Share News

కట్టెల పొయ్యిలే దిక్కు !

ABN , Publish Date - Apr 16 , 2026 | 12:42 AM

ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ఇరాన్‌–ఇజ్రాయిల్‌ యుద్దం ఎఫెక్ట్‌తో గ్యాస్‌ కష్టాలు మరింత పెరిగాయి.

కట్టెల పొయ్యిలే దిక్కు !
ఆకివీడు లో కట్టెల పొయ్యిపై వంటలు

యుద్ధం ఎఫెక్ట్‌తో పెరుగుతున్న వంట గ్యాస్‌ కష్టాలు

కనుమరుగవుతున్న కర్రీ పాయింట్‌లు

మూతపడుతున్న చిన్నచిన్న హోటళ్లు

ప్లేట్‌ ఇడ్లీ రూ.50.. దోసె తినాలంటే దోపిడీ

పాలకొల్లు/తాడేపల్లిగూడెం/పెనుగొండ/ఆకివీడు, ఏప్రిల్‌ 15 (ఆంధ్ర జ్యోతి) : ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ఇరాన్‌–ఇజ్రాయిల్‌ యుద్దం ఎఫెక్ట్‌తో గ్యాస్‌ కష్టాలు మరింత పెరిగాయి. ప్రధానంగా గ్యాస్‌ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో టిఫిన్‌ సెంటర్‌లు, బిర్యాని సెంటర్‌లు, భోజన హోటల్స్‌ వారు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది రోడ్లపక్కన కట్టెల పొయ్యిలతో వంటలు చేస్తున్నారు. మరికొంత మంది షాపులను మూసివేసి దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. షాపులు నిర్వహించే కొంతమంది అధికధరలకు విక్రయాలు చేయడంతో వినియోగదారులకు ఇబ్బందికరంగా మారుతుంది. మొత్తం మీద యుద్దం కారణంగా ఏర్పడిన వంట గ్యాస్‌ కొరతతో ప్రజానికం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గ్యాస్‌ బుక్‌ చేసుకున్నా డెలివరీకి పది నుంచి పదిహేను రోజులకు పైగా పడుతుందని గ్యాస్‌ లేక ఇంటి వంటకు ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. చిరు వ్యాపారులు సిలెండర్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. కమర్షియల్‌ సిలెండర్‌లు సరఫరా చేయడం లేదని, వ్యాపారాలు మూతవేయాల్సి వస్తుందంటున్నారు. ఫుట్‌పాత్‌, తోపుడు బండ్లపై టిఫిన్స్‌, ఫాస్ట్‌ఫుడ్‌, బజ్జీలు అమ్ముకునే వ్యాపారులు గ్యాస్‌ అందుబాటులో లేకపోవడంతో వ్యాపారాలు చేయలేకపోతున్నామని చెబుతున్నారు.

పెరిగిన కుక్కర్ల అమ్మకాలు

గత 20 రోజులుగా విద్యుత్‌ కుక్కర్లు అమ్మకాలు ఘననీయంగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. విద్యుత్‌ ఉన్న సమయంలో కుక్కర్లు వినియోగిస్తూ వంటలు పూర్తిచేసుకుంటున్నారు. అధిక శాతం గృహిణులు గ్యాస్‌ ఆదా చేసుకుంటున్నారు.

పెరిగిన అల్పాహారం ధరలు

గ్యాస్‌ కష్టాలు పెరగడంతో రెస్టారెంట్లలో అల్ఫాహార ధరలు పెంచేశారు. జిల్లాలోని అయాప్రాంతాలను బట్టి ప్లేట్‌ ఇడ్లీ ధర కనిష్టంగా రూ.30, గరిష్టంగా 50కి చేరింది. సింగిల్‌ సాంబార్‌ ఇడ్టీ రూ.30 ధర పలుకుతుంది. సాధారణ దోసె రూ.40నుంచి 50కి, ఉల్లిదోసె రూ.60కి చేరింది. మొత్తంగా అన్ని రకాల అల్ఫాహార ధరలు చుక్కలు చూపిసు ్తన్నాయి.. పెద్ద హోటళ్లకు వెళ్లి టీపిన్‌ చేసి, టీ తాగితే రూ. 100 ఖర్చు అవుతుందని సామాన్యులు లబోదిబో అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్‌ సరఫరాపై దృష్టి పెట్టి బ్లాక్‌ మార్కెట్‌ను నియంత్రించి గ్యాస్‌ కష్టాలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

