Share News

పేదల ఇళ్లపై సౌర వెలుగులు

ABN , Publish Date - Apr 17 , 2026 | 11:24 PM

ఎస్సీ, ఎస్టీ సోలరైజేషన్‌ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్‌ ప్యానళ్లను ప్రభుత్వం అందించనున్నది. జిల్లాలో ప్రతీ ఒక్క ఇంటికి సోలార్‌ వెలుగులు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వం ఆదేశాల మేర అధికారులు చర్యలు చేపట్టారు.

పేదల ఇళ్లపై సౌర వెలుగులు

ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్‌ విద్యుత్‌

జిల్లాలో 22,855 మంది అర్హులు గుర్తింపు

304 ఇళ్లపై సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటు

ఆకివీడు, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి):విద్యుత్‌ వినియోగం పెరుగుతోంది. అంతకంతకు బిల్లులు భారమవుతున్నాయి. అందుకే సోలార్‌ విద్యుత్‌కు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోంది. పీఎం సూర్య ఘర్‌ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ సోలరైజేషన్‌ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్‌ ప్యానళ్లను ప్రభుత్వం అందించనున్నది. జిల్లాలో ప్రతీ ఒక్క ఇంటికి సోలార్‌ వెలుగులు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వం ఆదేశాల మేర అధికారులు చర్యలు చేపట్టారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం అందుతున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకం యఽథావిధిగా కొనసాగుతోంది. ఉత్పత్తి అయిన విద్యుత్‌ గ్రాస్‌ మీటరింగ్‌ ద్వారా గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. ఈ సోలార్‌ కాల పరిమితి 25 ఏళ్లు. దీనివల్ల విద్యుత్‌ బిల్లుల భారం తగ్గడమే కాకుండా పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. జిల్లావ్యాప్తంగా 55,733 మంది ఎస్సీ,ఎస్టీ లబ్ధిదారులుండగా 22,855 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతానికి 304 మందికి సోలార్‌ ప్యానళ్లు ఏర్పాటు చేశారు. మరో 2100 మందికి ప్రోసెస్‌లో ఉన్నాయి. జూన్‌ నెలాఖరు పూర్తి కావాల్సి ఉంది. బీసీల కోసం కేంద్రం ఇచ్చే రాయితీకి అదనంగా రూ.20 వేల రాయితీని రాష్ర్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండు కిలోవాట్ల సోలార్‌ రూఫ్‌ టాప్‌ ఏర్పాటు చేసుకుంటే బీసీలకు మొత్తంగా రూ.80 వేల వరకు రాయితీ వస్తుంది.

సద్వినియోగం చేసుకోవాలి

– జాన్‌ వెస్లీ, నగర పంచాయతీ కౌన్సిలర్‌, ఆకివీడు

ఎస్సీ, ఎస్టీలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సోలార్‌ వినియోగంతో విద్యుత్‌ బిల్లులు చెల్లింపు ఉండదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఈ పథకం వల్ల అందరికీ లాభమే. బిల్లులఖర్చు తగ్గుతుంది. మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలుగుతుంది.

అపోహలు నమ్మకండి

– రత్నాకర్‌, విద్యుత్‌ ఏఈ, ఆకివీడు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఈ పథకం షెడ్యూల్‌ కులాలు, తెగలకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. మేడపైన వేసుకుంటే సమస్యలు తలెత్తుతాయనే వస్తున్న మాటలు నమ్మకండి. ప్రస్తుతానికి ఆకివీడు మండలంలో 650 మందిని గుర్తించగా 170 మంది లబ్ధిదారులు సోలార్‌ ప్యానల్స్‌ వేయించుకున్నారు. రాయితీ లేకపోయినా ప్రజలందరూ సోలార్‌ వినియోగించుకుంటే విద్యుత్‌ ఆదా చేసుకోవచ్చు. బిల్లుల ఖర్చు తగ్గుతుంది

Updated Date - Apr 17 , 2026 | 11:24 PM