Share News

ప్రభుత్వ స్కూళ్లకు మహర్దశ

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:12 AM

ప్రభుత్వ విద్యా విధానంలో మార్పులు తీసుకువస్తే మంచి ఫలితాలు సాధించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు పాఠశాల భవనాలకు మహర్దశ తీసుకురానుంది.

ప్రభుత్వ స్కూళ్లకు మహర్దశ
కొమరవరంలో స్లాబ్‌ లేకుండా మొండి గోడలతో వున్న మండల పరిషత్‌ భవనం

నాడు–నేడు సెకండ్‌ ఫేజ్‌లో నిలిచిన పనులకు నిధులు మంజూరు

మన బడి – మన భవిష్యత్‌ పేరిట అభివృద్ధి

జిల్లాలో 750 స్కూల్‌ భవనాలు

అదనపు తరగతి పనులు, ఇతర వాటిని అక్టోబర్‌ నెలాఖరుకల్లా పూర్తి చేయాలి

భీమవరం రూరల్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విద్యా విధానంలో మార్పులు తీసుకువస్తే మంచి ఫలితాలు సాధించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు పాఠశాల భవనాలకు మహర్దశ తీసుకురానుంది. గత ప్రభుత్వం నాడు– నేడు సెకండ్‌ ఫేజ్‌లో నిలిపివేసిన పనులను పూర్తి చేసేందుకు మన బడి– మన భవిష్యత్‌ కింద ప్రణాళిక సిద్ధం చేసింది. దానికి సంబంధించిన నిధులను రాష్ట్రానికి రూ. 929 కోట్లు కేటాయించారు. జిల్లాలో చేయవలసిన పనులు బట్టి ఎంతమేర నిధులు అవసరమవుతాయో నిర్ణయించాల్సి ఉంది. వారం రోజుల్లో జిల్లాలో సెకండ్‌ ఫేజ్‌లో పెండింగ్‌లో అభివృద్ధి పనులు జరిగిన 750 పాఠశాల భవనాల్లో పెండింగ్‌ ఉన్న వివరాలు సేకరించి పాఠశాలకు ఎంత నిధులు కావలసి ఉందన్నది అధికారులు నిర్ణయించనున్నారు. దానిని బట్టి జిల్లాకు ఎన్ని నిధులు అవసరమన్నది తేల్చనున్నారు.

అర్థాంతరంగా ఆపేశారు..

గత ప్రభుత్వం పాఠశాల భవనాల అభివృద్ధి పనులు అదనపు గదుల నిర్మాణం అర్థాంతరంగా నిలిపివేసింది. 2023లో నాడు–నేడు సెకండ్‌ ఫేజ్‌ కింద రూ. 56.17 కోట్లు ప్రతిపాదించింది. వాటిలో అదనపు తరగతి గదుల నిర్మాణం ప్రధానంగా తీసుకుంది. నిధులు మంజూరు చేయలేక వాటి నిర్మాణం నిలిపివేయాలని సూచించింది. చిన్న బడ్జెట్‌ ఉన్న పనులైన టాయిలెట్స్‌, విద్యుత్‌, వాటర్‌, ప్రహరీ గోడలు వంటివి పూర్తి చేయాలని సూచించారు. చివరికి రూ.16.81 కోట్లు మాత్రమే నిధులు మంజూరు చేశారు. పెండింగ్‌ పనులు మూడేళ్లుగా అలానే ఉండిపోయాయి. అదనపు గదుల కోసం వేసిన పిల్లర్స్‌ రూపంలో చాలాచోట్ల ఫౌండేషన్‌ దశలో ఉండిపోయాయి. ఇప్పుడు వాటికి మోక్షం లభించనుంది.

అక్టోబర్‌ కల్లా పనులు పూర్తిచేయాలి

నాడు– నేడు సెకండ్‌ ఫేజ్‌లో పెండింగ్‌లో ఉన్న పనుల అభివృద్ధిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం వాటిని త్వరితగతిన పూర్తిచేయించేలా సూచనలు ఇచ్చింది. నాలుగు రోజుల క్రితమే నిధులు మంజూరుపై నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల్లో పనుల లిస్ట్‌ను తయారు చేయడంతో పాటు నాలుగు నెలల్లో అంటే అక్టోబర్‌ నెలాఖరుకల్లా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో మన బడి – మన భవిష్యత్‌గా సాగే పాఠశాల భవనాల అభివృద్ధి పనులు అత్యంత వేగవంతంగా జరగనున్నాయి. అవి పూర్తయిన తర్వాత అవసరమైన పాఠశాల భవనాలకు జిల్లాకు కొన్ని కోట్లు నిధులు మంజూరు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ విద్యా సంవత్సరంలోనే ప్రభుత్వం పాఠశాల భవనాల లోటుపాట్లు తీరిపోవడంతో పాటు అవసరమైన భవనాలు అందుబాటులోకి రానున్నాయి.

Updated Date - Jun 17 , 2026 | 12:12 AM