Share News

అడవులను మింగేద్దాం..!

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:25 AM

పర్యావరణ పరిరక్షణ కోసం ఓ వైపు ప్రభుత్వం కోట్లాది రూపాయ లు ఖర్చు చేస్తూ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తుండగా మరోవైపు అటవీ అధికారుల నిర్వాకంతో దట్టమైన అడవులు ఖాళీ అవుతున్నాయి.

అడవులను  మింగేద్దాం..!
చల్లపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో సాగు చేస్తున్న పొగాకు పంట..

అక్రమంగా తరలిపోతున్న విలువైన కలప

సాగు భూములుగా చెల్లపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌

వేలేరుపాడు, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి):పర్యావరణ పరిరక్షణ కోసం ఓ వైపు ప్రభుత్వం కోట్లాది రూపాయ లు ఖర్చు చేస్తూ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తుండగా మరోవైపు అటవీ అధికారుల నిర్వాకంతో దట్టమైన అడవులు ఖాళీ అవుతున్నాయి. అధికారుల అనుమతి లేనిదే రిజర్వ్‌ ఫారెస్ట్‌ నుంచి చిన్న కట్టె పుల్ల కూడా బయటకు వచ్చేందుకు వీలుపడదు. కాని వేలేరుపాడు మండలంలో అడవిలోని కలపను ఇష్టానుసారం తరలిం చుకుపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు.

వేలేరుపాడు మండలం దట్టమైన అడవులకు ఒకప్పుడు కేంద్రంగా ఉండేది. వేలాది ఎకరాల్లో విస్తరించి వున్న చెల్లపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఒకప్పుడు పక్షులు, వివిధ రకాల జంతువులతో కూడిన అటవీ ప్రాంతం విస్తారంగా ఉండేది. రాజకీయ పార్టీల అండతో పోడు భూముల సాగు పేరిట వేలాది ఎకరాల్లోని అడవులను నరికి వేసి సాగు భూములుగా మార్చేశారు. ఏటా ఈ తంతు జరుగుతున్నా అటవీ శాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. సాగు భూము ల కోసం అడవిలోని చెట్లను నరికి వేయగా వచ్చిన కలపను అక్రమార్కులు ట్రాక్టర్ల ద్వారా తరలించి వంట చెరుకుగా పొగాకు బ్యారన్‌లకు తరలిస్తున్నారు. ఈ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఒకప్పుడు ఎంతో విలువైన టేకు, రోజ్‌ వుడ్‌, వేగిస, బండారు, కలపకు ప్రసిద్ధి. స్మగ్లర్ల ధనదాహానికి విలువైన కలపంతా బయటకు తరలి పోయింది. మచ్చుకు చూద్దామన్న ఒక్క టేకు చెట్టు కనిపించడం లేదు.

కుక్కునూరు అటవీ రేంజ్‌ పరిధిలోని లచ్చిగూడెం, రుద్రమ్మకోట బీటులో వెదురు విస్తారంగా ఉంది. ఈ వెదురును ఇష్టానుసారంగా నరికివేసి తరలిస్తున్నారు. అక్రమార్కులు రుద్రమ్మకోట బీటులోని వేలాది వెదురు చెట్లను నరికివేసి తరలించుకుపోతున్నారు. అటవీ శాఖ కు చెందిన కొందరు బీట్‌ ఆఫీసర్లు, అటవీ సిబ్బంది అక్రమార్కులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపి స్తున్నాయి. రుద్రమ్మకోట గుట్ట వద్ద అక్రమంగా నరికిన వెదురు బొంగులు, బడితలు గుట్టల కొద్ది తరలించ డానికి సిద్ధంగా ఉన్నాయి. అటవీ శాఖ సిబ్బంది ఆ వైపునకు వెళ్లకపోవడం ఆరోపణలకు ఆస్కారం ఇస్తోంది. ఉన్నతాధికారులు కలప అక్రమ రవాణాను అడ్డుకుని అక్రమాలకు పాల్పడుతున్న అటవీ సిబ్బందిపై చర్యలు తీసుకోకుంటే ఉన్న కాస్త అడవి కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది.

Updated Date - Feb 07 , 2026 | 12:26 AM