ఎట్టకేలకు.. మోక్షం
ABN , Publish Date - Mar 20 , 2026 | 01:02 AM
ఉచిత విద్యాహక్కు చట్టం 12(1)సీ నిబంధన కింద బడుగు, బలహీనవర్గాల కుటుంబాల్లో నిర్ణీత అర్హతలు గల పిల్లలకు కార్పొరేట్/ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లకు ఉచిత అడ్మిషన్లనిచ్చే సంక్షేమ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం ఆర్థిక ఊతమిచ్చింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద.. రూ.44.90 లక్షలు మంజూరు
ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఫ్రీ సీట్ల నిధుల బకాయిలు చెల్లింపు
ఉచిత అడ్మిషన్లకు ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు
ఏలూరు అర్బన్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి):ఉచిత విద్యాహక్కు చట్టం 12(1)సీ నిబంధన కింద బడుగు, బలహీనవర్గాల కుటుంబాల్లో నిర్ణీత అర్హతలు గల పిల్లలకు కార్పొరేట్/ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లకు ఉచిత అడ్మిషన్లనిచ్చే సంక్షేమ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం ఆర్థిక ఊతమిచ్చింది. ఆరాటంగా ఈ పథకాన్ని ప్రారంభించిన గత వైసీపీ ప్రభుత్వం ఉచిత ప్రవేశాలు పొందిన సంబంధిత బాలబాలికలకు విద్యానేర్పినం దుకు ఆయా కార్పొరేట్/ప్రైవేటు పాఠశాలలకు ఫీజు రీయింబర్స్ మెంట్ కింద నిధులు చెల్లించకుండా పెద్దమొత్తంలో బకాయిలు పెట్టింది. ఈ నేపథ్యంలో ఉచిత అడ్మిషన్లను తాము స్వీకరించబో మంటూ ప్రెవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వానికి తేల్చిచెప్పాయి. ఆమేరకు స్పందించిన కూటమి ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరానికి (2025–26) సం బంధించి ఉచిత అడ్మిషన్లకు ఫీజు రీయిం బర్స్‌మెంట్ నిమిత్తం నిధులను రెండు రోజుల క్రితం విడుదల చేసింది. ఈ నిధులు జిల్లాలోని సంబంధిత కార్పొరేట్/ ప్రైవేటు పాఠశాలల బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయని సమగ్రశిక్ష జిల్లా ఏపీసీ పంకజ్‌కుమార్, సీఎంవో యోహోషువా తెలిపారు.
జిల్లాలో 143 ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత అడ్మిషన్ల కింద చేరిన బీసీ వర్గాలకు చెందిన 401 మంది బాలబాలికలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.44.90 లక్షలను బీసీ సంక్షేమ శాఖ నుంచి ఆయా పాఠశాలలకు రెండురోజుల్లోగా జమ అవుతాయని వెల్లడించారు. మౌలిక సదుపాయాలు, తదితర ప్రామాణికాల మేరకు కార్పొరేట్/ప్రైవేటు పాఠశాలలకు రేటింగ్ ఇచ్చి ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని నిర్ధారించారు. ఆ ప్రకారం వన్‌స్టార్ రేటింగ్ పాఠశాలకు ఒక్కో విద్యార్థికి రూ.8,500, టూస్టార్ రేటింగ్ రూ.10 వేలు, త్రీస్టార్ రేటింగ్ రూ.11,500, ఫోర్‌స్టార్ రేటింగ్ పాఠశాలకు రూ.13 వేలు చొప్పున ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా చెల్లించేందుకు ప్రభుత్వం వర్గీకరిం చింది. సంబంధిత విద్యార్థులకు తల్లికి వందనం ఆర్థికసాయం కింద అందజేసే రూ.13 వేల నుంచి మినహాయించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని పాఠశాల బ్యాంకు ఖాతాకు జమచేసి, మిగతా మొత్తాన్ని విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాకు జమ చేశారు. ఈ ఏడాది నుంచి ఉచిత అడ్మిషన్లకు ఆర్థిక నిధుల కొరతను తీర్చడంతో ప్రవేశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.
కొత్తగా అడ్మిషన్లకు దరఖాస్తుల వెల్లువ
2026–27 విద్యాసంవత్సరానికి జిల్లాలోని కార్పొరేట్/ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలోకి 25 శాతం సీట్లకు ఉచిత అడ్మిషన్లకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీకాగా జిల్లాలో 1105 మంది బాల బాలికలు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 788 మంది పాఠశాలలను ఎంచుకున్నారు. రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులందరికీ ఈ నెల 25న లాటరీ పద్ధతిన పాఠశాలల కేటాయింపు జరుగుతుంది. ఆపై ఏప్రిల్ 12న రెండోవిడత లాటరీ ద్వారా పాఠశాలల కేటాయిస్తారు. ఒకటో తరగతిలో సెక్షన్‌కు 30 మంది విద్యార్థుల వంతున విద్యాశాఖ అనుమతినిస్తుంది. జిల్లాలో ప్రైవేటు రంగంలో 464 పాఠశాలలున్నాయి. వీటిలో కొన్ని పాఠశాలలు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు బోధిస్తుం డగా, మరికొన్నింటిలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు బోధిస్తున్నాయి. ఆ ప్రకారం 25 శాతం సీట్లకు ఉచిత అడ్మిషన్ల కింద సుమారు 2,500 వరకు సీట్లు అందుబాటులో ఉంటాయని ఓ అంచనా. ఒకటో తరగతిలోకి ఉచిత అడ్మిషన్ పొందిన విద్యార్థి అదే పాఠశాలలో 8వ తరగతి వరకు ఫీజు చెల్లించనవసరం లేదు.