Share News

గ్యాస్‌ సెగ

ABN , Publish Date - Mar 14 , 2026 | 12:33 AM

అమెరికా, ఇజ్రాయెల్‌ – ఇరాన్‌ యుద్ధం ప్రభావం ఏలూరు,పశ్చిమ గోదావరి జిల్లాలపై పడింది. రెస్టారెంట్లు, హోటళ్లు, తోపుడు బండ్లు, బజ్జీ షాపుల నిర్వాహకులకు గ్యాస్‌ సిలిండర్లు దొరకడం గగనంగా మారింది. కమర్షియల్‌ సిలిండర్ల కొరతతో కొందరు తమ వ్యాపారాలను మూసివేస్తున్నారు.

గ్యాస్‌ సెగ
శనివారపుపేట జడ్పీ స్కూల్‌లో కట్టెల పొయ్యిపై వంట

పశ్చిమ, ఏలూరు జిల్లాల్లో వెంటాడుతున్న కష్టాలు

తగ్గిన సిలిండర్ల సరఫరా

మూతపడుతున్న రెస్టారెంట్లు, హోటళ్లు

టీ స్టాల్స్‌, ఫాస్ట్‌ ఫుడ్‌, బజ్జీల బళ్లకు ఇబ్బందులు

కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్న నిర్వాహకులు

కలప టన్నుకు 200 పెంపు.. పని కోల్పోతున్న కార్మికులు..

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ఇక్కట్లు

( ఏలూరు సిటీ/నరసాపురం/ఆకివీడు/నూజివీడు టౌన్‌/ఏలూరు రూరల్‌/పాలకొల్లు టౌన్‌/దెందులూరు/ ముదినేపల్లి/ మండవల్లి/ఆగిరిపల్లి/ద్వారకాతిరుమల)

అమెరికా, ఇజ్రాయెల్‌ – ఇరాన్‌ యుద్ధం ప్రభావం ఏలూరు,పశ్చిమ గోదావరి జిల్లాలపై పడింది. రెస్టారెంట్లు, హోటళ్లు, తోపుడు బండ్లు, బజ్జీ షాపుల నిర్వాహకులకు గ్యాస్‌ సిలిండర్లు దొరకడం గగనంగా మారింది. కమర్షియల్‌ సిలిండర్ల కొరతతో కొందరు తమ వ్యాపారాలను మూసివేస్తున్నారు. మరికొందరు కట్టెలు, ఊక పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. హోట ళ్లలో మెనూ తగ్గించేయడంతో వ్యాపారం ముందుకు సాగడం లేదు. కుక్‌లు, సర్వర్లు, క్లీనింగ్‌ చేసే కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. చిరు వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. రెక్కడి తేగాని డొక్కాడని కుటుంబాలకు ఉపాధి కరువైంది.

హోటళ్ల మూసివేత

ఈ రెండు జిల్లాలు హోటళ్లు, ఆతిథ్య రంగానికి పెట్టింది పేరు. ఏలూరు, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లి గూడెం, తణుకు, ఆకివీడు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, చింతలపూడి వంటి పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లోనూ వందల సంఖ్యలో హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, కర్రీ పాయింట్లు, తోపుడు బండ్లపై సాగే వ్యాపారులు వున్నారు. వీరిలో అత్యధిక మంది కమర్షియల్‌ సిలిండర్లపై వంటకాలు చేస్తుంటారు. వ్యాపారాన్ని బట్టి రోజుకు మూడు, నాలుగు, టీ సెంటర్లు, సాయంత్రం పూట బండ్లపై అల్పాహారం అమ్మే వ్యాపారులకు రెండు రోజలకు ఒక సిలిండర్‌ అవసరం. అవసరానికి సరిపడి నన్ని సిలిండర్లు ఇవ్వకపోవడంతో చాలామంది హోటళ్లను మూసివేస్తున్నారు. వ్యాపారాలకు సెలవు ప్రకటిస్తున్నారు.

