గ్యాస్ బాదుడు
ABN , Publish Date - Jun 09 , 2026 | 12:23 AM
అమెరికా– ఇరాన్ యుద్ధ ప్రభావంతో మళ్లీ గ్యాస్ సిలిండర్ ధరను పెంచేశారు. అంత ర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగిన కారణంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.29 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
మళ్లీ పెరిగిన ధరలు
డొమెస్టిక్ సిలిండర్‌పై రూ. 29 పెంపు .. రూ. 975 లకు చేరిక
రోజువారీ 11వేల బుకింగ్‌లు.. వినియోగదారులపై రూ. 3.19 లక్షల భారం
(ఏలూరుసిటీ– ఆంధ్రజ్యోతి)
అమెరికా– ఇరాన్ యుద్ధ ప్రభావంతో మళ్లీ గ్యాస్ సిలిండర్ ధరను పెంచేశారు. అంత ర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగిన కారణంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.29 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అంత ర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు విషయం లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ధరలను పెంచక తప్పలేదని కేంద్ర ప్రభుత్వం చెబు తోంది. గత మూడు నెలల్లో ధర పెంచడం ఇది రెండోసారి. గత మార్చి 7న సిలిండర్‌పై రూ.60 పెంచగా, తాజాగా ఇప్పుడు రూ.29 పెరిగింది. జిల్లాలో మొన్నటి వరకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.946 ఉండగా తాజా గా రూ.29 పెంపుతో రూ.975లకు చేరింది.
రోజువారీ రూ. 3.19 లక్షలు అదనపు భారం
జిల్లాలో 6.15 లక్షల గ్యాస్ వినియోగదారులున్నారు. ధరల పెంపుతో రోజువారీ రూ.3.19 లక్షల వరకు భారం పడుతుంది. జిల్లాలో 55 గ్యాస్ ఏజన్సీలు ఉండగా రోజువారీ 11 వేల గ్యాస్ సిలిండర్లు వినియోగం ఉంది. యుద్ధ సమయంలో గ్యాస్ సిలిండర్ ధరను పెంచకపోయినా దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ధరను పెంచేశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. పెంచిన గ్యాస్ సిలిండర్ దరను తగ్గించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.