Share News

మున్సిపోల్స్‌పై ముందుకే..

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:16 AM

రాష్ట్రప్రభుత్వం మున్సిపల్‌ ఎన్నికలపై స్పష్టతతో ఉంది. విలీన గ్రామాల సమస్య ఉన్న మున్సిపాలిటీలకు సైతం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.

మున్సిపోల్స్‌పై ముందుకే..

రంగంలోకి దిగిన అడ్వకేట్‌ జనరల్‌

జిల్లాలో నాలుగు మునిసిపాలిటీల్లో కేసులు

పరిస్థితిని వివరించిన మునిసిపల్‌ కమిషనర్లు

పోలింగ్‌ బూత్‌ ఆధారంగా వార్డుల పెంపు

రాష్ట్రప్రభుత్వం మున్సిపల్‌ ఎన్నికలపై స్పష్టతతో ఉంది. విలీన గ్రామాల సమస్య ఉన్న మున్సిపాలిటీలకు సైతం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించడం ఆశావహుల్లో జోష్‌ నింపింది. విలీనం వద్దంటూ హైకోర్టులో ఉన్న కేసులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేసులపై అడ్వకేట్‌ జనరల్‌ రంగంలోకి దిగారు. జిల్లా నుంచి భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు మున్సిపల్‌ కమిషనర్‌లు, పాలకొల్లు మున్సిపాలిటీకి చెందిన పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు బుధవారం హైకోర్టుకు వెళ్లారు. కేసుల విషయంపై అడ్వకేట్‌ జనరల్‌కు వివరించారు. వీలైనంత త్వరగా కేసులు పరిష్కరించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విలీనంపై సానుకూలత లేకపోతే గ్రామా లను మినహాయించి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఈసారి కూడా ఎన్నికలు నిర్వహించక పోతే నిధులు రావన్న ఆందోళనతో ప్రభుత్వం ఉంది. అందుకోసమే రాష్ట్రవ్యాప్తంగా విలీన సమస్య ఉన్న మున్సిపాలిటీల ఎన్నికలపై శ్రద్ధ తీసుకుంది. అడ్వకేట్‌ జనరల్‌ రంగంలోకి దిగడంతో కేసులు త్వరితగతిన పరిష్కారం కానున్నాయని అధికారులు ఆశిస్తున్నారు. లేదంటే విలీన గ్రామాలను మినహాయించనున్నారు. అప్పుడు పాత వార్డుల ఆధారంగానే ఎన్నికలు జరగనున్నాయి.అయితే వార్డులను పెంచనున్నారు. ఓటర్లను కుదిస్తూ ఇటీవల మున్సిపాలిటీల్లో వార్డులను పెంచారు. విలీన సమస్యతో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో వార్డుల పెంపు ప్రక్రియ నిలిచిపోయింది. నర్సాపురం మునిసి పాలిటీ, ఆకివీడు నగర పంచాయతీలో వార్డులు పెరిగాయి.

ప్రతి రెండు బూత్‌లకు ఒక వార్డు

పట్టణాల్లో పోలింగ్‌ బూత్‌ల ఆధారంగా వార్డులను పెంచనున్నారు. ఇటీవల బూత్‌ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ప్రతి రెండు బూత్‌లకు ఒక వార్డును ఏర్పాటు చేస్తున్నారు. ఆ లెక్కన భీమవరంలో 52, తాడేపల్లి గూడెంలో 45, తణుకులో 42, పాలకొల్లులో 42 వార్డులు అయ్యే అవకాశం ఉంది. కేసుల విషయం కొలిక్కి వచ్చిన తక్షణమే వార్డుల పెంపు చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటికే లోపాయికారీగా వార్డుల విభజనపై మున్సిపల్‌ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పటిదాకా మున్సిపల్‌ ఎన్నికలపై ఒకింత స్పష్టత కొరవడింది. కూటమిలోని కొందరు నాయకులు మాత్రమే ఎన్నికలు తప్పవన్న భావనతో ఉన్నారు. ఆ దిశగా తమ ప్రయత్నాలు ప్రారంభించారు. విలీన సమస్యతోనే ఈసారి కూడా మున్సిపల్‌ ఎన్నికలు జరిగేదిలేదంటూ ఇంకొందరు భావిస్తూ వచ్చారు. ప్రభుత్వ నిర్ణయం బయటకు రావడంతో అంతా ఎన్నికలపై దృష్టి పెట్టారు. పొత్తులు, సర్దుబాటులు ఎలా ఉన్నా తమ పార్టీ తరపున పోటీ చేసే చైర్మన్‌ అభ్యర్థులు, వార్డు కౌన్సిలర్లకు సంబంధించి వివరాలు సేకరించుకుంటున్నారు.

రిజర్వేషన్‌లపై ఉత్కంఠ

రిజర్వేషన్‌లపైనా ఈసారి ముఖ్యంగా కూటమి నేతల్లో ఉత్కంఠ నెలకొంది. తణుకు, పాలకొల్లు, నరసా పురం పురపాలక సంఘాలు స్పెషల్‌ గ్రేడ్‌గా ఉన్నతి పొందడంతో అక్కడ జనరల్‌ కేటగీరీలో ఎన్నికలకు వెళ్లనున్నారు. నిబఽంధనలు అవే చెపుతున్నాయి. భీమవరం, తాడేపల్లిగూడెం మునిసిపాలి టీలనైనే ఇప్పుడు అందరి కళ్లుపడ్డాయి. ఈసారి బీసీలకు ఇక్కడ కేటాయించే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. లేదంటే జనరల్‌ మహిళకు కేటాయించే వీలుంటుందని ఆశిస్తున్నారు.రాష్ట్ర యూనిట్‌గానే మున్సిపల్‌ చైర్మన్‌లకు రిజర్వేషన్‌లు ఖరారు చేయనున్నారు. మున్సిపల్‌ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈసారి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి.

Updated Date - Aug 20 , 2026 | 12:16 AM