Share News

కోటిపల్లి కూతకు రూ.100 కోట్లు

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:41 AM

గత ప్రభుత్వ హయాంలో నత్తనడకన సాగిన కోటి పల్లి–నరసాపురం రైల్వే లైన్‌ ప్రాజెక్టుకు మోక్షం లభించింది.

కోటిపల్లి కూతకు రూ.100 కోట్లు

రైల్వే లైన్‌కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద విడుదల

అమలాపురం ఆర్డీవో ఖాతాలో నిధులు జమ..

కోనసీమలో వేగవంతం కానున్న భూసేకరణ

వచ్చే ఏడాది ఆఖరుకు పూర్తి చేసేలా కూటమి సర్కారు లక్ష్యం

నరసాపురం, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో నత్తనడకన సాగిన కోటి పల్లి–నరసాపురం రైల్వే లైన్‌ ప్రాజెక్టుకు మోక్షం లభించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభు త్వ వాటా కింద రూ.100 కోట్లను విడుదల చేస్తూ గురువారం రోడ్లు, భవనాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిధులను అమలా పురం ఆర్డీవో ఖాతాలో జమ చేయనున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో భూసేకరణకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులు సైతం క్లియర్‌ కావడంతో.. రైతులకు పరిహారం చెల్లించి త్వరి తగతిన పనులు చేపట్టనున్నారు.

బ్రిటిష్‌ కాలం నాటి ప్రతిపాదన..

నరసాపురం నుంచి కోనసీమ మీదుగా కోటి పల్లి వరకు రైల్వే లైన్‌ నిర్మాణం అనేది బ్రిటిష్‌ కాలం నాటి ప్రతిపాదన. రాష్ట్ర విభజన తరువాత కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టుల్లో ఇదీ ఒకటి. 2015లో ఈ పను లకు శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.2,300 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో 25 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో అధికారం లో ఉన్న కూటమి ప్రభుత్వం తొలి విడతగా రూ.50 కోట్లు విడుదల చేసింది. కానీ, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క రూపా యి కూడా విడుదల చేయకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. కేవలం కేంద్రం ఇచ్చిన నిధులతోనే ప్రాజెక్టును నెట్టుకొచ్చారు.

80 శాతం పనులు పూర్తి..

ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఇప్పటి వరకు రూ.1,550 కోట్లు కేటాయించింది. 51 కిలో మీటర్ల మేర నిర్మిస్తున్న ఈ కొత్త రైల్వే లైన్‌లో.. గోదావరి నదిపై మూడు భారీ వం తెనలు నిర్మించారు. ఇందు కోసం రూ.1,200 కోట్లకు పైగా ఖర్చు చేశారు. పశ్చిమ గోదా వరి వైపు నరసాపురం నుంచి చించినాడ వరకు సుమారు పది కిలో మీటర్ల మేర కొత్త లైన్‌కు భూసేకరణ పూర్తై, రైతులకు పరిహారం చెల్లించారు. అయితే, కోన సీమ జిల్లాలో భూసేకరణ సమస్యలు, రాష్ట్ర ప్రభు త్వ వాటా నిధులు పెండింగ్‌లో ఉండటంతో పనులు మందగించాయి. ఇప్పటివరకు ప్రాజెక్టులో 80 శాతం పనులు పూర్తవ్వగా.. మరో 20 శాతం మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. చివరి దశలో ఉన్న ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Updated Date - Oct 02 , 2026 | 12:41 AM