రొయ్యల రుచికి
ABN , Publish Date - Jun 21 , 2026 | 01:01 AM
నరసాపురం మండలం నల్లీ క్రీక్ ఆనుకుని వున్న భూముల్లో రొయ్యల సాగు చేస్తే నాణ్యమైన దిగుబడులు అధికంగా ఉంటాయి. ఇలాంటి దిగుబడి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కనిపించదు.
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 18లో మనది ఒకటి
సముద్రపు నీరు.. మంచినీరు కలిసే ప్రాంతం.. 20 వేల ఎకరాల్లో అవకాశం
నాణ్యమైన రొయ్యల దిగుబడికి.. ఎగుమతులకు అనుకూలం
ఉప్పుటేరు, యనమదుర్రు డ్రెయిన్ల ప్రక్షాళన చేస్తేనే ఫలితం
సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక సిద్ధం చేసిన జిల్లా అధికారులు
అంచనా వ్యయం రూ.990 కోట్లు.. కేంద్రానికి నివేదిక
బ్రాకిష్ వాటర్ అంటే..
మంచినీటికంటే ఉప్పగా, సముద్రపు నీటి కంటే తక్కువ ఉప్పు కలిగి వుండే నీరు. నదులు సముద్రంలో కలిసే ముఖ ద్వారాలు బ్యాక్ వాటర్స్, మడ అడవులలో ఈ నీరు ఎక్కువగా లభిస్తుంది. మంచినీరు–సముద్రపు నీరు కలిసిన మిశ్రమం. దీనినే బ్రాకిష్ వాటర్ అంటారు. ఈ నీటిలో 0.5 నుంచి 30 గ్రాముల వరకు ఉప్పు వుంటుంది.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
నరసాపురం మండలం నల్లీ క్రీక్ ఆనుకుని వున్న భూముల్లో రొయ్యల సాగు చేస్తే నాణ్యమైన దిగుబడులు అధికంగా ఉంటాయి. ఇలాంటి దిగుబడి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కనిపించదు. కారణం.. నల్లీ క్రీక్ ద్వారా వచ్చే సహజ సిద్ధమైన ఉప్పు నీరు తోడుకుని రైతులు సాగు చేయడంతో నాణ్యమైన ఉత్పత్తులకు అవకాశం ఏర్పడుతోంది. మంచి నీరు, సముద్రపు నీరు కలిసే చోట లవణీయత ఉంటుంది. రొయ్యలు, ఇతర ఉప్పు నీటి ఆక్వా సాగుకు ఈ నీరు అనుకూలం. అందుకే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 18 బ్రాకిష్ వాటర్ (లవణీయత వున్న నీరు) క్లస్టర్లను గుర్తించింది. ఇందులో ఒకటి భీమవరం క్లస్టర్. డెల్టా నుంచి డ్రెయిన్ల ద్వారా వెళ్లే నీరు, సముద్రపు ఆటు పోట్ల ద్వారా ఎగదన్నే నీరు కలిసే ప్రాంతాల పరిధిలో ఉండే భీమవరం, యలమంచిలి, మొగల్తూరు, నరసాపురం తదితర మండలాల్లో 20 వేల ఎకరాల విస్తీర్ణం బ్రాకిష్ వాటర్ క్లస్టర్ పరిధిలో ఉన్నట్టు గుర్తించారు. ఇదే నీటితో సాగు చేయాలంటూ రైతులకు జిల్లా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల కేంద్ర బృందం భీమవరం క్లస్టర్ ప్రాంతాన్ని పరిశీలించింది. ఇక్కడ అనువైన పరిస్థితులను గుర్తించి సంతృప్తి చెందింది.
విదేశాల్లో గిరాకీ
బ్రాకిష్ వాటర్‌తో సాగు చేసే రొయ్యలకు విదేశీ మార్కెట్‌లో డిమాండ్ అధికం. పెద్ద రొయ్యలు రుచి, నాణ్యతలో ఇక్కడ ఉత్పత్తులు మెరుగ్గా ఉంటాయి. అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతి అయ్యేందుకు వీలైన ఉత్పత్తులను సాధించవచ్చు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల నుంచి అమెరికాకు 60 శాతం రొయ్యలు ఎగుమతి అవుతున్నాయి. అదే బ్రాకిష్ వాటర్ సాగు ద్వారా ఉత్పత్తి అయితే మరింత డిమాండ్ ఉంటుంది. ఇతర దేశాలకంటే మన ఉత్పత్తులకు గిరాకీ అధికంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆ దిశగానే దేశవ్యాప్తంగా ఆటుపోట్ల ద్వారా సముద్ర జలాలు ఎగదన్నే ప్రాంతాలను గుర్తించి ప్రోత్సహించేందుకు సిద్ధమైంది.
సమగ్ర ప్రాజెక్ట్ నివేదికపైనే ఆశలు
కేంద్ర ప్రభుత్వం భీమవరం క్లస్టర్‌ను గుర్తించడంతో జిల్లా అధికారులు ఆ దిశగా అడుగులు వేశారు. సముద్రపు నీరు ఆటుపోట్ల ద్వారా వచ్చేందుకు వీలుగా ఉప్పుటేరు, యనమదుర్రు డ్రెయిన్, గోదావరి తీర ప్రాంతా ల్లో కలిసే డ్రెయిన్‌లను ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా పూడిక తీత, డ్రెడ్జింగ్ వంటి పనులకు నివేదిక సిద్ధం చేసింది. మరోవైపు నాణ్యత పరిశీలనకు అవసరమైన ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదన చేసి, సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను కేంద్రానికి పంపారు. జిల్లా అధికారుల అంచనా ప్రకారం బ్రాకిష్ వాటర్ సాగు పెంపుదలకు ఉప్పుటేరు, యనమదుర్రు డ్రెడ్జింగ్ చేయాలి. డ్రెయిన్లలో పూడిక తీయాలి. యనమదుర్రు కాలుష్యాన్ని అరికట్టాలి. పరీక్ష కేంద్రాలను పెంపొందించాలి. ఆ మొత్తానికి రూ.900 కోట్లు అవసరమని అంచనా వేశారు. కేంద్రానికి నివేదిక పంపారు. కేంద్రం నుంచి నిధులు రానున్నాయని జిల్లా అధికారులు ధీమాతో ఉన్నారు. కేంద్రం సానుకూలంగా స్పందిస్తే పశ్చిమ డెల్టా తీర ప్రాంత మండలాలు, ఉప్పుటేరు పరివాహక మండలాల్లో ఆక్వా సాగు రూపురేఖలు మారిపోనున్నాయి.