Share News

గ్యాస్‌ కష్టాలు!

ABN , Publish Date - Mar 15 , 2026 | 12:33 AM

జిల్లాలో గ్యాస్‌ కష్టాలు తప్పడం లేదని వినియోగదారులు వాపో తున్నారు. గ్యాస్‌ బుకింగ్‌ కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మని చెబుతున్నారు.

 గ్యాస్‌ కష్టాలు!
గ్యాస్‌ ఏజన్సీ వద్ద జనాలు క్యూ

ప్యానిక్‌ బుకింగ్‌ వల్ల సర్వర్‌ సమస్యలు

గ్యాస్‌ ఏజన్సీల వద్ద సిలిండర్ల కోసం జనం క్యూ

ఏజన్సీలను తనిఖీ చేసిన విజిలెన్స్‌, సివిల్‌ సప్లయిస్‌ అధికారులు

బ్లాక్‌ మార్కెటింగ్‌ జరగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు

ఏలూరు సిటీ, మార్చి14(ఆంధ్రజ్యోతి):

ఇరాన్‌– ఇజ్రాయెల్‌ యుద్ధ పరిణామాల వల్ల గ్యాస్‌ కష్టాలు కొనసాగుతూనే ఉన్నా యి. మరోవైపు గ్యాస్‌ సరఫరాలో వినియోగదారులు ఇబ్బందులు పడకుండా జిల్లా యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపట్టింది. జిల్లాలో గ్యాస్‌ ఏజన్సీలలో గ్యాస్‌ సరఫరా ఎలా జరుగు తుందో, బుకింగ్‌ చేసిన వారికి గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేస్తున్నారా.. అనే విష యాలపై జిల్లాలోని పలు గ్యాస్‌ ఏజన్సీలను సివిల్‌ సప్లయిస్‌ టీం, విజిలెన్స్‌ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.

జిల్లాలో గ్యాస్‌ కష్టాలు తప్పడం లేదని వినియోగదారులు వాపో తున్నారు. గ్యాస్‌ బుకింగ్‌ కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మని చెబుతున్నారు. జిల్లాలో గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌, డెలివరీ కోసం గ్యాస్‌ ఏజన్సీల వద్ద జనాలు క్యూ కడుతున్నారు. కొన్ని గ్యాస్‌ ఏజన్సీల వద్ద గ్యాస్‌ బుక్‌ చేసుకునే పరిస్థితులు లేవని చెబుతున్నారు. బుకింగ్‌ చేసు కున్న వినియోగ దారులకు కొంత ఆలస్యమైనా గ్యాస్‌ సిలిండర్లు సరఫరా జరుగు తోంది.

ఒకేసారి బుకింగ్‌.. సర్వర్‌ సమస్యలు

ఒకేసారి ఎక్కువ మంది గ్యాస్‌ సిలిండర్లను బుక్‌ చేసుకోవడం (ప్యానిక్‌ బుకింగ్‌) వల్ల సర్వర్‌ సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా సక్ర మంగానే జరుగుతున్నా, యుద్ధం మరింత కాలం కొనసాగితే ఇబ్బందులు ఏర్పడతాయేమోనని కొంతమంది వినియోగదారులు అవసరం లేకపోయినా, ఇంట్లో గ్యాస్‌ సిలిండర్లు ఉన్నా గ్యాస్‌ బుకింగ్‌ చేసుకోవడం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. గ్యాస్‌ అవసరం మేరకే బుక్‌ చేసుకోవాలని, గ్యాస్‌ సరఫరాలో ఏ ఇబ్బందులు లేవని జిల్లా యంత్రాంగం చెబుతోంది.

వాణిజ్య సిలిండర్‌కు ఇబ్బందులే..

వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ విషయంలో ఇబ్బందులు కొనసాగుతున్నాయి. వాణిజ్య సిలిండర్‌ సరఫరా నిలిచిపోవడంతో హోటళ్లు, ఇతర చిరు వ్యాపారులు, బజ్జీలు, పానీ పూరీలు అమ్మే వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సర్వీసులకు సంబంధించి వాణిజ్య గ్యాస్‌ సిలిండర్లను మాత్రం సరఫరా చేస్తున్నామని గ్యాస్‌ ఏజన్సీలు చెబుతున్నాయి.

