వారు టిక్కెట్ కొనాల్సిందే..!
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:25 AM
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి పఽథకం మండలంలో వ్యాపార కేంద్రం చనుబండ చుట్టు పక్కల ఉన్న గ్రామాల మహిళలకు అందనిద్రాక్షలా మారింది.
చనుబండ చుట్టుపక్కల 15 గ్రామాలకు స్త్రీశక్తి పఽథకం అందని ద్రాక్ష
ఆంధ్ర సర్వీసులు లేక తెలంగాణ బస్సుల్లో ప్రయాణాలు
కృష్ణారావుపాలెం వరకు మెట్రో బస్సులు పొడిగించాలని పలుమార్లు వినతులు
(చాట్రాయి–ఆంధ్రజ్యోతి)
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి పఽథకం మండలంలో వ్యాపార కేంద్రం చనుబండ చుట్టు పక్కల ఉన్న గ్రామాల మహిళలకు అందనిద్రాక్షలా మారింది. విజయవాడ–సత్తుపల్లి రూటులో ఉన్న చనుబండ చుట్టుపక్కల 15 గ్రామాల మహిళలు తెలంగాణ బస్సుల్లో టిక్కెట్టు కొనుక్కొని ప్రయాణాలు చేస్తున్నారు. చనుబండ మీదుగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు గంటకు ఒక సర్వీసు చొప్పున తెలంగాణ బస్సులు నడుస్తుంటాయి. రోజు ఉదయం 6 గంటలకు మంగళగిరి ఎయిమ్స్ హాస్పటల్‌కు మాత్రమే ఒక్క ఆంధ్రా బస్సు నడుస్తుంది. సూరంపాలెం, కరుణాపురం, కృష్ణారావుపాలెం, నరసింహారావుపాలెం, సి గుడిపాడు, పర్వతాపురం, పిట్టలవారిగూడెం తదితర గ్రామాల మహిళలు, ప్రజలతో పాటు ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండల పరిధిలోని కొర్లమండ, మోతేరావుపేట, వేమిరెడ్డిపల్లి, నూతిపాడు, లక్ష్మీపురం, వీరరాఘవపురం తదితర గ్రామాలకు చెందినవారు చనుబండ వచ్చి బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. చనుబండ నుంచి విజయవాడ, నూజివీడు, విస్సన్నపేట పట్టణాలకు మహిళా ఉద్యోగులు, కార్మికులు, హాస్పటళ్లు, షాపింగ్‌లు, ఇతర పనులకు మహిళలు నిత్యం పెద్ద సంఖ్యలో వెళ్లి వస్తుంటారు. ఈ రూటులో ఆంధ్ర బస్సులు లేక తెలంగాణ బస్సుల్లో ప్రయాణిస్తుంటా రు. అయా గ్రామాల మహిళలు, ప్రజలు ఆంధ్ర బస్సులు ఎక్కాలంటే 15 కిలోమీటర్లు దూరం ఉన్న విస్సన్నపేట వెళ్లాలి. విజయవాడ నుంచి విస్సన్నపేట వరకు నడుస్తున్న మెట్రో బస్సులను తెలంగాణ సరిహద్దు కృష్ణారావుపాలెం వరకు పొడిగించాలని కోరుతున్నా ఫలితం లేదు.
స్త్రీశక్తి పథకం అందడం లేదు..
చనుబండకు చెందిన నేను నూజివీడులో చిరుద్యోగం చేస్తున్నాను. ఈ రూటులో ఆంధ్ర బస్సులు లేక తెలంగాణ బస్సుల్లో టిక్కెట్టు కొని ప్రయాణిస్తున్నాను. స్త్రీశక్తి పఽథకం అందని పరిస్థితి. ఉన్నతాధికారులు స్పందించి ఈరూటులో ఆంధ్ర బస్సులు నడిపితే మహిళలకు ఆర్థికంగా మేలు జరుగుతుంది.
– కంచర్ల తిరుమలదేవి, చనుబండ, చాట్రాయి మండలం.