ఇంటి గ్యాస్ పక్కదారి
ABN , Publish Date - Jul 11 , 2026 | 12:15 AM
గృహ వినియోగ గ్యాస్ పక్కదారి పడుతోంది. బ్లాక్‌లో జోరుగా విక్రయాలు జరుగుతున్నాయి. గృహ వినియోగదారులకు బుకింగ్ చేసుకున్న మరుసటిరోజే సరఫరా అవుతున్నాయి.
బ్లాక్‌లో రూ.1600
కంపెనీలకు టోపీ పెడుతున్న వ్యాపారులు
గృహ వినియోగ గ్యాస్ వాడకం
గ్యాస్ కొరత అంటూ ధరలు పెంచిన హోటల్స్
ప్రస్తుతం అందుబాటులో వాణిజ్య సిలిండర్లు
ధర ఎక్కువని కొనుగోలు చేయని వర్తకులు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
గృహ వినియోగ గ్యాస్ పక్కదారి పడుతోంది. బ్లాక్‌లో జోరుగా విక్రయాలు జరుగుతున్నాయి. గృహ వినియోగదారులకు బుకింగ్ చేసుకున్న మరుసటిరోజే సరఫరా అవుతున్నాయి. వంట గ్యాస్‌పై అమెరికా–ఇరాన్ యుద్ధప్రభావం పూర్తిగా తొలగిపోయింది. అవసరానికి తగ్గట్టుగా కంపెనీలు గ్యాస్ సరఫరా చేస్తున్నాయి. వాణిజ్య గ్యాస్ బండ ధరలు పెంచడంతో వ్యాపారులంతా గృహ వినియోగ సిలిండర్‌లపై పడుతున్నారు. బ్లాక్‌లో రూ.1600లకు కొనుగోలు చేస్తున్నారు. గృహ వినియోగ సిలిండర్‌లో 14 కిలోల గ్యాస్ ఉంటుంది. దీనిధర ప్రస్తుతం రూ. 940 వరకు ఉంది. అదే 19 కిలోల వాణిజ్య సిలెండర్ గ్యాస్ రూ. 3100. దాంతో హోటల్స్, కార్లు, ఆటోమొటైల్ రంగాల్లో గృహ వినియోగ గ్యాస్‌నే వినియోగిస్తున్నారు. గృహ వినియోగ గ్యాస్ రెండు సిలెండర్‌లు కొనుగోలు చేస్తే బ్లాక్ మార్కెట్‌లో రూ. 3200లకు లభ్యమవుతోంది. ఒక వాణిజ్య గ్యాస్ బండకు, రెండు గృహ వినియోగ గ్యాస్ సిలెండర్‌ల మధ్య 10 కిలోల గ్యాస్ తేడా ఉంటోంది. వాణిజ్య గ్యాస్ బండతో పోల్చుకుంటే దాదాపు రూ. 1500 మిగులుతోంది. దాంతో టీ దుకాణాలు, చిరు వ్యాపారులు, హోటల్స్ అంతా ఇప్పుడు చిన్న బండలపై పడ్డారు. యుద్ధ ప్రభావంతో కంపెనీలకు నష్టం వాటిల్లుతోందని వాణిజ్య గ్యాస్ ధరలను కేంద్రం పెంచింది. కానీ క్షేత్రస్థాయిలో బ్లాక్ మార్కెట్ ప్రభుత్వ ఆశయానికి గండి పెడుతోంది. కంపెనీలకు ఆశించిన స్థాయిలో వాణిజ్య సిలెండర్‌లు అమ్మకాలు సాగడం లేదు. పెద్ద హోటల్స్, ఇంజనీరింగ్ కళాశాలల్లో మాత్రమే వాణిజ్య సిలెండర్‌లు వినియోగిస్తున్నారు. మిగిలిన వాణిజ్య అవస రాలకు గృహ వినియోగ గ్యాస్‌ను వాడుతున్నారు. జిల్లాలో ఇప్పుడు ఇదో పెద్ద వ్యాపారంగా మారిపోయింది.
జిల్లాలో అమ్మకాలు ఇలా
జిల్లాలో 6.77 లక్షల గృహ వినియోగ కనెక్షన్‌లు న్నాయి. ప్రతిరోజు జిల్లాలో 15 వేల సిలిండర్‌లు వినియోగదారులకు పంపిణీ చేస్తున్నారు. అందులో దాదాపు 2,500 వరకు బయటకు వెళ్లిపోతున్నట్టు అంచనా. దీనిపై అధికారులు దృష్టి పెట్టాలి. గ్యాస్ కొరత, ధరలు అధికమవడంతో హోటల్స్, ఇతర వ్యాపారులు ధరలను పెంచేశారు. గతంలో అధికారులు తనిఖీలు నిర్వహించేవారు. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తగ్గడంతో వాణిజ్య సిలిండర్‌లపై దృష్టి పెట్టడం లేదు. అదే ఇప్పుడు వ్యాపారులకు కలసి వస్తోంది. తనిఖీలు చేయాలంటే సిబ్బంది కొరత వెంటాడుతోంది. మండలాల్లో పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్ల కొరత కూడా ఉంది.