రైతుల కళ్లల్లో.. పండుగ వెలుగు!
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:22 AM
అన్నదాతకు ముందే సంక్రాంతి పండుగ వచ్చేసింది. ఖరీఫ్ ఽధాన్యం కొనుగోళ్లలో నిర్ధేశించుకున్న లక్ష్యాలను సాధించడమే కాకుండా ఎన్నడూ లేని విధంగా ధాన్యం సొమ్ములను 24 గంటల్లోగా చెల్లించడం అన్నదాత కళ్లల్లో ఆనందాన్ని నింపాయి.
3.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
రైతుల ఖాతాల్లో రూ.886 కోట్లు జమ
24 గంటల్లోగానే చెల్లిస్తున్న వైనం
వైసీపీ ప్రభుత్వంల ధాన్యం సొమ్ములకు అష్టకష్టాలు
తుది దశకు చేరుకున్న ధాన్యం సేకరణ
ఏలూరుసిటీ, జనవరి 5(ఆంధ్రజ్యోతి): అన్నదాతకు ముందే సంక్రాంతి పండుగ వచ్చేసింది. ఖరీఫ్ ఽధాన్యం కొనుగోళ్లలో నిర్ధేశించుకున్న లక్ష్యాలను సాధించడమే కాకుండా ఎన్నడూ లేని విధంగా ధాన్యం సొమ్ములను 24 గంటల్లోగా చెల్లించడం అన్నదాత కళ్లల్లో ఆనందాన్ని నింపాయి. సంక్రాంతి పండుగకు ముందే రైతుల ఖాతాల్లో ధాన్యం సొమ్ములు చేరడంతో వారి కుటుంబాలు పెద్ద పండుగను ఘనంగా జరుపుకునేందుకు సన్నద్దమవుతున్నాయి.
సంక్రాంతి పండుగ కు ముందుగానే ఖరీఫ్ ఽధాన్యం సొమ్ములు జిల్లా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో రైతు కుటుంబాల్లో పండగ సందడి ముందుగానే కన్పిస్తోంది. గత ప్రభుత్వంలో మాదిరిగా ధాన్యం సొమ్ములు కోసం ఎదురుచూపులు చూడాల్సిన అవసరం లేకుండా కూటమి ప్రభుత్వం 24 గంటల్లోగా ధాన్యం సొమ్ములు జమ చేయడంతో ప్రభుత్వ ధాన్యం కొను గోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించడానికి రైతులు మొగ్గు చూపారు.
రైతుల ఖాతాల్లో సొమ్ములు జమ
ఖరీఫ్ ధాన్యం సేకరణను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అక్టోబరు నుంచే ప్రారంభించింది. జిల్లాలో ఖరీప్‌లో సాగు చేసిన 2.09 లక్షల ఎకరాల్లో 6.29 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం పండుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసిం ది. ఈ మేరకు జిల్లాలో 3.95 లక్షలు మెట్రిక్ టన్నులు లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. ఇప్పటికే జిల్లాలో 3,86,135 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇందులో ఇప్పటికే రూ.886.02 కోట్ల విలువైన 3,83,931 మెట్రిక్ టన్నుల ధాన్యం సొమ్ములు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మరో రూ.18.06 కోట్లు ఖాతాల్లో జమ చేయడానికి ప్రొసెస్‌లో ఉంది. మిగిలిన రూ.3.41 కోట్లు వివిధ కారణాలతో రిజెక్ట్‌లో ఉంది.
సమర్థవంతంగా ధాన్యం సేకరణ
జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి 234 రైతు సేవా కేంద్రాలను, వాటికి 103 సహకార సొసైటీలను అనుసంధానం చేసి ధాన్యం సేకరణను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ ఏడాది ప్రకృతి కలసిరావడంతో అన్నదాతలకు ఇబ్బందులు తప్పాయి. ఆరుదల ధాన్యాన్నే ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు చేశారు. కలెక్టర్ వెట్రిసెల్వి నేతృత్వంలో జేసీ అభిషేక్ గౌడ ధాన్యం కొనుగోళ్లపై నిరంతర పర్యవేక్షణ, ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ళు చివరి అంకానికి చేరుకున్నాయని జిల్లాలో ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చేశామని జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ పి.శివరామమూర్తి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. సాధారణంగా 24 గంటల్లోపు ధాన్యం సొమ్ములు రైతులు బ్యాంకు ఖాతాల్లో వేయాల్సి ఉండగా అంతకంటే ముందుగానే చాలా మంది రైతులకు ధాన్యం సేకరించిన 3నుంచి 4గంటల లోపే వారి బ్యాంకు ఖాతాల్లో ధాన్యం సొమ్ములు జమ అయిందని, ఇది ఒక రికార్డుగా ఆయన పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో నరకం
గత ప్రభుత్వ హయాంలో ధాన్యం సొమ్ముల చెల్లింపు నకు 21 రోజులు గడువు విధించినా రైతులకు ఇక్కట్లే మిగిలాయి. ఏనాడూ ఆ ప్రభుత్వం సక్రమంగా రైతులకు ధాన్యం సొమ్ములు జమచేసిన దాఖలాలు లేవు. అన్న దాతలు విసిగివేశారి దళారులకే తమ ధాన్యాన్ని విక్రయిం చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సాగుకు చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి రైతులు ఇబ్బందులు పడేవారు. ప్రతి ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సొమ్ములు చెల్లించడానికి ఆలస్యం అయ్యేది. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో అమ్మటానికే ఇష్టపడేవారు కాదు.