పక్షులకు నిధులొచ్చాయ్..!
ABN , Publish Date - Jul 29 , 2026 | 12:49 AM
కొల్లేరు పక్షుల కేంద్రం అభివృద్ధికి ఎట్టకేలకు నిధులు మంజూరయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వంలో పర్యావరణానికి, పక్షుల సంరక్షణకు ఒక్క రూపాయి మంజూరు చేయకపోవడంతో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు.
పక్షుల కేంద్రం అభివృద్ధికి రూ.20 లక్షలు నిధులు
ఎమ్మెల్యే కామినేని మరో రూ.7.66 లక్షలు అందజేత
కైకలూరు, జూలై 28(ఆంధ్రజ్యోతి): కొల్లేరు పక్షుల కేంద్రం అభివృద్ధికి ఎట్టకేలకు నిధులు మంజూరయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వంలో పర్యావరణానికి, పక్షుల సంరక్షణకు ఒక్క రూపాయి మంజూరు చేయకపోవడంతో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కొల్లేరు సరస్సులో పక్షులను తిలకించేందుకు అనువైన ప్రదేశంగా ఉన్న ఆటపాక పక్షుల కేంద్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు గత ప్రభుత్వ హయాంలో జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకవైపు కొల్లేరు ప్రజలకు జీవనోపాధి కల్పించడంతో పాటు పర్యావరణాన్ని, పక్షులను కాపాడుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీలకు కట్టుబడి పని చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షలు నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో వెలవెలబోయిన పక్షుల కేంద్రం చెరువు కొత్తకళను సంతరించుకోనుంది. ఈ మేరకు చెరువు గట్లను పటిష్ఠం చేసేందుకు, పక్షులకు అవసరమైన ఆవాస కేంద్రాలు, మట్టిదిబ్బలు ఏర్పాటు చేసేందుకు ఈ నిధులను కేటాయిస్తున్నారు. వీటికి తోడు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ మరో రూ.7.66 లక్షలు సొంతసొమ్మును అందజేశారు. ఇంత పెద్దమొత్తంలో ఒకేసారి పక్షుల కేంద్రం అభివృద్ధికి నిధులు కేటాయించడం ఇదే మొదటిసారి. పక్షుల కేంద్రంలో నీటి నిల్వలను ఉంచితే పర్యాటకులు నిత్యం పక్షులను తిలకించేందుకు అనువుగా ఉంటుంది. ప్రతి వేసవిలోనూ చెరువు అడుగంటిపోయి బోటు షికారు నిలిచిపోవడంతో పాటు పక్షులు వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిపోవడం పర్యాటకులకు నిరాశను కలిగిస్తోంది. ప్రభుత్వం మరింత పర్యాటకంగా అభివృద్ధి చేయాలని పర్యావరణ ప్రేమికులు కోరుకుంటున్నారు.