Share News

బంతి సాగు భళా..!

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:47 AM

సంప్రదాయ సాగుకు అదనంగా బంతి, చామంతి పువ్వుల సాగు రైతులకు కలసి వస్తొంది. మెట్ట ప్రాంతంలో పామాయిల్‌, పొగాకు, వరి, మొక్కజొన్న సాగుతో పాటు ఉద్యానవన పంటల సాగు అధికం.

బంతి సాగు భళా..!

బంతి సాగు భళా..!

రైతులకు ఆశాజనకంగా పంట

టి.నరసాపురం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : సంప్రదాయ సాగుకు అదనంగా బంతి, చామంతి పువ్వుల సాగు రైతులకు కలసి వస్తొంది. మెట్ట ప్రాంతంలో పామాయిల్‌, పొగాకు, వరి, మొక్కజొన్న సాగుతో పాటు ఉద్యానవన పంటల సాగు అధికం. అయితే మూడు, నాలుగేళ్లుగా యువ రైతులు సాంప్రదాయ సాగుతో పాటు కొత్తగా బంతి పూల సాగుకు దిగుతున్నారు. అతితక్కువ పెట్టుబడులతో పాటు అదనపు ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో రైతులు పండించిన బంతి పూల సాగు లాభదాయకంగా ఉండటంతో సాగు విస్తీర్ణం ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో ప్రతి ఏడాది అక్టోబరు నెలలో అయ్యప్ప, హనుమాన్‌, శివ, భవానీ మాలధారులు అధికంగా ఉంటారు. అక్టోబరు నెల నుంచి కార్తీకమాసం అయ్యేంత వరకు కూడా వివిధ మాలధారణలు ధరించిన వారు అధికంగా బంతి, చామంతి పూలను పూజలు, ఆలయాల అలంకరణలకు వాడుతుంది. దీంతో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లోనే ఈ ప్రాంత రైతులంతా బంతి, చామంతి సాగుకు దిగుతున్నారు. దసరా పండుగ దాటిన నుంచి బంతి, చామంతి పూలు కోతకు రావడంతో వాటికి డిమాండ్‌ పెరుగుతుంది. కేజీ బంతి రూ.50 నుంచి రూ.80 వరకు, కేజీ చామంతి రూ.150 నుంచి రూ.250 వరకు ధర పలుకుతుంది. అలాగే మహిళా రైతులు సైతం ఈ సాగు చేయడం, పూలు కోయడం వంటివి సులభంగా చేయడం కారణంగా వీటిపై ఆసక్తి చూపుతున్నారు. సులభతరంతో పాటు ఆదాయం కూడా రావడంతో ఏటా బంతి, చామంతి సాగు చేసే రైతుల సంఖ్య పెరుగుతూ వస్తొంది.

రైతులకు సిరుల పంట

బంతి సాగు కాలం తక్కువ. మొక్కనాటిన 45 రోజుల్లోనే పువ్వు కాపుకు వస్తుంది. కూలీలు ఖర్చు, చీడపురుగు బెడద తక్కువ అవ్వడంతో పెట్టుబడులు కూడా తగ్గుతాయి. ఒక ఎకరం పొలంలో బంతి పువ్వుల సాగు చేయడానికి దుక్కులు, కూలీలు కోతలు, ఎరువులు, పురుగుమందుల ఖర్చులను కలుపుకుని రూ.40వేలు ఖర్చు అవుతుంది. కాపు చేతికొచ్చిన ప్రతి వారానికి రెండు సార్లు కోత కోస్తారు. ఒక కోతకు ఎకరానికి వంద కేజీలు పండుతుంది. ప్రస్తుతం మార్కెట్‌ కేజీ రూ.60లకు పైగానే అమ్ముతున్నారు. ఇలా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు పువ్వులు పూస్తూనే ఉంటాయి. ఈ విధంగా ప్రతి రైతుకు ఒక ఎకరానికి అన్ని ఖర్చులు పోను రూ.50వేలకు పైగానే లాభం వస్తున్నట్టు రైతులు చెబుతున్నారు.

Updated Date - Jan 06 , 2026 | 12:47 AM