మూతపడుతున్న కేటరింగ్‌ సెంటర్లు

ఇంటికి నలుగురు బంధువులు వస్తే వారికి భోజనం పెట్టడానికి వెంటనే గుర్తుచ్చేది కర్రీ ఫాయింట్‌. రెండు రకాల కూరలు, కాస్త సాంబారు తెచ్చి కడుపారా భోజనం పెట్టేవారు. చిన్నపాటి ఫంక్షన్లకు 50మందికో లేదంటే 100 మందికో భోజనాలు ఏర్పాటు కేటరింగ్‌ ద్వారానే జరుపుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్ధితులు కనిపించడం లేదు. వంట గ్యాస్‌ కష్టాలతో కేటరింగ్‌ సెంటర్లు మూతపడు తున్నాయి. కర్రీ పాయింట్‌లు ఒకరోజు తీస్తే రెండు రోజులు మూసేస్తున్నారు. గ్యాస్‌ ఇబ్బందులతో విద్యుత్‌ కుక్కర్లతో అన్నం వండుకునే పరిస్థితి ఏర్పడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు వేలకు పైబడి చిన్న హోటళ్లు సుమారు రెండు వేలు కర్రీ పాయింట్లు ప్రతీ పట్టణం లోనూ పదులు సంఖ్యలో రెస్టారెంట్లు ఉన్నాయి. గ్యాస్‌ కొరతతో చిన్న తరహా హోటళ్లు జిల్లాలో ఐదింట మూడు మూతపడ్డాయి. కర్రీ పాయింట్లదీ అదే పరిస్థితి.

సిలిండర్‌ బ్లాక్‌లో రూ.2,500 వరకు

గ్యాస్‌ సిలిండర్ల బ్లాక్‌ మార్కెట్‌ దందా కొనసాగుతోంది. రూ.900లకు రావాల్సిన గృహ వినియోగ గ్యాస్‌ సిలెండర్‌ బ్లాక్‌లో రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు వసూలు చేస్తున్నారు. ఇక కమర్షియల్‌ సిలిండర్‌ రూ.3500కు పైగా పలుకుతుంది. బుక్‌ చేసిన సిలిండర్‌ రావాలంటే పది రోజులనే పడుతోంది. దీంతో గృహ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓటీపీలు లేకుండానే బుకింగ్‌ పూర్తి చేసి సిలెండర్లు బ్లాక్‌ మార్కెట్‌కు విక్రయిస్తున్నట్టు బహిరంగా ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోడంతో గ్యాస్‌ సరఫరా దారులు ఆడింది ఆటగా మారింది.

కట్టె పుల్లలకు పెరిగిన డిమాండ్‌

గ్యాస్‌ కొరతతో ఎక్కువ మంది పుల్లలపై ఆధారపడడంతో మార్కెట్లో వీటికి డిమాండ్‌ ఏర్పడింది. గతంతో గుండెత్తు (20 కేజీలు) రూ.200 ఉండేది. నాణ్యమైన చింత, సరుగుడు, తుమ్మ పుల్లలు దొరికేవి. ఇవే పుల్లలు ప్రస్తుతం మార్కెట్లో గుండెత్తు రూ.500 నుంచి 600 మధ్య అమ్ముతున్నారు. అయినప్పటికీ పుల్లలు దొరకడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. కొన్ని విద్యాసంస్థలు(హాస్టల్స్‌) పూర్తిగా పుల్లలపైనా ఆధారపడి వంటలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాతరోజులు గుర్తుకొస్తున్నాయి. ఎండిన పుల్లలను ఏరి మోపుగా కట్టి ఇంటికి తెచ్చుకుంటున్నారు.

Updated Date - Apr 16 , 2026 | 12:42 AM