నిబంధనాల నుంచి విముక్తి!
ABN , Publish Date - May 02 , 2026 | 01:06 AM
జిల్లాలో ఫ్రీహోల్డ్ చేసిన భూములకు త్వరలో మోక్షం కలుగనుంది. జిల్లాలో 2703.53 ఎకరాలు ఈ విధంగా ఉన్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
ఫ్రీహోల్డ్ నుంచి షరతు గల పట్టాలకు మోక్షం
జిల్లాలో 2700.53 ఎకరాల గుర్తింపు
రెండు, మూడు రోజుల్లో డిజిటల్ సంతకాలు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఫ్రీహోల్డ్ చేసిన భూములకు త్వరలో మోక్షం కలుగనుంది. జిల్లాలో 2703.53 ఎకరాలు ఈ విధంగా ఉన్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ భూము లకు సంబంధించి నిషేధం ఎత్తివేస్తూ కలెక్టర్ ఉత్తర్వులను జారీ చేయగా రికార్డులను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు.
పేదలు, అణగారిన వర్గాలకు సంబంధించి నిబంధ నల పేరుతో ఫ్రీహోల్డ్ చేసిన భూములకు బంధ విముక్తి కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవంగా 1932–34ల్లో తయారు చేసిన ఆర్‌ఎస్‌ఆర్‌నే ప్రామాణికంగా తీసుకుని వీటిని ప్రభుత్వ భూములుగా చెబుతున్నారు. వీటికే షరతు గల పట్టాలనే పేరు ఉంది. దీనికి సంబంధించిన భూముల లావాదేవీలపై పరిమితు లు ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని ఫ్రీహోల్డ్ చేసింది. ఈ పట్టాలున్నా భూ యజ మానులు తమ భూములను ఇకపై తనఖా పెట్టు కోవ చ్చు లేదా విక్రయించుకోవచ్చు. భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ స్టాంపులు, రిజిస్ర్టేషన్లశాఖ ఐజీ, అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు అవసరమైన చర్యలు తీసు కోవాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.
వెబ్‌ల్యాండ్‌లో నమోదు లేక..
జిల్లాలో 2021లో ఈ విధమైన భూములకు మోక్షం కల్పించేందుకు చర్యలకు ఉపక్రమించారు. అప్పట్లో వెబ్ ల్యాండ్‌లోకి నమోదు కాకపోవడం వల్ల భూముల వ్యవ హారం కొలిక్కి రాలేదు. అప్పటి కలెక్టర్ ప్రసన్న వెంక టేశ్ హయాంలోనే కొంత కసరత్తు జరిగినట్టు కలెక్టరేట్ వర్గాలు చెబుతు న్నాయి. దాదాపుగా 1920 కాలంలోనే అణగారిన, వెనుకబడిన వర్గాలకు షరతు గల పట్టాలను అన్ని జిల్లాల్లో ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫ్రీహోల్డ్ పేరుతో అనర్హులకు ప్రభుత్వ భూముల్ని కట్టబెట్టారనే ఆరోపణలపై కూటమి ప్రభుత్వం వాటి రిజిస్ర్టేషన్లపై తాత్కాలిక నిషేధం విధించింది. అందులో షరతులు గల పట్టా భూములు ఉన్నాయి. జిల్లాలో 2703.53 ఎకరాలు ఈ విధంగా ఉన్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
చురుగ్గా పరిశీలన
జిల్లాలో 2703.53 ఎకరాల భూముల రికార్డులను జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ లాగిన్ ద్వారా పరిశీలన కార్యక్రమం మూడు రోజులుగా చురుగ్గా సాగు తోంది. ఈ భూములకు సంబంధించి నిషేధం ఎత్తివేస్తూ కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నేప థ్యంలో రికార్డులను వీఆర్వో, తహసీల్దార్లు పరిశీలిస్తు న్నారు. ఆపై తహసీల్దార్లు డిజిటల్ సంతకం చేసిన వెంటనే ఆన్‌లైన్ ఆయా భూములకు సంబంధించిన పేర్లు, విస్తీర్ణం వెబ్‌ల్యాండ్ కనిపించనున్నాయి. జిల్లాలో షరతు గల పట్టా భూముల విముక్తి కల్పించేందుకు ఈనెల 4వ తేదీ నాటికి డిజిటల్ సంతకాలను పూర్తి చేయనున్నారు. అనంతరం ఈ రికార్డులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. రెవెన్యూ అధికారులు రికార్డుల నవీకరణ చేయగానే.. ఈ భూముల విక్రయా లకు రిజిస్ర్టేషన్లు చేసుకునే వెసులుబాటు కలుగనుంది.