గంజాయి కేసులో నలుగురికి పదేళ్ల జైలు శిక్ష
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:33 AM
గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులపై నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి పది సంవత్సరాల జైలు శిక్ష, లక్ష రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ ఏలూరు మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఇందిరా ప్రియ దర్శిని సోమవారం సాయంత్రం తీర్పు చెప్పారని జిల్లా ఎస్పీ కిషోర్ వెల్లడించారు.
ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా
ఏలూరు క్రైం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) :గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులపై నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి పది సంవత్సరాల జైలు శిక్ష, లక్ష రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ ఏలూరు మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఇందిరా ప్రియ దర్శిని సోమవారం సాయంత్రం తీర్పు చెప్పారని జిల్లా ఎస్పీ కిషోర్ వెల్లడించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో సోమవారం రాత్రి కేసు వివరాలను వెల్లడించారు. విశాఖపట్టణం జిల్లా కసింకోట మండలం సింగవరం గ్రామానికి చెందిన ఉసిరిక బసవరాజు (34), ఉసిరక అప్పారావు (35), చందనాడ సత్తిబాబు (40)లు కలిసి 2021 ఏప్రిల్ 23వ తేదీ సాయంత్రం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మీదుగా 1479 కేజీల గంజాయిని తీసుకువెళ్తున్నారు. ఈ సమాచారం అప్పటి సీఐ ఎస్.గౌరీశంకర్, ఎస్‌ఐ ఆనంద్‌రెడ్డిలకు అందడంతో వారు బుట్టాయిగూడెం రోడ్డు పెట్రోల్ బంకు వద్ద తనిఖీలు నిర్వహించారు. కొయ్యలగూడెం నుంచి అశ్వరావుపేట వస్తున్న లారీని తనిఖీలు చేయగా బసవరాజు, సత్తిబాబు, అప్పారావులు పట్టుబడ్డారు.వారినుంచి 1,479 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని కొనుగోలు చేసినట్లుగా గుర్తించిన వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన బోనగాని బిక్షపతి (54)ని కూడా అరెస్టు చేశారు. తరువాత అప్పటి సీఐ బాలసురేష్ దర్యాప్తు నిర్వహించారు. ఈ కేసు ఏలూరులోని మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ సాగింది. కోర్టు మానిటరింగ్‌సెల్ సిబ్బంది సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో నలుగురికి పది సంవత్సరాల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా చొప్పున విధిస్తూ ప్రియదర్శిని తీర్పు చెప్పారు.