Share News

బుకింగ్‌..గడువు తగ్గింది!

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:35 AM

ఇరాన్‌తో ఇజ్రా యిల్‌, అమెరికా చేస్తున్న యుద్ధం నేపథ్యంలో వంటగ్యాస్‌కు కొరత రావడంతో గ్యాస్‌ కంపెనీలు నిబంధనలు కఠినతరం చేశాయి.

బుకింగ్‌..గడువు తగ్గింది!
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కూటమి నాయకులు

గ్రామీణం నుంచి పట్టణ ప్రాంతంగా మార్పు

గ్యాస్‌ బుకింగ్‌ సమయం 45 రోజుల నుంచి 25 రోజులకు కుదింపు

జంగారెడ్డిగూడెం పట్టణవాసుల హర్షం

ఎంపీ, ఎమ్మెల్యేల సహకారం.. కూటమి నాయకుల హర్షం

జంగారెడ్డిగూడెం, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి):ఇరాన్‌తో ఇజ్రా యిల్‌, అమెరికా చేస్తున్న యుద్ధం నేపథ్యంలో వంటగ్యాస్‌కు కొరత రావడంతో గ్యాస్‌ కంపెనీలు నిబంధనలు కఠినతరం చేశాయి. ఈ నేపఽథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణ పరిధిలో వినియోగదారులు వంటగ్యాస్‌ బుకింగ్‌ చేసే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రేడ్‌–1 మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పట్టణంలో సింగిల్‌ గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారుడికి ప్రతి 25 రోజులకు, డబుల్‌ సిలిండర్‌ ఉన్న వినియోదారుడికి ప్రతి 30 రోజులకు సిలిండర్‌ బుక్‌ చేసుకునే అవకాశం వుంది. కానీ పట్టణ గ్యాస్‌ కంపెనీల రికార్డులలో జంగారెడ్డిగూడెం పట్టణం గ్రామీణ ప్రాంతంగా నమోదై ఉండడం వల్ల ఒకసారి గ్యాస్‌ బుక్‌ చేసిన వినియోగదారుడికి మరలా 45 రోజుల తర్వాతే గ్యాస్‌ బుక్‌ చేసుకోవాల్సి వచ్చేది.ఈ నిబంధనతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానిక బీజేపీ నాయకుడు కొప్పాక శ్రీనివాసరావు ఈ సమస్యపై స్పందించి బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌, ఆర్డీవోతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు కేంద్ర పెట్రోలియం శాఖకు, ప్రధానమంత్రి గ్రీవెన్స్‌ పోర్టల్‌కు ఫిర్యాదు చేశారు.అలాగే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాజీ వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ షేక్‌ ముస్తఫా ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కు,పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిశోర్‌ చింతల పూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు వీరంతా గ్యాస్‌ కంపెనీల రికార్డుల్లో జంగారెడ్డిగూడెం పట్టణా న్ని అర్బన్‌ ప్రాంతంగా మార్చాలని విశేష కృషి చేశారు.

ఎంపీ మహేశ్‌, ఎమ్మెల్యే రోషన్‌కుమార్‌ కృషితో కేంద్ర పెట్రోలియం శాఖ, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు. గ్యాస్‌ బుకింగ్‌ సమయం 45 రోజుల నుంచి 25 రోజులకు అధికారులు మార్పు చేసినట్టు గురువారం జిల్లా అధికారులకు,గ్యాస్‌ కంపెనీలకు ఆదేశాలు అందాయి.హెచ్‌పీ గ్యాస్‌ కంపెనీకు చెందిన పట్టణ వినియోగదారులు గురువారం గ్యాస్‌ బుక్‌ చేయగా 25 రోజులకే సిలిండర్లు బుక్‌ అయ్యాయి. కాగా స్థానిక భారత్‌ గ్యాస్‌ వినియోగదారులకు రెండు రోజుల సమయం పడుతుందని నిర్వాహకులు తెలిపారు. కాగా ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌, ఎమ్మెల్యే రోషన్‌కుమార్‌ ఆదేశాలతో జంగారెడ్డిగూడెం గ్యాస్‌ ఏజెన్సీల పరిధిలో ఉన్న 45 రోజుల గ్యాస్‌ బుకింగ్‌ సమయాన్ని 25 రోజులకు తగ్గించడం పట్ల కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ గురువారం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిశోర్‌,బీజేపీ సీనియర్‌ నాయకుడు కొప్పాక శ్రీనివాసరావు,ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వక్ఫ్‌ బోర్డు మాజీ ఛైర్మెన్‌ షేక్‌ ముస్తఫా ఏలూరు ఎంపీ మహేశ్‌, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్‌కుమార్‌కు పట్టణ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి బొబ్బర రాజ్‌పాల్‌కుమార్‌, పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి,గుమ్మడి ప్రసాద్‌, పొదిలి ఫణిశర్మ,కంపా రాజేంద్ర,కోటగిరి ప్రమీళ,కంచర్ల గణేశ్‌, నాయుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2026 | 12:35 AM