నరసాపురం–మొగల్తూరు రోడ్‌లో పేరుగాంచిన అన్న పూర్ణ హోటల్‌ను శుక్రవారం మూసివేశారు. నరసాపురం పాతబజార్‌ సెంటర్‌లో గ్యాస్‌ లేక టిఫిన్‌, టీ సెంటర్లు మూసి వేశారు. కొంతమంది బిర్యానీ, చికెన్‌, మటన్‌ వంటి వంటకా లను కట్టెల పొయ్యిలపై ముందుగానే వండి వాటిని కస్ట మర్లు వచ్చే సమయంలో సిలిండర్‌పై వేడి చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో రైస్‌ మిల్లులు ఎక్కువగా ఉండటం వల్ల ఊక పొయ్యిలతో వంటలు వండుతున్నట్లు హోటల్‌ యజమానులు చెబుతున్నారు. ఆకివీడు గణేశ్‌ క్యాం టీన్‌ను బంద్‌ చేశారు. గ్యాస్‌ కొరత మరికొన్ని రోజులు కొనసాగితే మరిన్ని హోటల్స్‌, రెస్టారెంట్లు మూసి వేయాల్సిం దే. సిబ్బందికి జీతాలు, కరెంటు బిల్లులు, షాపుల అద్దెలు చెల్లించేందుకు ఈ విధంగానైనా నడుపుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఏలూరులోని పలు హోటళ్ల మెనూలో మార్పు లు చేశారు. భోజన హోటళ్లకు గ్యాస్‌ సమస్య తప్పడం లేదు.

ఆచంట మండలంలో శుక్రవారం నుంచి హోటళ్లకు వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. కొందరు నిర్వాహకులు కట్టెల పొయ్యిపైనే వంటలు చేస్తున్నారు. మండలంలో గ్యాస్‌కు కొరత లేదని, ప్రజలు లేనిపోని ప్రచారాలు నమ్మవద్దని తహసీల్దార్‌ ఎం.సోమేశ్వరరావు కోరారు.

నూజివీడులోని పలు హోటళ్లు ఇతర తినుబండారాలు తయారీ సంస్థలు గ్యాస్‌ స్టవ్‌ల నుంచి కట్టెల పొయ్యి వైపు అడుగులు వేశాయి. పట్టణ పరిసర ప్రాంతాల్లో కోత మిషన్ల వద్ద, అడితిల వద్ద కట్టెలకు డిమాండ్‌ ఏర్పడింది. మూడు రోజులుగా టన్ను కర్ర ధర రూ.2,600 నుంచి రూ.2,800కు పెరిగింది. చిన్నా చితక రోడ్‌ సైడ్‌ వ్యాపారాలు నిర్వహించే వారు వ్యాపారాలకు తాత్కాలిక విరామం ప్రకటించారు.

సర్వర్‌ బిజీ

రెండు రోజులుగా ఆన్‌లైన్‌లో గ్యాస్‌ బుక్‌ అవక రెండు జిల్లాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు గ్యాస్‌ బుకింగ్‌ కోసం ఫోన్‌ చేసిన వెంటనే ఒక నిముషంలోపే బుక్‌ అయ్యేది. గ్యాస్‌ బుకింగ్‌కు గడువు పెంచడమే కారణమని చెబుతున్నారు. ఆగిరిపల్లి మండలంలో సిలిండర్లు బుక్‌ చేసుకున్న పది రోజుల్లో డెలివరీ చేస్తామంటున్నారు. ఇప్పుడు గ్యాస్‌ దొరకట్లేదన్న భయంతో ముందుగానే జనం ఏజెన్సీ ముందు బారులు తీరారు. ఫోన్ల ద్వారా బుక్‌ కాక మీ సేవ వద్దకు వెళ్లి వంద రూపాయలు చెల్లించి ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకొని ఏజెన్సీ నుంచే గ్యాస్‌ సిలెండర్‌ పట్టుకెళుతున్నారు.

ఫంక్షన్‌ నిర్వాహకులకు గ్యాస్‌ షాక్‌

పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు గ్యాస్‌ సిలిండర్ల సమస్య పెద్ద షాక్‌గా తగిలింది. గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిలపై వంట చేస్తున్నారు. పట్టణాల్లో కేటరింగ్‌ సంస్థలు ముందుగా బుక్‌ చేసిన ఫంక్షన్‌లకు మాత్రమే వంటలు చేసి పంపుతున్నా రు. కొత్త బుకింగ్‌లు తీసుకోవడం లేదు. ఏలూరులో విద్యా ర్థులు, ఉద్యోగుల ప్రైవేటు హాస్టల్స్‌లో మెనూను తగ్గించేశారు.

