కుల సాగర్‌ జలాలను ఎన్‌ఏస్పీ అధికారులు విడుదల చేశారు. అయితే ఈ రెగ్యులేటర్‌ వద్ద గేట్లు పనిచేయక వేంపాడు మేజర్‌ కాల్వకు అరకొరగా వచ్చిన నీళ్లు ముసునూరు మండలం సూరేపల్లి వద్దకు మాత్రమే చేరాయి. ఈ గేట్లు పాడైపోవడంతో పూర్తిగా దించేందుకు వీలులేక వదిలిన నీరులో ఎక్కువ శాతం నూజివీడు కెనాల్‌ వైపునకు వెళ్లిపోవడంతో వేంపాడు కాల్వకు సంవృద్ధిగా నీరు వచ్చే పరిస్థితుల సన్నగిల్లాయి. వేంపాడు మేజర్‌ కాలువకు సాగర్‌ జలాలు వస్తేనే సాగునీరు, తాగునీరు కష్టాలు తీరుతాయని రైతులు, ప్రజలు చెబుతున్నారు. వ్యవసాయ బోర్లు నుంచి వచ్చే నీటి సామర్థ్యం కొద్దిగా తగ్గిందని, వేసవిలో మరింతగా భూగర్భ జలాలు తగ్గే ప్రమాదం పొంచి ఉందని రైతులు అంటున్నారు. దీని వల్ల సాగు, తాగునీటి కష్టాలు మరింతగా ఎక్కువ అయే అవకాశం ఉందని వారు వాపోతున్నారు.

మంత్రి దృష్టికి సమస్య

రామచంద్రపురం రెగ్యులేటర్‌ 117 వద్ద గేట్లు సమస్యను డీసీ చైర్మన్‌ రాపర్ల బాలకృష్ణ, మండల టీడీపీ అధ్యక్షులు గద్దె రఘుబాబు రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సమస్యను ఇటీవల రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దృష్టికి వారు తీసుకువెళ్లారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మాట్లాడి నూతన గేట్లు అమర్చి త్వరలో సమస్యకు పరిష్కారం చూపుతామని మంత్రి హామీ ఇచ్చినట్టు బాలకృష్ణ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 40 రోజుల పాటు వేంపాడు మేజర్‌కు సాగర్‌ జలాలను వదిలి వేంపాడు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించామని, రామచంద్రపురం రెగ్యులేటర్‌ 117 వద్ద గేట్లు సమస్య లేకుండా చర్యలు తీసుకుని, సాగు, తాగు నీరు ఇబ్బం దులు రాకుండా చూస్తామని మంత్రి స్పష్టం చేసినట్లు చైర్మన్‌ బాలకృష్ణ తెలిపారు.

Updated Date - Mar 09 , 2026 | 12:45 AM