Share News

ఇక నో పేపలర్‌ వర్క్‌

ABN , Publish Date - Jan 12 , 2026 | 12:31 AM

ఇక నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కాగిత రహిత పాలన (ఈ– ఆఫీస్‌) కొనసాగనుంది. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.

ఇక నో పేపలర్‌ వర్క్‌

ఈ నెల 15 తరువాత పూర్తిస్థాయిలో అమలు

ఈ–ఆఫీస్‌పై జిల్లా

అధికారులకు ఆదేశాలు

భీమవరం టౌన్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : ఇక నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కాగిత రహిత పాలన (ఈ– ఆఫీస్‌) కొనసాగనుంది. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ప్రస్తుతం అన్ని కార్యాలయాల్లో ఈ–ఆఫీస్‌ విధానం కొనసాగతున్నా ఎక్కువగా మాన్యువల్‌గానే జరుగుతోంది. ఈ–ఆఫీస్‌ను పూర్తిస్థాయిలో అమలు కాక పోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన సమావేశంలో పూర్తిస్ధాయి అమలుకు ఆదేశాలు ఇచ్చారు. వాస్తవంగా ఈ–ఆఫీస్‌ విధానం 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమల్లోకి తీసుకువచ్చారు. 2019 వరకు ఈ విధానంలో ఫైల్స్‌ నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విధానాన్ని పక్కన పెట్టింది. చాలా వరకు మ్యాన్‌వల్‌గానే కొనసాగించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడచినా మాన్యువల్‌గా కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో ఈఫైల్స్‌ విధానాన్ని అమలు చెయ్యాలని ఆదేశాలు రావడంతో అధికారులు అప్రమత్త మయ్యారు. మండల, గ్రామీణ స్థ్ధాయి అధికారులకు దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

15 నుంచి మునిసిపాల్టీల్లో ..

మునిసిపాల్టీల్లో వచ్చేనెల 15 నుంచి ఈ ఆఫీస్‌ ద్వారానే ఫైౖల్స్‌ను పంపాలని ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రిన్సిపల్‌ సెక్రటరీ, డీఎంఏ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కమిషనర్ల ఛాంబర్ల నుంచి అన్ని శాఖలకు ఆదేశాలు వెళ్లాయి. నేరుగా వచ్చే ఫైల్స్‌ను చూడమని, ఈ–ఆఫీస్‌ ద్వారా మాత్రమే పంపాలని ఆదేశాలు అందాయి. కలెక్టర్‌ కార్యాలయంలోని అన్ని విభాగాలకు ఇదే తరహా ఆదేశాలు జారీ చేస్తున్నారు. రానున్న రోజుల్లో పేపర్‌ లెస్‌ పాలన తీసుకురావాలనే నిర్ణయంతో ఆదేశాలు వెలువడుతున్నాయి.

ఇవీ ప్రయోజనాలు

ఈ–ఆఫీస్‌ వల్ల పనుల్లో వేగం పెరుగు తుంది. పురోగతిని తెలుసుకునే అవకాశం ఉంది. పారదర్శకతతో పాటు జవాబుదారీ తనం పెరుగుతుంది. సమచారం అంతా ఒకే చోట ఉండటం వల్ల ఉన్నతాధికారులు తర్వగా వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఖర్చులు తగ్గుతాయి. ఫైల్స్‌ కనిపించకపోవడం అనే మాటే ఉండదు. అన్ని ఫైల్స్‌ సురక్షితంగా డేటా సెంటర్‌లో శాశ్వతంగా నిక్షిప్తం అవుతాయి.

అందుబాటులోకి ఈ–ఆఫీస్‌ యాప్‌

ఈ–ఆఫీస్‌ విధానం ఇకనుంచి సెల్‌ఫోన్‌లో చూసుకునేవిధంగా యాప్‌ అందుబాటులోకి వచ్చింది. సంబంధిత ఫైల్స్‌ను సెల్‌ఫోన్‌లో స్కాన్‌ చేసి యాప్‌ ద్వారా అధికారులకు పంపే వెసులుబాటు వచ్చింది. ఈ యాప్‌ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది.

Updated Date - Jan 12 , 2026 | 12:31 AM