శ్రీవారికే శఠగోపం
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:19 AM
శ్రీవారి ఆదాయానికి గండిపడే ఘటనలు కేవలం మూడురోజుల వ్యవఽధిలో రెండు చోటు చేసుకున్నాయి.
సెక్యూరిటీ, సేవల ముసుగులో దోపిడీ.. మూడు రోజుల్లో రెండు ఘటనలు
చినవెంకన్న ఆదాయానికి కొందరు ఉద్యోగులు, సేవకులు గండికొడుతున్నారు. ఆలయంలో ఆర్థిక లావాదేవీలున్న చోట అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు విధులు వేయకూడదన్న నిబంధనలను తుంగలోకి తొక్కి అటువంటి వారికే అధికారులు ప్రాధాన్యత కల్పించడంతో అవినీతికి ఇక్కడ బీజం పడుతోంది. పట్టుబడితే ఏముందిలే... కొద్దిరోజుల సస్పెన్షన్.. ఆ తర్వాత తమకున్న పలుకుబడితో మరల డ్యూటీకి రావచ్చు ..ఇదీ వారి ఆలోచన.
ద్వారకాతిరుమల, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి ఆదాయానికి గండిపడే ఘటనలు కేవలం మూడురోజుల వ్యవఽధిలో రెండు చోటు చేసుకున్నాయి. ఈనెల 11న భద్రతా వైఫల్యం కారణంగా సేవకుడి పేరుతో హుండీలు లెక్కించిన వ్యక్తి స్వామివారికి చెందాల్సిన 59.700 గ్రాముల బంగారు ఆభరణాలను తస్కరించాడు. తాజాగా ఈనెల 15న శ్రీవారి రూ.200ల దర్శనం టిక్కెట్ల గోల్‌మాల్ చేశాడో ప్రబుద్ధుడు.
దర్శనం నకిలీ టిక్కెట్ల వ్యవహారంలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి ఐఎస్‌జె రాజు కీలక పాత్రపోషించడం వెనుక ఇంకా ఎవరెవరి పాత్ర ఉందో విచారణలో అధికారులు తేల్చాల్సి ఉంది. ఇప్పటికే రాజుతో పాటు సెక్యూరిటీ గార్డుపై సైతం కేసు నమోదైనట్లు తెలుస్తోంది. వీరంతా భక్తుల రద్దీ అధికంగా ఉండే శని, ఆదివారాల్లో తమ అవినీతికి తెరతీస్తున్నట్లు తెలుస్తోంది. స్వామివారి దర్శనం నిమిత్తం తెచ్చిన రూ.200టిక్కెట్లను ఈ ఆదివారం స్కాన్ పాయింట్ వద్ద స్కాన్ అవకుండా నాట్ ఫౌండ్ అని వస్తోంది. దీంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ ఈ విషయాన్ని ఆలయ ఈఈ, ఆలయ ఏఈవో, సూపరింటెండెంట్‌లకు చెప్పాడు. దీంతో వారు హుటాహుటిన టిక్కెట్లను కంప్యూటర్‌లో పరిశీ లించారు. దేవస్థానం సాఫ్ట్‌వేర్‌కు సమాంతరంగా మరో సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే టిక్కెట్ల ఐడీ పీవోఎస్ (పాయింట్‌ఆఫ్‌సేల్)– 3 అని రావాలి అయితే పీవోఎస్–1 అని ఉండటంతో అనుమానం బలప డింది. దీంతో టిక్కెట్ కౌంటర్‌లోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విధుల నుంచి తొలగి ంచారు.
ఇదిలాఉంటే దేవస్థానం ఆదివారం రాత్రి దీనిపై ఓ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. అందులో సదరు టిక్కెట్లు దేవస్థానం సాఫ్ట్‌వేర్ నుంచి వచ్చినవి కావని, 61 టిక్కెట్లు తేడా వచ్చిందని తెలి పారు. దీనికి బాధ్యుడైన రాజును తాత్కా లికంగా విధుల నుంచి తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు
నకిలీ టిక్కెట్లు ఇచ్చిన ఐఎస్‌జె రాజు, స్కాన్‌చేసే చోటున్న సెక్యూరిటీ గార్డు ఎం.సతీశ్ పైనా దేవాలయ అధికారులు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై సుధీర్ తెలిపారు.
భద్రతలో డొల్లతనం..హుండీలో దొంగతనం
ఈనెల 11న హుండీలో గ్రా.59.700ల బంగారు ఆభర ణాలు చోరీకి సంబంధించి ఇరగవరం మండలం సూరం పూడికి చెందిన బొల్లా సురేశ్‌పై కేసు నమోదైంది. ద్వార కాతిరుమలతో పాటు విజయవాడ, అన్నవరం, సింహాచలం, వాడపల్లిల్లో సురేశ్ సేవకుడి ముసుగులో హుండీల లెక్కిం పులో పాల్గొంటున్నట్లు రుజువైంది. ద్వారకాతిరుమలలో 8 ఏళ్లుగా లెక్కింపులో పాల్గొంటున్న ఇతను చోరీ చేయడం ఇదే మొదటి సారా అనేది పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. సురేశ్‌తో పాటు మరో పది మంది బ్యాచ్ కూడా సేవకుల ముసుగులో ఉన్నట్టు తెలుస్తోంది.
మెటల్ డిటెక్టర్లు ఏవీ
తిరుమల తిరుపతి తరహాలో ప్రతి వారినీ భద్రతా సిబ్బంది మెటల్ డిటెక్టర్లతో స్కాన్ చేయాల్సి ఉంది. బయటకు వెళ్లేటప్పుడు మరింత క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. అయితే ఇక్కడ మొక్కుబడిగా తనిఖీలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈనెల 11న సైతం సురేశ్ బయటకు వెళ్లే ముందు సెక్యూరిటీ తనిఖీ చేసే పంపాడు. అయితే అతను ఇన్నర్‌లో బంగారం దాయడంతో కనుగొనలేకపోయినట్లు చెబుతున్నారు.