కొల్లేరుకు వరద
ABN , Publish Date - Nov 11 , 2026 | 12:12 AM
ఎగువన కురిసిన భారీ వర్షాలకు కొల్లేరుకు భారీగా వరద నీరు చేరడంతో ముంపు ముప్పు పొంచి ఉంది.
గ్రామాలను చుట్టుముడుతున్న నీరు
తూడుతో స్తంభించిన డ్రెయిన్లు
తొలగింపు పనులు ముమ్మరం
సమీప గ్రామాల్లో భయాందోళన
ఎగువన కురిసిన భారీ వర్షాలకు కొల్లేరుకు భారీగా వరద నీరు చేరడంతో ముంపు ముప్పు పొంచి ఉంది. కాలువలు, డ్రెయిన్ల ద్వారా పెద్దఎత్తున నీరు కొల్లేరులో చేరడంతో మండవల్లి మండలం పెనుమాకలంక, పెద్దఎడ్లగాడి రహదారి నీట మునిగింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలకు ముంపు తీవ్రంగా ఉన్నందున ఆ నీరంతా మరో రెండు రోజుల్లో కొల్లేరు సరస్సులోనికి చేరుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
కైకలూరు/మండవల్లి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): కొల్లేరు లో పెనుమాకలంక, ఇంగిలిపాకలంక, నందిగామలంక, శ్రీరామ్‌నగర్, మణుగులూరుకు వరద పొంచి ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెద్ద, చిన్న ఎడగాడి వద్ద గుర్రపుడెక్క, తూడు, కిక్కిస పెద్దఎత్తున మేట వేయడంతో నీటి ప్రవాహానికి అవరోధంగా మారింది. మరింత వరద నీరు చేరితే దిగువకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో గ్రామాలు ముంపు బారిన పడనున్నాయి. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చొరవతో పెద్దఎడ్లగాడి వద్ద గుర్రపుడెక్క తొలగింపు పనుల ను చేపట్టారు. బుడమేరు, రామిలేరు డ్రెయిన్ల నీరంతా కొల్లేరు సరస్సులో చేరి అక్కడ నుంచి సర్కారు కాలువ నుం చి ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి చేరుతుంది.
మండవల్లి మండలం పెద్ద ఎడ్లగాడి, చిన్న ఎడ్లగాడి వద్ద రహదారిపై స్వల్పంగా నీరు చేరింది. ప్రస్తుతానికి రాకపోకలు సాగుతున్నప్పటికీ భారీగా వరద నీరు చేరితే రహదారి పూర్తిగా నీట మునుగుతుంది. కైకలూరు మండలంలో పక్షుల కేంద్రం వద్ద పోల్‌రాజ్ డ్రెయిన్ ఉధృతంగా ప్రవహిస్తోంది. కోమటిలంక రహదారి కొట్టుకుపోవడంతో రేకు పడవలపై ప్రజలు రాకపోకలను సాగిస్తున్నారు. పక్షుల కేంద్రం గట్లు సైతం కొల్లేరు గర్భంలో కలిసిపోతోంది. ఎగువ నుంచి మరిం త వరద వస్తుందని ప్రజలు అంచనా వేస్తున్నారు. రోజు రోజుకు కొల్లేరు నీటిమట్టం పెరుగుతోంది. మరింత ముంపుతో గ్రామాలకు గ్రామాలు, రహదారులు నీటమునిగే పరిస్థితులు నెలకొంటాయని ప్రజలు వాపోతున్నారు.