శ్రీవారి ఆలయాన్ని తాకిన గ్యాస్‌ కొరత..

ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంపై గ్యాస్‌ కొరత ప్రభావం పడింది. భక్తులకు ఉచిత అన్నప్రసాదం, లడ్డూ తదితర ప్రసాదాల తయారు చేసి అందించే దేవ స్థానం గ్యాస్‌కొరత కారణంగా ఇప్పటికే ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించింది. గ్యాస్‌ను కొరత లేకుండా అందిం చేందుకు కలెక్టర్‌ సహకారంతో గ్యాస్‌ ఏజన్సీలతో చర్చలు సాగిస్తోంది. మరోవైపు కట్టెల ద్వారా వండించే దిశగా కట్టెల ను సమకూర్చుకుంది. ట్రయల్‌రన్‌ కోసం శుక్రవారం రెండు బ్లోయర్‌ పొయ్యిలను తీసుకొచ్చారు. వాటి పనితీరును ఆలయ ఈవో యర్రశెట్టి భద్రాజీ, ఈఈ డీవీ భాస్కర్‌ ఇతర అధికారు లు పరిశీలించారు.విజయవాడ నుంచి కొన్ని ప్రత్యేకమైన పొయ్యిలను తీసుకొచ్చే పనిలో అధికారులున్నారు. ప్రస్తుతం ఆలయంలో గ్యాస్‌ను వినియోగించి స్టీమ్‌ ద్వారా వంటలు వండుతున్నారు. ఒకవేళ గ్యాస్‌ సరఫరా నిలిచిపోతే కట్టెల పొయ్యిల ద్వారా వచ్చే స్టీమ్‌తో వంటలు వండేందుకు రంగం సిద్ధ చేస్తున్నారు.

మధ్యాహ్న భోజనం ఎలా వండాలి ?

పాఠశాలలు, హాస్టళ్లపై గ్యాస్‌ ప్రభావం పడింది. మధ్యా హ్న భోజనం వంటకు అవసరమైన సిలిండర్లు సరఫరా కాక పోవడంతో శుక్రవారం పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో చాలా చోట్ల కట్టెల పొయ్యిలపైనే వండారు. సిలిండర్‌ బుక్‌ చేసుకోవడానికి 45 రోజులు సమయం కావడంతో విద్యా ర్థులకు ఏ విధంగా భోజనం అందించాలో తెలియక దెందు లూరు, మండవల్లి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల నిర్వా హకులు సతమతం అవుతున్నారు. ఏలూరు నగర, గ్రామీణ ప్రాంతాల్లో జడ్పీ ఉన్నత పాఠశాలల్లో కట్టెల పొయ్యిలపైనే మధ్యాహ్న భోజన పథకం వంటలు చేస్తున్నారు. సొంత డబ్బు చెల్లించి వివిధ రకాల కట్టెలను, కొబ్బరి మట్టలను సేకరించి వంట సిద్ధం చేస్తున్నారు. ముదినేపల్లి మండల జడ్పీ హైస్కూళ్లకు గ్యాస్‌ సిలిండర్ల సరఫరా ఆగిపోవడంతో కట్టెల పొయ్యిలపైనే వంటలు చేస్తున్నారు. ముదినేపల్లి హైస్కూలులో వంట చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. దెందులూరు మండలం కొవ్వలి జడ్పీ హైస్కూల్‌లో 585 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి మధ్యాహ్న భోజనం వండాలంటే రెండు రోజులకు ఒక సిలిండర్‌ అవుతుంది. గ్యాస్‌ సిలిండర్‌ మధ్యలో అయ్యిపోవడంతో శుక్రవారం ఇంట్లో సిలిండర్‌ తెచ్చి వంట చేశారు. సోమవారానికి నాలుగు సిలిండర్లు కావాలని పొన్నగంటి నిర్మలాదేవి హెచ్‌ఎం శర్మతోపాటు ఎంఈవో దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు.

ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు : జేసీ

జిల్లాలో గృహ వినియోగదారులకు వంటగ్యాస్‌కు కొరత లేదని ఏలూరు జేసీ అభిషేక గౌడ శుక్రవారం తెలిపారు. సోషల్‌ మీడియాలో గ్యాస్‌ సిలిండర్లకు కొరత ఏర్పడనుం దంటూ నిరాధారమైన వదంతులు వ్యాప్తి చెందుతున్నాయని ప్రజలు వాటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో గ్యాస్‌ గ్యాస్‌ సరఫరా సక్రమంగా జరిగేలా చూడడానికి కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఏలూరులోని జిల్లా పౌరసరఫరాల శాఖా ఽధికారి కార్యాలయంలో ప్రత్యేకంగా జిల్లాస్థాయి కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారన్నారు. గ్యాస్‌ సరఫరాలో సమస్యలు ఎదురైనా, కృత్రిమ కొరత సృష్టించినా వినియోగదారులు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి తెలప వచ్చన్నారు.

కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది వివరాలు.. ఫోన్‌ నెంబర్లు

అసిస్టెంట్‌ సప్లై అధికారి (ఏఎస్‌వో), ఏలూరు– 89198 87013

ఎం.సంధ్యాకుమారి (జూనియర్‌ అసిస్టెంట్‌, డీసీఎస్‌వో కార్యాలయం) – 96528 92425

పి.నాగదుర్గ (సీనియర్‌ అసిస్టెంట్‌, డీసీఎస్‌వో కార్యా లయం)– 79812 22542

ఇండెక్షన్‌ స్టవ్‌, ఎలక్ట్రిక్‌ కుక్కర్లకు డిమాండ్‌

గ్యాస్‌ కొరత కష్టాలను అధిగమించేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో తలమునకలవుతున్నారు. కరెంటు సాయంలో పనిచేసే ఇండెక్షన్‌ స్టవ్‌, ఎలక్ట్రిక్‌ కుక్కర్లకు డిమాండ్‌ పెరిగింది. గ్యాస్‌ అయిపోతే వంట కష్టమేనని భావించి ప్రజలు హోల్‌సెల్‌, రిటైల్‌ దుకాణాలకు క్యూ కడు తున్నారు. రూ.రెండు వేలు నుంచి రూ.రెండు వేలు మధ్యలో లభించే ఇండక్షన్‌ స్టవ్‌, ఎలక్ట్రికల్‌ రైస్‌, కుక్కర్‌లకు డిమాండ్‌ పెరిగిందని షాప్‌ నిర్వాహుకులు తెలిపారు.

రెస్టారెంట్‌ మూసేశాం

30 ఏళ్లుగా హోటల్‌ వ్యాపారంలో వున్నా. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. కరోనా లాక్‌డౌన్‌ సమ యంలోనే గ్యాస్‌ దొరికేది. మూడు రోజుల నుంచి కొరత కనిపిస్తోంది. స్టాక్‌ రెడీగా ఉండడం లేదు. మధ్యలో సిలిండర్లు నిండుకుంటే కస్టమర్ల ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో మూసివేశాం. మధ్యాహానికి సిలిండర్లు ఇచ్చారు. రేపు తెరుస్తాం.

– లక్కుకొండ, రెస్టారెంట్‌ వ్యాపారి, నరసాపురం

గ్యాస్‌ సమస్య పరిష్కరించాలి

ప్రభుత్వాలు గ్యాస్‌ సమస్యను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో క్యాంటీన్లు, హోటల్స్‌, రెస్టారెంట్లు అన్నీ మూసేయాల్సిందే. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఓ వైపు గ్యాస్‌, మరోపక్క ధరల మంటతో మండిపోతున్నాం. సామాన్యులపై భారం పడుతోంది.

– అయ్యర్‌ వాసు, జ్యోతి రెస్టారెంట్‌, ఆకివీడు

Updated Date - Mar 14 , 2026 | 12:33 AM