Share News

4815.53 ఎకరాలకు మోక్షం

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:34 AM

నిషేధిత జాబితాలో ఉన్న భూములకు ప్రభుత్వం విముక్తినిచ్చింది. రెవెన్యూ డివిజన్‌ల వారీగా 22ఎ నుంచి మినహాయించిన భూములు, షరతులతో కూడిన పట్టాలున్న భూములు, అసైన్డ్‌, ఎస్సీ కార్పొరేషన్‌, ఈనామ్‌ భూములను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 4815.53 ఎకరాలను ఫ్రీహోల్డ్‌ నుంచి విముక్తి చేసేందుకు అవకాశం ఉంది. అర్హతను బట్టి వాటికి రెవెన్యూ అధికారులు మినహాయింపు ఇస్తారు.

4815.53 ఎకరాలకు మోక్షం

ఫ్రీహోల్డ్‌ భూములకు విముక్తి

రైతుల పేరుతో రిజిస్ర్టేషన్‌కు అవకాశం

జేసీ స్థాయిలో నిర్ణయాధికారం

కొన్ని ప్రాంతాల్లో అన్యాక్రాంతం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

నిషేధిత జాబితాలో ఉన్న భూములకు ప్రభుత్వం విముక్తినిచ్చింది. రెవెన్యూ డివిజన్‌ల వారీగా 22ఎ నుంచి మినహాయించిన భూములు, షరతులతో కూడిన పట్టాలున్న భూములు, అసైన్డ్‌, ఎస్సీ కార్పొరేషన్‌, ఈనామ్‌ భూములను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 4815.53 ఎకరాలను ఫ్రీహోల్డ్‌ నుంచి విముక్తి చేసేందుకు అవకాశం ఉంది. అర్హతను బట్టి వాటికి రెవెన్యూ అధికారులు మినహాయింపు ఇస్తారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీహోల్డ్‌లో ఉన్న భూములపై రైతులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంది. అసైన్డ్‌భూములు, ఈనామ్‌ భూములు, డి–పట్టా భూములు తదితర కేటగిరీల్లో వెసులుబాటు కల్పించింది. గతంలో 2002కు ముందు ఉన్న భూములకు సంబంధింఛి ఫ్రీహోల్డ్‌ నుంచి ఉపశమనం కల్పించాలని నిర్ణయించారు. తాజాగా 2006 వరకు దానిని పొడిగించారు. అసైన్డ్‌భూములు పొందిన రైతులు ఇతరులకు విక్రయించుకోవాలంటే 20 ఏళ్లు వ్యవధి దాటాలి. డి–పట్టా భూములైనా సరే అదే వర్తిస్తుంది. దాంతో ప్రభుత్వం 2006 వరకు మినహాయింపును పొడిగించింది. ఫలితంగా జిల్లాలో మరింత మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. వాస్తవానికి జిల్లాలో అత్యధికంగా కాళ్ల మండలంలోనే అసైన్డ్‌ భూములున్నాయి. షరతులతో కూడిన పట్టాలు ఇచ్చారు. అవన్నీ కొన్నేళ్ల క్రితమే అన్యాక్రాంతమైపోయాయి. చేతులు మారిపోయాయి. పెద్దల ఆథీనంలోకి వెళ్లిపోయాయి. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం సదరు భూముల వివరాలు లేవు. రికార్డులు కూడా గల్లంతయ్యాయంటూ ఇప్పటికీ అంతా చెప్పు కుంటుంటారు. అయినా సరే అందుబాటులో ఉన్న అసైన్డ్‌, ఇతర భూములకు సంబంధించి ఇప్పుడు ఫ్రీహోల్డ్‌లో పెట్టారు. వాటి అర్హతన బట్టి రిజిస్ర్టేషన్‌కు అవకాశం కల్పిస్తారు. జాయింట్‌ కలెక్టర్‌ స్థాయిలో నిర్ణయం తీసుకోనున్నారు.

ఈనామ్‌ భూములపై కసరత్తు

జిల్లాలో తాడేపల్లిగూడెం, నర్సాపురం నియోజకవర్గాల్లో ఈనామ్‌ భూములున్నాయి. వాటిని క్రమ బద్ధీకరించడానికి రెవెన్యూ శాఖ పెద్ద కసరత్తే చేసింది. భూములపై ఉన్న రైతులను గుర్తించింది. ఈనామ్‌ భూముల యజమాలను సంప్రదించింది. వారినుంచి అనుమతులు తీసుకుంది. ప్రస్తుతమున్న రైతుల పేరుతో క్రమబద్ధీకరించడానికి, రిజిస్ర్టేషన్‌లు చేసుకోవడానికి అనుమతించేలా చర్యలు తీసు కుంది. క్షేత్రస్థాయిలో భూముల హద్దులతో పాటు, రైతులను గుర్తించడానికి సర్వేయర్ల బృందాన్ని నియమించారు. పరిశీలించి హద్దులతో సహా నివేదిక సిద్ధం చేశారు. రికార్డుల్లో నమోదు చేశారు. ఇలా ఈనామ్‌ భూములపై రెవెన్యూ శాఖ జిల్లాలో శక్తికి మించి కష్టపడింది. వివాదాలను ఒక కొలిక్కి తెచ్చింది. తాడేపల్లిగూడెంలోని తాళ్ల ముదునూరుపాడులో మాత్రం ఇప్పటికీ సమస్యకు పరి ష్కారం లేకుండా పోయింది. భూయజమాని అందుబాటులో ఉండడం లేదు. దాంతో భూములు అనుభవిస్తున్న రైతులకు, భూయజమానికి మధ్య సంప్రదింపులు లేవు. దాంతో రెవెన్యూ శాఖ సైతం ఏమీ చేయలేకపోతోంది. జిల్లాలోని మిగిలిన అసైన్డ్‌, ఇతర ఈనామ్‌ భూములను రెవెన్యూశాఖ గుర్తించింది. సర్వే నంబర్లతో సహా రికార్డులను సిద్ధం చేసింది. వాటికి ఫ్రీహోల్డ్‌ నుంచి విముక్తి లభించనుంది.

Updated Date - Sep 18 , 2026 | 12:34 AM