Share News

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:57 AM

ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పించింది. జిల్లాలో ఉగాది కానుకగా దివ్యాంగ శక్తి పథకం వర్తింపజేయడానికి ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం

జిల్లాలో 1390 మందికి వర్తింపు

భీమడోలులో ప్రారంభించనున్న కలెక్టర్‌

నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో ప్రారంభం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పించింది. జిల్లాలో ఉగాది కానుకగా దివ్యాంగ శక్తి పథకం వర్తింపజేయడానికి ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. భీమడోలు మండలం సత్యనారాయణపురంలో బుధవారం ఉదయం 11.30 గంటలకు కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి దివ్యాంగుల ఉచిత ప్రయాణం ప్రారంభిస్తారు. అనంతరం వారితో కలిసి బస్సులో ఏలూరు వరకు ప్రయాణిస్తారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు దివ్యాంగశక్తి పథకం ప్రారంభించి బస్సులలో ఎమ్మెల్యేలు దివ్యాంగులతో కలిసి ప్రయాణిస్తారు. పథకం అమలుకు ఆర్టీసీ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

జిల్లాలో ఇప్పటికే 50 శాతం రాయితీపై పాస్‌లు పొందిన 1,390 మంది దివ్యాంగులకు ఉచిత ప్రయా ణం వర్తిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ దిశగా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. స్త్రీశక్తి పథకం మాదిరి దివ్యాంగులకు కూడా పల్లె వెలుగు, ఆల్ర్టా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల్లో ఉచిత ప్రయాణాలను అనుమతిస్తారు. 50 శాతం రాయితీ పాస్‌ ఉన్నవారు ఉచిత బస్‌ పాస్‌ కూడా తీసుకోవాల్సి ఉంది. ప్రయాణంలో వీరికి జీరో ఫేర్‌ టిక్కెట్‌ ఇవ్వనున్నారు.

40 శాతం వైకల్యం ఉన్నవారికి..

దివ్యాంగులకు 40 శాతం వైకల్యం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్‌ కొలమానంగా ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. సదరం, ఆధార్‌ ఒరిజనల్స్‌, జిరాక్సులను తీసుకువచ్చి ఆర్టీసీ డిపోల్లో సూపర్‌వైజర్లతో సంతకం చేయిస్తే బస్‌ పాస్‌లను ఇస్తారు. 2029 వరకు ఈ పథకం అందుబాటులోకి ఉంటుందని డీపీటీవో షేక్‌ షబ్నం తెలిపారు.

Updated Date - Mar 18 , 2026 | 12:57 AM