సక్రమంగానే గ్యాస్‌ సరఫరా : డీఎస్‌వో

ప్రస్తుతం జిల్లాలో గ్యాస్‌ సరఫరా సక్రమంగానే సాగుతోందని, జిల్లాలోని 55 గ్యాస్‌ ఏజన్సీల ద్వారా గ్యాస్‌ బుక్‌ చేసుకున్న వినియోగదారులకు గ్యాస్‌ సరఫరా చేస్తున్నారని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి విలియమ్స్‌ వివరించారు. జిల్లాలో గ్యాస్‌ బుకింగ్‌లో ఎటువంటి ఇబ్బందులు లేవని నిర్ధేశించిన సమయాలకు అనుగుణగా బుకింగ్‌లు జరుగుతున్నాయని ఆయన వివరించారు.

శేషాచలంపై బ్లోయర్‌ పొయ్యిలు ప్రారంభం

ద్వారకాతిరుమల : చినవెంకన్న ఆలయంలో గ్యాస్‌ కొరత ఏర్పడడంతో ఆలయ అధికారులు కట్టెలతో వంటలు చేసే విధానంపై ఎక్కువ మగ్గు చూపుతున్నారు. ఈక్రమంలో ఇప్పటికే విజయవాడ నుంచి తీసుకొచ్చిన రెండు బ్లోయర్‌ పొయ్యిలను ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ శనివారం వెలిగించి ప్రారంభించారు. గ్యాస్‌ సిలిండర్లు అరకొరగా ఉన్నప్పటికీ రానున్న కాలంలో పరి స్థితిని అంచనా వేసి కట్టెల ద్వారా వంటను చేసేందుకు సమాయత్తమౌతున్నారు. నిత్యం ఆలయ అన్నదానంలో సగటున నాలుగు వేల మందికి పైబడి భక్తులు ఉదయం, రాత్రి భోజనాలు చేస్తారు. గ్యాస్‌ బండలు లోడు రాకపోవడంతో ప్రత్యమ్నాయాల్లో భాగంగా ఈ బ్లోయర్‌ పొయ్యిలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

జిల్లాలో విజిలెన్సు దాడులు

గ్యాస్‌ ఏజన్సీలు.. హోటళ్లలో తనిఖీలు

13 గృహావసరాల సిలిండర్ల సీజ్‌.. కేసులు నమోదు

ఏలూరు క్రైం : జిల్లాలో గ్యాస్‌ సిలిండర్ల నిల్వలు ఉన్నప్పటికీ కొంతమంది బ్లాక్‌ చేసి ప్రజలకు ఆందోళన కలిగించేలా చేస్తున్నారని సమాచారం జిల్లా విజిలెన్స్‌ ఎస్పీ కె.నాగేశ్వరరావుకు అందింది. ఆయన ఆదేశాల మేరకు ఏలూరు, భీమడోలులో విజిలెన్సు, పౌరసరఫరా శాఖ, రెవెన్యూ శాఖ సంయుక్తంగా ఏకకాలంలో నాలుగు బృందాలు దాడులు కొనసాగించారు. భీమడోలులోని గోపాల్‌ ఏజన్సీ, ఏలూరులోని ఎక్సెల్‌ ఏజన్సీ, విజయ ఏజన్సీ, శ్రీసాయిదుర్గా ఇండెన్‌ సర్వీస్‌లలో తనిఖీలు నిర్వహించారు. నిల్వల్లో వ్యత్యాసాలు లేనట్టు గుర్తించారు. గ్యాస్‌ వినియోగదారులకు ఇబ్బందులు కలుగకుండా సకాలంలో గ్యాస్‌ సరఫరా చేయాలని, రేట్లు పెంచడం, అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే ఏజన్సీ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్‌ ఎస్పీ కె.నాగేశ్వరరావు హెచ్చరించారు.

హోటళ్లపై దాడులు

ఏలూరు వసంతమహల్‌ సెంటర్‌ని శ్రీ వేంకటేశ్వర, మయూరి హోటల్‌, మెయిన్‌ బజార్‌లో ఉన్న సితార హోటల్‌, మౌలాలీ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను తనిఖీలు చేసి 13 గృహ అవసరాల గ్యాస్‌ సిలిండర్లను గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్‌ డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వరరావు, విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.ప్రసాదకుమార్‌, విజిలెన్స్‌ తహసీల్దార్‌ బి.కన్యాకుమారి, విజిలెన్స్‌ ఎస్‌ఐలు సీహెచ్‌ రంజిత్‌కుమార్‌, కె.నాగరాజు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 12:33 AM