నేటి నుంచి నేతన్నకు ఉచిత విద్యుత్ పథకం అమలు
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:41 AM
రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకు ఆర్థిక భరోసా కార్యక్రమం కింద చేనేత, పవర్ లూమ్ రంగాలకు చేయూత నిచ్చేందుకు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానుంది.
కూటమి ప్రభుత్వ నిర్ణయంపై హర్షం
ముదినేపల్లి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకు ఆర్థిక భరోసా కార్యక్రమం కింద చేనేత, పవర్ లూమ్ రంగాలకు చేయూత నిచ్చేందుకు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానుంది. ఈ పథకం అమ లుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలను ప్రభు త్వం జిల్లా చేనేత, జౌళిశాఖ అధికార్లకు మంగళవారం జారీ చేసింది. కూటమి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ పథకం కింద పవర్‌లూమ్‌కు చెందిన శ్రామికులకు 500 యూనిట్లు, చేనేత శ్రామికులకు 200 యూనిట్ల విద్యుత్ వినియోగం వరకు ఉచితమే. ఈ పవర్‌లూమ్ కలిగిన ఒక్కో కుటుంబానికి నెలకు ప్రభుత్వ అంచనా ప్రకారం రూ. రెండు వేల నుంచి రూ. 2200 వరకు, హ్యాండ్‌లూమ్ కుటుంబానికి నెలకు రూ. 700 నుంచి రూ.800 వరకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది. చిన్న స్ధాయి నేతన్నల కుటుంబాలకు, గృహ ఆధారిత చేనేత వృత్తిదార్లకు, పరిమిత వనరులతో పనిచేస్తున్న పవర్ లూమ్ యూనిట్ల నిర్వాహకులకు ఈ పథకం ఎంతో ఉపయోగంగా నిలుస్తుంది. విద్యుత్ వ్యయం తగ్గడంతో చేనేత ఉత్పత్తుల వ్యయం కూడా తగ్గి నేత పారిశ్రామికులకు ఊరటనిస్తుంది. ఉమ్మడి జిల్లాలో 910 చేనేత పవర్‌లూమ్స్ కుటుంబాలకు లబ్ధి కలుగ నుంది. కైకలూరు నియోజకవర్గంలో 139, పాలకొల్లు నియోజకవర్గంలో 366 చేనేత కుటుంబాలకు అధిక సంఖ్యలో ప్రయోజనం కలుగుతుండగా, ఆచంట, భీమవరం, తణుకు, నర్సాపురం, ఉండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో 405 చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం ప్రయోజనం కలుగుతుంది. ఈ పథకం వల్ల రెండు జిల్లాల్లోని చేనేత కుటుంబాలకు నెలకు సుమారు రూ. 10 లక్షలు ఆదా అవుతుంది.
పూర్తి వివరాలు సేకరిస్తున్నాం
నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శక సూత్రాల ప్రకారం పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. చేనేత వృత్తిదార్లు ఎక్కువ మంది ఉన్నారు. కొత్తగా మగ్గాలు ఏర్పాటు చేసుకునేవారు దరఖాస్తు చేసుకోవచ్చు. చేనేత. జౌళిశాఖ అధికార్లు, విద్యుత్ శాఖ అధికార్లు, జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించి నివేదిక రూపొందిస్తాం.
–హనుమంతరావు,
చేనేత శాఖ అభివృద్ధి అధికారి, ఏలూరు